Brahmamudi serial: కూకట్‌పల్లిలో 'బ్రహ్మముడి' నటీనటుల గ్రాండ్ బరాత్
ABN , Publish Date - Dec 18 , 2023 | 03:43 PM
'బ్రహ్మముడి' సీరియల్ లో నటించిన నటీనటులు అభిమానులతో ఆడుతూ, పాడుతూ తమ సీరియల్ లో ఏ విధంగా అయితే బరాత్ జరిపారో, అదే విధంగా కూకట్ పల్లి లో నిజమైన అభిమానులతో జరిపారు.
ప్రముఖ టెలివిజన్ సీరియల్ 'బ్రహ్మముడి' నుండి కళ్యాణ్ మరియు అనామిక కలయికను పురస్కరించుకుని ఆ సీరియల్ ప్రసారం చేస్తున్న స్టార్ మా, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తమ అభిమానులతో గ్రాండ్ బరాత్ జరుపుకుంది.
అందమైన జంట స్టార్ పెయిర్, షో నుండి రాజ్ మరియు కావ్య (మానస్ మరియు దీపిక), కలసి సోదర ఆహ్వానాలను అందించడానికి కూకట్‌పల్లి ప్రాంతంలోని కొందరి ఇళ్లకు వ్యక్తిగతంగా వెళ్లి తన సోదరుడు పెళ్లి బరాత్ కి వారి అభిమాన ఫ్యాన్స్ ను ఆహ్వానించారు. ఈ వేడుకని అభిమానులతో ఎంతో సంబరంగా జరుపుకున్నారు.
కూకట్‌పల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి సాయంత్రం 4 గంటలకు బరాత్ ఊరేగింపు ప్రారంభమై కూకట్‌పల్లిలోని భువన విజయం మైదానంలో ముగిసింది. ఈ ఊరేగింపులో పాల్గొన్న అభిమానులకు ఈ సీరియల్ లో నటించిన నటీనటులతో వేడుకలో పాల్గొనడానికి, అలాగే ఈ సీరియల్ కొన్ని ఎపిసోడ్స్ లో కనిపించే అవకాశాన్ని కల్పించడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఈ ఛానల్ ఈ ఈవెంట్ ని జరిపింది.
అలాగే ఈ సీరియల్ లో నటించిన నటీనటులతో వచ్చిన అభిమానులు అందరికీ సెల్ఫీలు తీసుకునే ఏర్పాటు కూడా చెయ్యడంతో, అభిమానులు అందరూ ఎంతో సంతోషం పొందారు. ఇది ఒక అద్భుతమైన అనుభూతిగా అభిమానులు భావించారు. అలాగే వచ్చిన అభిమానులని నిరుత్సాహ పరచకుండా, సీరియల్ లోని నటీనటులు వాళ్ళతో పాటు గెంతుతూ, నృత్యాలు చేశారు, పాటలు పాడారు.
ఈ 'బ్రహ్మముడి' సీరియల్ కి వచ్చిన అపురూప స్పందన చూసి, స్టార్ మా ఇక ముందు ఇలాంటి మరిన్ని ఈవెంట్స్ చెయ్యడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో పాల్గొన్న అభిమానులందరూ ఎంతో ఓపికగా తమ అభిమాన నటీనటులను చూడటానికి ఎదురుచూసినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసింది.