పేరు కోసం పోటీ పడిన హీరోలు
ABN , First Publish Date - 2023-01-05T03:51:29+05:30 IST
హీరో కృష్ణ 1973లో 14 చిత్రాల్లో నటించారు. మరో విషయం ఏమిటంటే ఆ ఏడాది లోనే నెల రోజుల వ్యవధిలో ఆయన నటించిన నాలుగు చిత్రాలు విడుదల కావడం, నాలుగూ ఘన విజయం సాధించడం...

హీరో కృష్ణ 1973లో 14 చిత్రాల్లో నటించారు. మరో విషయం ఏమిటంటే ఆ ఏడాది లోనే నెల రోజుల వ్యవధిలో ఆయన నటించిన నాలుగు చిత్రాలు విడుదల కావడం, నాలుగూ ఘన విజయం సాధించడం ఒక విశేషంగా చెప్పాలి. జూలై 12న ‘పుట్టినిల్లు.. మెట్టినిల్లు’ జూలై 20న ‘స్నేహబంధం’, జూలై 27న ‘ నేరం శిక్ష’, ఆగస్టు 3న ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రాలు విడుదల అయ్యాయి. ఇందులో రెండు మల్టీ స్టారర్ చిత్రాలు ఉండడం గమనార్హం.అలాగే తన సహచర నటుడు శోభన్ బాబుతో కలసి రెండు సినిమాల్లో నటించారు కృష్ణ. వాటిల్లో ‘పుట్టినిల్లు మెట్టినిలు’ ఒకటి. తమిళంలో విజయం సాధించిన ‘ పుగంద వీడు’ చిత్రం ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. తమిళ వెర్షన్ కు దర్శకుడైన పట్టు తెలుగు చిత్రానికీ దర్శకత్వం వహించారు. ఆయన పూర్తి పేరు ఆర్. పట్టాభిరాం. తమిళంలో ఏవీఎం రాజన్, రవిచంద్రన్ పోషించిన పాత్రలను తెలుగులో కృష, శోభన్ బాబు చేశారు. తమిళంలో తను పోషించిన పాత్రనే తెలుగులోనూ పోషించారు చంద్రకళ. లక్ష్మీ మరో కథానాయిక. కృష్ణ, శోభన్ బాబు కలసి నటించిన ఆరో చిత్రం ‘పుట్టినిల్లు మెట్టినిల్లు’ ఇందులో కృష్ణకు చెల్లెలుగా లక్ష్మీ, శోభన్ బాబు సోదరిగా చంద్రకళ నటించారు. గారాబంగా పెరిగిన చెల్లెలి కోసం ఎటువంటి త్యాగానికైనా వెనుకాడని అన్న పాత్రలో కృష్ణ అద్భుతంగా నటించారు. అలాగే శోభన్ బాబు పోషించిన పాత్ర కూడా ఉదాత్తమైనదే. తల్లి కోసం తాళి కట్టిన భార్యను కూడా తిరస్కరించే పాత్ర అది. ఆయన తల్లిగా మహా నటి సావిత్రి నటించారు. మదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్ అంశాలతో రూపుదిద్దుకున్న ఈ సినిమా లో కృష్ణ, శోభన్ బాబు నువ్వా నేనా అనే రీతిలో పోటీపడి నటించారు. ఇద్దరూ పాపులర్ హీరోలు కావడంతో ఈ రెండు పాత్రలను బ్యాలన్స్ చేస్తూ కథ నడిపించారు దర్శకుడు పట్టు.ఈ సినిమాలో సంగీతాన్ని ప్రేమించే రవి పాత్రను శోభన్ బాబు పోషించారు. ఆయన పై చిత్రీకరించిన ‘ఇదే పాట ప్రతి చోట.. ఇలాగే పాడుకుంటాను’ అనే గీతం సినిమాకే హైలైట్ గా నిలిచింది. అలాగే కృష్ణ, చంద్రకళ పై చిత్రీకరించిన ‘ సిరిమల్లె సొగసు. జాబిల్లి వెలుగు నీ లోనే చుశానులే’ పాట కూడా పాపులర్ అయింది.
ఏవీఎం సంస్థ అంతకుముందు‘ భూ కైలాస్’ చిత్రాన్ని నిర్మింంది. అందులో ఎన్టీఆర్ రావణాసురుడిగా, ఏ ఎన్నార్ నారదుడిగా నటించారు. ఇద్దరూ అగ్ర హీరోలే. తన పాత్ర పరిధి తక్కువే అయినా ఇచ్చిన మాట కోసం అక్కినేని నారదుడి పాత్ర పోషించారు. చిత్ర నిర్మాణంలో ఎంతో సహకరించారు. అయితే పబ్లిసిటీ విషయం వచ్చేసరికి పేచీ మొదలైంది. తన పేరు ముందు రావాలని ఇద్దరు హీరోలూ పట్టుబట్టారు.
ఏవీయం చెట్టియార్ పెద్ద నిర్మాతే. అయినా ఈ విషయంలో ఎటూ తేల్చలేక పేర్లు వేయకుండానే సినిమాను విడుదల చేశారు. ‘పుట్టినిల్లు మెట్టినిల్లు’ టైటిల్స్ లో తన పేరు ముందు రావాలని కృష్ణ, శోభన్‌బాబు.. ఇద్దరూ పట్టుబట్టారు. దాంతో వాళ్ల పేర్లు వేయకుండానే ఫొటోలు మాత్రం చూపించి, మిగిలిన వారందరి పేర్లు వేశారు చెట్టియార్.