ఈ ఫోటోలో వున్నామె తెలుగు నటులందరితో 800కి పైగా సినిమాలలో నటించారు, ఇంతకీ ఎవరీమె...
ABN , First Publish Date - 2023-12-16T12:10:26+05:30 IST
మూడు తరాల నటులతో నటించడం అంటే మాటలు కాదు. కానీ ఆమె తన సినీ ప్రస్థానం 1940వ దశకం నుండి మొదలుపెట్టి సుమారు ఆరు దశాబ్దాలకి పైగా అందరి నటులతో నటించి శెభాష్ అనిపించుకున్నారు. ఇంతకీ ఎవరు ఆమె, చదవండి.
పై ఫోటో చూసారు కదా. ఆమె తెలుగు చలన చిత్ర సీమ మొదలైన తరువాత అంటే 1940 వ దశకం నుండి వున్నారు. కొన్ని దశాబ్దాల పాటు తెలుగు చలన చిత్రసీమలో తన నటనతో అలరించి సుమారు 800కి పైగా చిత్రాలలో నటించారు. అప్పటి తరం నటులతోటే కాదు, ఆ తరువాత రెండు మూడు తరాల నటులతో కూడా నటించారు. కొందరికి తల్లిగా, అమ్మమ్మగా, నయనమ్మగా, తల్లిగా, అత్తగా ఇలా ఒకటేమిటి ఎన్నో పాత్రల్లో ఎందరితోతో నటించి తన ప్రతిభా పాటవాలని చాటుకున్నారు. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారు.
ఆమె మరెవరో కాదు, నిర్మలమ్మగారు. తన 16వ ఏట అంటే 1943లో 'గరుడ గర్వభంగం' అనే సినిమాలో నటించారు. ప్రతిభ ఫిలిమ్స్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమాకి ఘంటసాల బలరామయ్యగారు దర్శకుడు, నిర్మాత. ఇందులో భానుమంతి సత్యభామగా వేస్తె, ఆమెకి చెలికత్తెలుగా ఒకరు నిర్మలమ్మ ఇంకొకరు టీజీ కమల వేశారు. అప్పట్లో చెలికత్తె అంటే నిర్మలమ్మనే ఆ సినిమాలో తీసుకునే వారని చెపుతూ ఉండేవారు.
ఆ తరువాత 'పాదుకా పట్టాభిషేకం' అనే సినిమాలో కూడా నిర్మల ని తీసుకున్నారు, ఆ సినిమా చూడటానికాని విజయవాడ వెళితే, ఆ సినిమాలో నిర్మలమ్మ ఎక్కడా కనిపించలేదుట. అందుకని విజయవాడలో ఉండిపోయి, నాటకాలు వేస్తూ, రేడియో ప్రోగ్రాములు ఇస్తూ కాలక్షేపం చేసేవారట. ఆ తరువాత మళ్ళీ చెన్నై వచ్చి సినిమాలలో నటిస్తూ మరి వెనక్కి చూసుకోకుండా సుమారు ఆరు దశాబ్దాల పాటు చలన చిత్ర రంగంలో తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించారు నిర్మల.
ఆమె చలన చిత్ర రంగానికి రావటం ఆమె ఇంట్లో ఇష్టపడేవారు కాదట. ఆమె కుటుంబంలో కూడా ఎవరూ చలన చిత్ర రంగంలో లేరని చెపుతూ ఉండేవారు నిర్మలమ్మ. ఇంట్లో వాళ్ళూ, కుటుంబ సభ్యులూ వద్దన్నా వినకుండా వచ్చి సినిమాలో చేరినందుకు, ఆమె ఎంతో విజయం సాధించి ఎవరైతే వద్దన్నారూ వాళ్ళందరి చేత శెభాష్ అనిపించుకున్నారు నిర్మల.
అప్పట్లో గొప్ప నటులు అయిన ఎస్వి రంగారావు (SVRangaRao), చిత్తూరు నాగయ్య లకి భార్యగా నటించడం, తల్లిగా నటించడం తన కెరీర్ లో ఓ గొప్ప అనుభూతి అని చెప్పేవారు. అలాగే కమల్ హాసన్ (KamalHaasan) నటించిన 'అమావాస్య చంద్రుడు' లో ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఎల్వి ప్రసాద్ (LVPrasad) తో నటించడం ఇంకొక మరపురాని అనుభూతిగా చెప్పేవారు.
కేవీ రెడ్డి, బిఎన్ రెడ్డి లు తప్ప, అందరి దర్శకులతో నిర్మలమ్మ పనిచేశారు. ఆమె ఎక్కువ సినిమాలు దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు (DasariNarayanaRao) తో చేశారు. సుమారు 64 సంవత్సారాలు సుదీర్ఘంగా చలన చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులలో నాయనమ్మ, అమ్మమ్మ, బామ్మ లాంటి పాత్రలతో చెరగని ముద్ర వేశారు నిర్మలమ్మ. 1920, జులై 18 న పుట్టిన నిర్మలమ్మ ఫిబ్రవరి 19, 2009 లో పరమపదించారు.