JD Chakravarthy: బాలీవుడ్ నాకు పొరుగు ఇల్లు లాంటిది, అందుకే కొంతకాలం అటువైపు వెళ్లి వచ్చా
ABN , First Publish Date - 2023-08-02T18:49:06+05:30 IST
ఆర్జీవీ మొదటిసారిగా దర్శకత్వం చేసిన 'శివ' సినిమాతో పరిచయం అయిన జేడీ చక్రవర్తి, ఆ సినిమా పాత్ర అయినా జేడీ గానే అందరికి సుపరిచితం. ఇప్పుడు 'దయా' అనే వెబ్ సిరీస్ తో ఓటిటి లోకి అడుగుపెడుతున్నారు. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
జేడీ చక్రవర్తి (JDChakravarthy), ఈషా రెబ్బా (EeshaRebba), నంబీషన్ రమ్య (RemyaNambeesan), కమల్ కామరాజ్ తదితరులు ముఖ్య పాత్రలో నటించిన ‘దయా’ #DayaaWebSereis వెబ్ సిరీస్ ఈ నెల 4న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో (DisneyPlusHotStar) స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ కి దర్శకుడు పవన్ సాధినేని (PavanSadhineni), కాగా శ్రీకాంత్ మొహతా, మహేంద్ర నిర్మాతలు. వెబ్ సిరీస్ మొదటిసారి చేస్తున్న జేడీ చక్రవర్తి ఈ వెబ్ సిరీస్ గురించి అలాగే అతని రాబోయే సినిమాల గురించి చెప్పిన విషయాలు.
మొదటి నుండీ కంటెంట్ నమ్మే నటుడిని నేను అని చెప్తాడు జేడీ. 'దయా' #Dayaa కథను దర్శకుడు పవన్ సాధినేని చెప్పిన విధానం నచ్చి ఈ వెబ్ సిరీస్ లో నటించేందుకు అంగీకరించాను అని అన్నాడు. అయితే హాట్ స్టార్ నుంచి ఈ వెబ్ సిరీస్ కోసం తరుచూ తనని సంప్రదించారని, అయితే వెబ్ సిరీస్ చేసే మూడ్ లో లేకపోవటం వలన, డెసిషన్ చెప్పకుండా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చానని చెప్పాడు జేడీ. అయితే వాళ్లు వదలకుండా సినాప్సిస్ వినండి అని స్క్రిప్ట్ పంపారు. తర్వాత దర్శకుడు పవన్ సాధినేని ఫోన్ లో పది నిమిషాలు కథ వినిపించాడు. అప్పుడు స్టోరీ వినకుండానే ఈ వెబ్ సిరీస్ చేస్తున్నా అని అతనికి చెప్పా.
ఎందుకంటే గతంలో ఆర్జీవీ (RGV) చెప్పిన మాటలు జేడీ కి గుర్తుకువచ్చాయి. ఏ దర్శకుడైనా పది నిమిషాల్లో కథ చెప్పగలిగితే అతనికి ఆ స్క్రిప్ట్ మీద కమాండ్ ఉన్నట్లు అని ఆర్జీవీ అనేవారు. పవన్ ఫోన్ లో పది నిముషాలు స్టోరీ చెప్పినప్పుడే అతనికి కథ మీద ఉన్న పట్టు తెలిసింది. దాంతో ఫుల్ నెరేషన్ వినకుండానే ఓకే చెప్పాను అని ఈ వెబ్ సిరీస్ ఎలా వొప్పుకున్నదీ చెప్పుకొచ్చాడు జేడీ.
ఈ వెబ్ సిరీస్ లో జేడీ ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ గా చేసాడు. చేపలను ఒక ఊరి నుంచి మరో ఊరికి తీసుకెళ్లడం అతని పని. ఆ ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ కు ఒకరోజు అమ్మాయి శవం కనిపిస్తుంది, అయితే పోలీసులకు చెప్పేంత ధైర్యం అతనిలో ఉండదు. ఆలా భయంలో ఉండగానే ఇంకో శవం దొరుకుతుంది. సాదాసీదా జీవితం గడిపే ఆ డ్రైవర్ జీవితాన్ని ఈ ఘటనలు ఎటువంటి మలుపు తిప్పుతాయి, ఆ ఎమోషన్స్ అన్నీ దయాలో చూస్తారు అని చెప్పాడు.
బాలీవుడ్ గురించి మాట్లాడుతూ, "బాలీవుడ్ నాకు పొరుగు ఇల్లు లాంటిది. అందుకే కొంతకాలం అటువైపు వెళ్లి వచ్చా. అయితే నా బలం తెలుగు చిత్ర పరిశ్రమ. అందుకే మళ్లీ ఇక్కడ ప్రాజెక్ట్స్ చేస్తున్నా," అని చెప్పాడు. పరిశ్రమలో డిమాండ్ అండ్ సప్లై గురించి అందరికీ తెలిసిందే, అయినా జేడీ కోసం విపరీతంగా ఆఫర్స్ వస్తున్నాయి అయినా అతను చేయడం లేదని చెప్పడం అబద్ధమే అవుతుంది అని అంటున్నాడు. అయితే కొన్ని క్యారెక్టర్స్ మాత్రం నచ్చక వదిలేస్తున్నవీ ఉన్నాయి అని అన్నాడు.