Balakrishna and Sridevi Combo: ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ని మించి ఉండాల్సిన సినిమా.. ఆగిపోయింది
ABN , First Publish Date - 2023-06-28T20:27:20+05:30 IST
ఎన్టీఆర్, అందాల నటి శ్రీదేవి కాంబినేషన్ అనగానే నందమూరి అభిమానుల గుండెల్లో ఆనందం ఓషన్‌లా ఉప్పొంగుతుంది. ‘వేటగాడు’ చిత్రంతో జనాలకి పిచ్చెక్కించిన క్రేజీ కాంబినేషన్ ఇది. ఈ కాంబినేషన్ తర్వాత ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణతో కూడా శ్రీదేవి నటించాల్సి ఉంది. బాలయ్య, శ్రీదేవి కాంబినేషన్‌లో.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మాతగా భారీ స్థాయిలో ఓ చిత్రాన్ని ప్లాన్ చేశారు కానీ.. ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు.
ఎన్టీఆర్ (NTR), అందాల నటి శ్రీదేవి (Sridevi) కాంబినేషన్ అనగానే నందమూరి అభిమానుల గుండెల్లో ఆనందం ఓషన్‌లా ఉప్పొంగుతుంది. ‘వేటగాడు’ (Vetagadu) చిత్రంతో జనాలకి పిచ్చెక్కించిన క్రేజీ కాంబినేషన్ ఇది. ‘బడిపంతులు’ (Badi Panthulu) చిత్రంలో ఎన్టీఆర్‌కు మనవరాలిగా నటించిన శ్రీదేవి.. సరిగ్గా ఏడేళ్ల తర్వాత ఆయన సరసన కథానాయికగా నటించడం ‘వేటగాడు’ చిత్రం ప్రత్యేకత. నిన్నగాక మొన్న మా ఒడిలో కూర్చున్న ఆ చిన్నపిల్ల హీరోయినా అని మొదట ఎన్టీఆర్ ఆమెతో నటించడానికి సందేహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఆయన సరసన వాణిశ్రీ, జయసుధ, జయప్రద నటిస్తూ ఉండేవారు. అయితే శ్రీదేవి కూడా ఆ సమయంలో కొన్ని చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తుండడంతో.. కొత్త కాంబినేషన్ బాగుంటుంది అని ఎన్టీఆర్‌కు నచ్చజెప్పి ఒప్పించారు రాఘవేంద్రరావు (Raghavendra Rao). ఈ జంట విషయమై బయట ఎంత దుమారం చెలరేగినా రాఘవేంద్రరావు వెనుకంజ వేయలేదు. సినిమా విడుదలయ్యాక ఎన్టీఆర్, శ్రీదేవి జంటకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ఆ తర్వాత ‘కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి’ ఇటువంటి చిత్రాలను ఎన్టీఆర్, శ్రీదేవి కాంబినేషన్‌లో (NTR And Sridevi Combo) రూపొందించారు రాఘవేంద్రరావు.
ఆ తర్వాత బాలకృష్ణ (Balakrishna), శ్రీదేవి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు వస్తుందా? అని ఆశగా ఎదురు చూసిన అభిమానులకు 1991లో శుభవార్త చెప్పారు రాఘవేంద్రరావు. నందమూరి బాలకృష్ణ, గ్లామర్ క్వీన్ శ్రీదేవి అపూర్వ కాంబినేషన్‌లో.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపుదిద్దుకోనుంది అనే వార్తను 1991 జనవరి నెలలో పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), శ్రీదేవి, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ (JVAS) వంటి విజువల్ వండర్ నిర్మించిన అశ్వినీదత్ (Aswani Dutt) ఈ చిత్రాన్ని నిర్మిస్తారని కూడా ఆనాటి పత్రికలు పేర్కొన్నాయి. ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రం 1991 మే నెలలో స్విట్జర్లాండ్‌లో ప్రారంభమవుతుందనీ నాటి పత్రికల్లో పేర్కొన్నారు. సినిమా స్కోపులో ఫోర్ ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ సిస్టమ్‌లో రూపుదిద్దుకునే ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకత్వం వహిస్తారని, విన్సెంట్ ఛాయాగ్రహకుడని కూడా అప్పట్లో పేర్కొన్నారు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉంటాయి కనుక అందరినీ అలరించే విధంగా ఓ వెరైటీ కథను తయారు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా రూపుదిద్దుకుంటుందని ఆ రోజుల్లో ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఆశగా ఎదురు చూడటం అభిమానులు వంతయింది.
అయితే ఆ తర్వాత ఏం జరిగిందో కానీ.. ఈ సినిమా గురించి కొత్త వార్తలు రాలేదు. మే నెలలో స్విట్జర్లాండ్‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని ఆశగా ఎదురు చూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇలా ప్రారంభ దశలోనే బాలకృష్ణ, శ్రీదేవి కాంబినేషన్ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా తీయడానికి ఏ నిర్మాత ప్రయత్నించలేదు. బాలకృష్ణ, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో అశ్వినీదత్ ‘అశ్వమేధం’ (Aswamedham) చిత్రం నిర్మించారు కానీ అందులో నగ్మా (Nagma) కథానాయికగా నటించారు.
-వినాయకరావు
ఇవి కూడా చదవండి:
**************************************
*Number One: ఇక కృష్ణ పని అయిపోయిందనుకునే టైమ్‌లో.. చిరు, నాగ్‌లకు షాకిస్తూ..!
**************************************
*Bro: బ్రో వచ్చాడు.. డబ్బింగ్ చెప్పేశాడు.. టీజర్‌కి లైన్ క్లియర్ చేసేశాడు
**************************************
*VJ Sunny: విజె సన్నీ పెడతానన్న, చెబుతానన్న న్యూ పార్టీ ఇదే..
**************************************
*Varun Tej: ‘గాంఢీవధారి అర్జున’ నుంచి అప్‌డేట్ వచ్చేసింది.. ఆగస్ట్‌లో యుద్ధమే!
**************************************
*Chiranjeevi: అతనంటే చరణ్‌కి చాలా ఇష్టం
**************************************