2023 year ender: అక్కినేని తొక్కినేని, అంబటి రాంబాబు, మంచు బ్రదర్స్ ఇవే టాప్ వివాదాలు

ABN , Publish Date - Dec 16 , 2023 | 03:34 PM

అన్నదమ్ముల మధ్య ఘర్షణ, వివాదంలో ఒక ప్రముఖ యాంకర్, నటి, అక్కినేని తొక్కినేని వివాదాస్పద అంటూ వ్యాఖ్య, వ్యాధిని వాడుకుంటోంది అంటూ విమర్శ ఇలా ఈ సంవత్సరంలో వివాదాలులో కొన్ని....

2023 year ender: అక్కినేని తొక్కినేని, అంబటి రాంబాబు, మంచు బ్రదర్స్ ఇవే టాప్ వివాదాలు
Controversies that happened in 2023

ఈ 2023 సంవత్సరంలో కొన్ని వివాదాలు మరిచిపోలేనివి, కొన్ని అనవసరంగా వచ్చాయి, ఇంకా కొందరి వివాదాలు సృష్టించుకున్నారు, ఇలా ఒకటేమిటి ఈ సంవత్సరం కూడా టాలీవుడ్ వివాదాల్లో వుంది. అయితే ఎన్నో వివాదాలు అయినప్పటికీ, ఈ సంవత్సరంలో బాగా వైరల్ అయినా వివాదాలు మాత్రం కొన్నే.

Balakrishna.jpg

నందమూరి బాలకృష్ణ:

ఈ సంవత్సరం మొదట్లో 'వీరసింహా రెడ్డి' సినిమా విడుదలైంది, ఇందులో నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా నటిస్తే, గోపీచంద్ మలినేని దర్శకత్వం చేశారు. ఈ సినిమాకి చెందిన ఒక ప్రచార సభలో నందమూరి బాలకృష్ణ 'అక్కినేని తొక్కినేని' అంటూ నోరు జారారు. ఇది ఒక పెద్ద వివాదం అవటమే కాకుండా, అక్కినేని నాగేశ్వర రావు అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యకి నటుడు నాగ చైతన్య, అఖిల్ అక్కినేని కూడా తమ సాంఘీక మాధ్యమంలో స్పందించారు. అక్కినేని అభిమానులు బాలకృష్ణని క్షమాపణలు చెప్పమని అడిగారు, కానీ బాలకృష్ణ చెప్పలేదు.

అటువంటిదే ఇంకొక వివాదంలో కూడా బాలకృష్ణ ఉండటం ఆసక్తికరం. తెలుగు దేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంగా చిత్ర పరిశ్రమ నుండి ఎక్కువ స్పందన రాలేదని, అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఎటువంటి వ్యాఖ్య చేయకపోవటంపై బాలకృష్ణ 'ఐ డోంట్ కేర్' అనటం కూడా ఒక వివాదం అయింది.

samanthacontroversy.jpg

సమంత, చిట్టిబాబు

సమంత సినిమా 'శాకుంతలం' విడుదలైంది ఈ సంవత్సరమే. గుణశేఖర్ దీనికి దర్శకుడు, దిల్ రాజు నిర్మాత. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విఫలం అయింది. ఈ సినిమా విడుదలకి ముందు సమంత మయోసిటిస్ (Myositis) అనే వ్యాధితో బాధపడుతూ కూడా సినిమా ప్రచారాలు చేసింది. అయితే నటుడు, నిర్మాత అయిన చిట్టిబాబు కొన్ని యూట్యూబ్ చానెల్స్ తో మాట్లాడుతూ సమంతకి వచ్చిన ఈ వ్యాధి సాధారణమైనదే అనీ, కానీ ఆమె సినిమా విడుదలకి ముందు ఈ వ్యాధి పేరు చెప్పి చాలా సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అదీ కాకుండా ఆమె సినిమాలో బాగోలేదని ఆమె గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆమె గ్లామర్ తగ్గిపోయిందని, సినిమా ఫ్లాపు అవటానికి ఆమే ముఖ్య కారణం అన్నట్టుగా చిట్టిబాబు వ్యాఖ్యలు చెయ్యడంతో ఇది ఒక పెద్ద వివాదం అయింది.

ఇతని వ్యాఖ్యలకి సమంత వైవిధ్యంగా స్పందించింది. చిట్టిబాబుకి చెవుల్లో వెంట్రుకలు ఎక్కువ ఉంటాయి, అందుకని సమంత దాని గురించి చెపుతూ, కొంతమందికి చెవుల నుండి జుట్టు ఎలా పెరుగుతోంది అనే విషయం ఇంటర్నెట్‌లో చూస్తే టెస్టోస్టెరాన్ పెరగడం వల్ల జరుగుతుందని ఒక పోస్ట్ పెట్టింది. ఇది చిట్టిబాబుని ఉద్దేశించి సమంత చెప్పింది అని అందరికీ అర్థం అయింది, ఈ వివాదం కొన్ని రోజులు నడిచింది.

ambatirambabucontroversy.jpg

పవన్ కళ్యాణ్, అంబటి రాంబాబు

పవన్ కళ్యాణ్ (PawanKalyan), అతని మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా 'బ్రో'. సముద్రఖని దర్శకుడు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం చేశారు. ఈ సినిమాలో ఒక పాత్రలో 30 ఇయర్స్ పృథ్వి (30YearsPrudhvi) ఒక పాత్ర పోషించాడు, అది ఆంధ్ర రాజకీయ నాయకుడు, జగన్ కాబినెట్ లో మంత్రి అయిన అంబటి రాంబాబును ఉద్దేశించి చేసిన పాత్ర అని ఆ సినిమా విడుదలయ్యాక వివాదం అయింది. అయితే తన పాత్ర ఎవరిని ఉద్దేశించి పెట్టలేదు, రాయలేదు అని ఆ పాత్ర చేసిన నటుడు పృథ్వి అన్నారు. కానీ అంబటి రాంబాబు మాత్రం ఆ పాత్ర తనని ఎగతాళి చెయ్యడానికి పెట్టారని అంటూ పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి 'బ్రో' సినిమా రివ్యూ ఇచ్చారు, ఆ సినిమా కలెక్షన్స్ చెప్పారు. ఇవన్నీ వివాదాలుగా మారాయి. అలాగే పవన్ కళ్యాణ్ కి విమర్శిస్తూ రాంబాబు కొన్ని సినిమా టైటిల్స్ ప్రెస్ మీట్ లో ప్రకటించటం లాంటివి కొన్ని రోజులు వివాదాలు నడిచాయి.

vijayanasuyacontroversy.jpg

ది విజయ్ దేవరకొండ, అనసూయ

సౌత్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన నటుడు విజయ్ దేవరకొండ, అతను ఏమి చేసినా అది వార్తల్లో ఉంటుంది. అతను తన పేరు ముందు 'ది విజయ్ దేవరకొండ' అని రాసుకున్నాడు. అయితే అది అతని వ్యక్తిగతం, మిగతావాలకి అది అనవసరం. కానీ ప్రముఖ యాంకర్, నటి అయిన అనసూయ అదేదో పెద్ద తప్పిదం అయినట్టు 'ది' అనే పదం మీద వ్యంగంగా విమర్శలు చేసింది. ఇంకేముంది విజయ్ అభిమానులు అందరూ అనసూయని విమర్శించారు. ఇదంతా సాంఘీకమాధ్యమంలో జరిగింది. అసలు విజయ్ ఏమి పెట్టుకుంటే ఈమెకెందుకు అని అభిమానులు ఒకటే విమర్శ. అనసూయకి విజయ్ అంటే ఎందుకో వ్యక్తిగతంగా ఇష్టం లేనట్టుగా వుండి, విజయ్ ఏమి చేసినా బూతద్దంలో చూస్తూ అతని మీద ఒకటే విమర్శలు చేస్తూ వచ్చింది. సామజిక సమస్యల మీద ఏదైనా వ్యాఖ్యానం చేస్తే అందరూ హర్షించేవారేమో, కానీ అనసూయ వ్యక్తిగతంగా విజయ్ ని టార్గెట్ చెయ్యడం అతని అభిమానులకి నచ్చలేదు. చాలా సినిమాల్లో బూతులు, అస్లీల సన్నివేశాలు వున్నా, అవన్నీ పట్టించుకోకుండా విజయ్ సినిమా గురించే కొన్ని సంవత్సరాల క్రితం మాట్లాడేరు అనసూయ. అప్పుడు ఆమెని విజయ్ అభిమానులు ట్రోల్ చేశారు. ఇవన్నీ కావాలనే తనమీద చేయించినట్టుగా అనసూయ చెపుతూ వుంటారు. ఇక అప్పటి నుండి ఆమె విజయ్ మీద ఎదో ఒకటి పరోక్షంగా అంటూ వస్తూ ఉండటం, విజయ్ అభిమానులు ఆమెని ట్రోల్ చెయ్యడం, ఆమె మళ్ళీ హర్ట్ అవటం, ఇలా ఈ వివాదం కొన్ని రోజులు నడిచింది. ఇది కావాలని చేసుకున్న వివాదంగా అప్పట్లో పరిశ్రమలో చర్చ నడిచింది.

manchubrothers.jpg

మంచు సోదరులు

ఇలాంటిదే ఇంకొక వివాదం మంచు కుటుంబంలో జరిగింది. 'అన్నదమ్ముల అనుబంధం' అంటూ సినిమాల్లో చూపించినట్టుగా కలిసిమెలిసి వుండే మంచు సోదరులు మంచు విష్ణు, మనోజ్ మరి ఎందుకో ఒకరంటే ఒకరు విమర్సించుకునే స్థాయికి వెళ్లారు. మంచు మనోజ్ వివాహం భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల రెండో కుమార్తె మౌనిక రెడ్డి తో జరిగింది, అయితే ఈ వివాహం మనోజ్ సోదరుడు మంచు విష్ణుకి, ఇతర కుటుంబ సభ్యులకి ఎందుకో అంతగా ఇష్టం లేదు అని అప్పట్లో ఒక టాక్ నడిచింది. అందుకేనేమో మంచు మనోజ్ వివాహం తరువాత అతను, అతని భార్య తరచూ కనపడుతూ వుంటారు కానీ, మిగతా కుటుంబ సభ్యులు మాత్రం ఎక్కువ కనపడరు. మంచు లక్ష్మి మాత్రం మనోజ్ దంపతులతో అప్పుడప్పుడూ కనపడుతూ వుంటారు. ఒకరోజు మంచు మనోజ్ అనుచరుడు ఇంటికి సోదరుడు విష్ణు వచ్చి అతన్ని కొడుతున్నారంటూ మనోజ్ సాంఘీకమాధ్యమంలో ఒక వీడియో షేర్ చెయ్యడం పెద్ద వివాదం అయింది. మంచు సోదరుల మధ్య సరిగ్గా సమన్వయం లేదు అని అప్పటివరకు వార్తలు వస్తున్నాయి, కానీ ఈ వీడియోతో మంచు సోదరుల మధ్య జరుగుతున్న ఘర్షణ రోడ్డుకెక్కింది, ఆ వీడియో వైరల్ అయింది. తరువాత మోహన్ బాబు కుమారులిద్దరితో మాట్లాడిన తరువాత ఆ వివాదం సద్దుమణిగింది. మంచు విష్ణు కూడా తరువాత ఇది ఒక చిన్నపాటి సంఘటనగా కొట్టి పారేశారు.

dilrajuckalyan.jpg

ఛాంబర్ ఎన్నికలు, ఆరోపణలు

తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ఎన్నికలు ఈ సంవత్సరం జరిగాయి. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సి కళ్యాణ్ రెండు ప్యానెల్స్ గా పోటీలో నిలబడ్డారు. అయితే ఇది తెలుగు చిత్ర పరిశ్రమకి సంబంధించి అయినా, ఇదేదో జాతీయ ఎన్నికలని తలపించే విధంగా దిల్ రాజు, సి కళ్యాణ్ ఒకరిమీద ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు. అలాగే ఈ ఇద్దరూ నిర్మాతలు తాము పరిశ్రమకి ఎటువంటి అభివృద్ధి చేస్తామో చెప్పడానికి బదులు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వీడియోలు కూడా విడుదల చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అంటే ఏంటి ఇంతలా విమర్శలు చేసుకుంటున్నారు అని బయటి వాళ్ళు ముక్కుమీద వేలేసుకునేంతగా ఆరోపణలు చేసుకొని, చివరికి ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ గెలుపొందింది. దిల్ రాజు తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడు అయ్యారు.

ఇవే కాకా ఇంకా 'బలగం' దర్శకుడు వేణు యెల్దండి మీద గడ్డం సతీష్ అనే ఆరోపణ చేస్తూ 'బలగం' కథ తనదే అని ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం వివాదం అయింది. తన కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ కథని రాసుకున్నాను అని వేణు చెప్పడం, ఏదైనా ఉంటే న్యాయపరంగా చూసుకుంటే మంచిది అని అనటంతో ఈ వివాదం సద్దుమణిగింది. 'బలగం' సినిమా ఒక మంచి సినిమాగా అందరి ప్రసంశలు పొందటమే కాకుండా, డబ్బులు కూడా బాగా చేసింది.

Updated Date - Dec 21 , 2023 | 06:02 PM