Movie Startup: టాలెంట్ టన్నుల కొద్దీ ఉంది.. బయటికి తీస్తాం..

ABN , First Publish Date - 2023-01-29T12:05:55+05:30 IST

టచ్‌ చేస్తే.. టన్నుల కొద్దీ టాలెంట్‌ బయటపడుతుంది.. క్లాప్‌ కొట్టగానే యాక్టింగ్‌లో దుమ్మురేపుతారు..

Movie Startup: టాలెంట్ టన్నుల కొద్దీ ఉంది.. బయటికి తీస్తాం..

టచ్‌ చేస్తే.. టన్నుల కొద్దీ టాలెంట్‌ బయటపడుతుంది.. క్లాప్‌ కొట్టగానే యాక్టింగ్‌లో దుమ్మురేపుతారు.. ఈల వేయగానే డాన్స్‌ ఇరగదీస్తారు.. ఆడతారు.. పాడతారు.. రాస్తారు.. రసరమ్యంగా చిత్రీకరిస్తారు. ఒక్క ఛాన్స్‌ ఇస్తే ట్రెండ్‌ సెట్‌ చేస్తారు. రాత్రికి రాత్రే స్టార్‌లు అయిపోతారు! అయితే వీళ్లందరినీ తెరకు పరిచయం చేసే ఒక ప్లాట్‌ఫాం కావాలి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్‌ విభాగాలకు కొత్త టాలెంట్‌ను అలా పరిచయం చేస్తున్నాయి ‘టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌’లు..

సినిమా ఒక రంగుల ప్రపంచం. ఆ మాయా లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్‌’ దొరక్కపోతుందా అని ఆశతో ఎదురు చూస్తుంటారు.. తమకు తగిన అవకాశం ఇస్తారేమోనని స్టూడియోల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతుంటారు. చిన్న పాత్రలోనైనా సిల్వర్‌ స్ర్కీన్‌పై కనిపించాలని కలలు కనే వాళ్లకు కొదవ లేదు. నటనలోనే కాదు 24 శాఖల్లోనూ ప్రతిభ చూపించడానికి ఔత్సాహికులు సిద్ధంగా ఉన్నారు. రచయితగా, దర్శకుడిగా, గాయనీ గాయకులుగా.. ఇలా అన్ని శాఖల్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్‌ రంగాలలో అవకాశాలు రావాలంటే ఏం చేయాలి? చాలా మందికి తెలియదు. దీంతో వారి కలలు కల్లలుగానే మిగిలిపోతుంటాయి. ఎక్కడ ఛాన్స్‌ దొరుకుతుందో? ఎవరికి తమ అవసరం ఉందో తెలియక ‘సినిమా కష్టాలు’ పడుతుంటారు.

సీన్‌ కట్‌ చేస్తే..

సినిమాలు తీసే వాళ్లకూ ఇలాంటి సవాలే ఎదురవుతుంది. తమ సినిమాల్లో హీరోహీరోయిన్లు ఖరారు అయినప్పటికీ.. ప్రతి చిన్న పాత్ర కోసం సరైన నటీనటులను ఎలా ఎంచుకోవాలి? ఎలా సంప్రదించాలి అనే విషయం తెలియక ఇబ్బందులు పడుతుంటారు దర్శకులు. కథకు తగ్గట్టు పాత్రదారులను ఎంపిక చేసుకోవాలి. ఒక్కోసారి దర్శకుడు రాసుకున్న పాత్రకు తగిన రీతిలో నటీనటులు అంత సులభంగా దొరకరు. అప్పటికప్పుడు అలాంటి వారిని వెతికిపట్టుకోవడం కష్టం. బోలెడంత సమయం వృథా అవుతుంది. ఆఖరికి ఎవరో ఒక ఆర్టిస్టుతో రాజీపడాల్సి వస్తుంది. అంతేకాదు డైరెక్టర్‌ రాసుకున్న సబ్జెక్టుకు తగిన రీతిలో పాటలు రాసేవారు కావాలి. ఆ తర్వాత సింగర్స్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ను ఎంపిక చేసుకోవాల్సిందే.. ఇలా 24 శాఖల్లో చాలా వరకు తగిన ప్రతిభావంతులు సమయానికి దొరక్కపోవచ్చు. మరి సినిమాకు తగ్గ కళాకారులను ఎలా గుర్తించాలి? ఎక్కడి నుంచి తీసుకురావాలి?

ప్రతిభావంతుల బృందం కొన్ని నెలల తరబడి పని చేస్తే ఒక్క సినిమా పూర్తవుతుంది. నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు.. అందరూ కలిస్తేనే సినిమా. రెండున్నర గంటల సినిమాను హాయిగా చూసేసినంత సులువేం కాదు.. దాన్ని తీయడం. ప్రత్యక్షంగా, పరోక్షంగా వందల మందితో చిత్రీకరణ జరుగుతుంది. అందుకు 24 విభాగాలకు చెందిన కళాకారులందరూ కలిసి పనిచేయాలి. అయితే.. ‘ప్రతిభ పుష్కలంగా ఉందికానీ, అవకాశం రావడమే కదా అసలైన కష్టం‘ అనే వారి కోసమే టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు, వేదికలు అవతరిస్తున్నాయి.

బాలీవుడ్‌లో ఎప్పటి నుంచో..

అన్ని వృత్తుల్లాగే సినిమా కూడా ఒక ప్రొఫెషన్‌. ఇక్కడ నిపుణులైన అనుభవజ్ఞుల వద్ద శిక్షణ తీసుకోక తప్పదు. ముందు నుంచీ పలు శిక్షణ సంస్థలు ఇందుకోసం పనిచేస్తున్నాయి. ఇప్పటికే సత్యానంద్‌ యాక్టింగ్‌ ఇనిస్టిట్యూట్‌, రామానాయుడు ఫిలిం స్కూల్‌, మధు ఫిల్మ్‌-టీవీ ఇనిస్టిట్యూట్‌, అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా.. వంటి ప్రముఖ సంస్థలు పలు శాఖలకు సంబంధించిన కోర్సులు నిర్వహిస్తున్నాయి. ఆసక్తి ఉన్నవారికి సినీ రంగంలోని వివిధ శాఖలకు సంబంధించిన నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు నిపుణులు. ఇదే సమయంలో ‘ఒక్క ఛాన్స్‌ ..’ అంటూ ప్రొడక్షన్‌ హౌస్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరాన్ని తగ్గించేస్తున్నాయి కొత్తగా వచ్చిన కొన్ని టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు. మూవీ మేకర్‌లకు కావాల్సిన టాలెంట్‌ను కూడా పరిచయం చేస్తున్నాయి. కళాకారులకు - దర్శకనిర్మాతలకు మధ్య వారధిగా పనిచేస్తున్నాయి ప్లాట్‌ఫాంలు. నిజానికి చిత్ర నిర్మాణ సంస్థల అవసరాలను గుర్తించి ఔత్సాహికులకు అవకాశాలు కల్పించే విధానం హాలీవుడ్‌, బాలీవుడ్‌లలో ఎప్పటి నుంచో ఉంది. ఇలాంటి ప్లాట్‌ఫాంలు ఇప్పుడిప్పుడే మన దగ్గర పెరుగుతుండటం కొత్త పరిణామం. ప్రతిభ కలిగిన సినీ ఔత్సాహికులకు మంచి అవకాశం కల్పిస్తున్నాయి.

జగన్నాథ్‌ ‘పూరీ కనెక్ట్స్‌’..

ఏ రంగంలో ఉన్న వాళ్లకు ఆ రంగం పట్ల అవగాహన ఉంటుంది. ఇదివరకే సినిమాలతో సంబంధం ఉన్న వాళ్లు ఈ ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేస్తుండటం బావుంది. దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన ‘లైగర్‌’లో విజయ్‌ దేవరకొండతో ఢీ అంటే ఢీ అనే మార్షల్‌ ఆర్ట్స్‌ చేసే విలన్‌ మీకు గుర్తున్నాడా? అతడే ‘విష్‌’. నటుడిగా మంచి భవిష్యత్తు ఉందనిపించిన ఇతను ‘పూరీ కనెక్ట్స్‌’ సంస్థ నుంచి వచ్చిన వాడే. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చిన విష్‌ టాలెంట్‌కు పూరీ జగన్నాథ్‌ ఫిదా అయ్యాడు. విష్‌ను తన సంస్థకు సీఈవోను చేశాడు. సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఈ సంస్థను పూరీ జగన్నాథ్‌, ఛార్మీ కలిసి ప్రారంభించారు. దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు.. ఇలా అన్ని విభాగాల వారికి అవకాశం కల్పిస్తున్నారు. ‘‘కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడంలో పూరీ జగన్నాథ్‌ ఎప్పుడూ ముందుంటారు. ఆయన చేసే ప్రతి ప్రాజెక్టులో 24 శాఖల్లో న్యూటాలెంట్‌కు అవకాశం ఇస్తారు. అందులో నేను ఒకడిని. అంతకుముందు పూరీగారితో ఎలాంటి పరిచయం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేని నన్ను తన దగ్గరకు తీసుకుని ఛాన్స్‌ ఇచ్చారు. ‘పూరీ కనెక్ట్స్‌’ సంస్థకు నన్ను సీఈవోగా చేశారు. ‘లైగర్‌’లో నాకు ఏకంగా విలన్‌ పాత్ర చేసే అవకాశం కూడా ఇచ్చారు. టాలెంట్‌, ఫైర్‌ ఉంటే చాలు.. నా లాంటి ఎంతోమందిని ప్రోత్సహిస్తున్నారాయన. గడిచిన మూడేళ్లలో ‘పూరీ కనెక్ట్స్‌’ నుంచి ఎంతో మందికి సినీ అవకాశాలు వచ్చాయి..’’ అన్నారు పూరీ కనెక్ట్స్‌ సీఈవోగా పనిచేస్తున్న విష్‌.

రానా ‘సౌత్‌ టాలెంట్‌’..

ఏ రంగానికైనా.. కొత్త నీరు ఎంత వస్తే అంత మంచిది. అందుకే సినిమాల్లోకి రావాలనుకునే కొత్త వాళ్లకు అవకాశాలు కల్పించేందుకు ఓ ప్లాట్‌ఫాంను తీసుకొచ్చాడు ప్రముఖ నటుడు రానా. బాలీవుడ్‌ టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ‘కలెక్టివ్‌ ఆర్టిస్ట్‌ నెట్‌వర్క్‌’(కాన్‌)ని ఆయనే దక్షిణాదికి తీసుకువచ్చారు. జాతీయస్థాయిలో దక్షిణాది కళాకారులకు అవకాశాలు కల్పించడం.. ఆర్టిస్టుల ప్రాజెక్టులూ, తేదీలూ.. వంటి వ్యవహారాలన్నింటినీ కాన్‌ సౌత్‌ సంస్థ చూస్తుంది.

నవదీప్‌ ‘సీ స్పేస్‌’..

సినిమాకు కథ ప్రాణం. రాను రాను రచయితలు తగ్గిపోతున్నారు. అక్కడక్కడ మంచి రచయితలు ఉన్నా కూడా సినిమాల్లోకి ఎలా ప్రవేశించాలో తెలియదు. అలా సినీ రచయితలుగా ఎదగాలనుకున్న వారికి ‘సీ స్పేస్‌’ ఉందంటూ హైదరాబాద్‌లో ఓ వేదికను ఏర్పాటు చేశాడు నటుడు నవదీప్‌. సినిమాల్లో నటించాలన్నా, ఆడిషన్స్‌కి ప్రిపేర్‌ కావాలన్నా, కంటెంట్‌ క్రియేట్‌ చేసుకోవాలన్నా ఇదొక ప్లాట్‌ఫాంలాగ ఉపయోగపడుతుంది. సినిమాల్లో వివిధ శాఖల్లో పని చేయడానికి అవకాశం కోసం చూస్తున్న ఔత్సాహికుల ప్రతిభకు మరింత పదును పెట్టి, వారి కలలను నెరవేర్చేందుకు ‘సీ స్పేస్‌’ను టాలెంట్‌ హబ్‌గా రూపకల్పన చేశారు.

navadeep.jpg

రకుల్‌ ‘స్టారింగ్‌ యూ’..

టాలీవుడ్‌ మొదలు బాలీవుడ్‌ వరకు వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌ డిజిటల్‌ టెక్నాలజీని వాడుకుంటూ సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ఓ వేదిక ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల నుంచి ముంబై, హైదరాబాద్‌, చెన్నై తదితర నగరాలకు వచ్చే వారికి ‘ఆడిషనింగ్‌’ ప్రక్రియతో అవకాశాలు అంత సులభంగా దొరకడం లేదు. ఇలాంటి వారి కోసం ‘స్టారింగ్‌ యూ’ స్టార్టప్‌ ఏర్పాటు చేసింది రకుల్‌. తమ్ముడు అమన్‌ ప్రీత్‌సింగ్‌తో కలిసి ఈ వెబ్‌సైట్‌/యాప్‌ని ఆమె ప్రారంభించింది. సినీ ఔత్సాహికులకు ఇదో డిజిటల్‌ వేదికగా పని చేస్తుంది. సినిమాకు చెందిన 24 క్రాఫ్ట్‌లకు సంబంధించిన వారు ఈ యాప్‌ ద్వారా ప్రయత్నం చేయొచ్చు. కొత్త వాళ్లకు అవకాశాలు కల్పించేందుకు- తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమకు చెందిన ప్రముఖ స్టూడియోలు, నిర్మాణ సంస్థలతో ‘స్టారింగ్‌యూ’ ఒప్పందం చేసుకుంది.

‘హైస్టార్‌’ మరొక వేదిక..

24 క్రాఫ్టులకు సంబంధించిన వారిని ఒకేచోట కలిపేందుకు మీడియాబాస్‌ అనే సంస్థ ‘హైస్టార్‌’ అనే ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేసింది. ఆర్టిస్టులు, మోడళ్లు, యాంకర్‌లు, సింగర్లు.. ఇలా అన్ని శాఖలకు చెందిన వారు ‘హైస్టార్‌’లో తమ ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసుకుని మూవీ మేకర్స్‌ నుంచి అవకాశాలు పొందవచ్చు. గూగుల్‌ ప్లేస్టోర్‌లో యాప్‌ అందుబాటులో ఉంది. www.hystar.in అనే వెబ్‌సైట్‌ ద్వారా కూడా రిజిస్టర్‌ అవ్వొచ్చు. ముందుగా సభ్యత్వం నమోదు చేసుకోవాలి. మరోవైపు మూవీ మేకర్‌లు కూడా ఇందులో ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు. డైరెక్టర్‌లు తమ పాత్రలకు తగిన వారిని, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకోవచ్చు. ఆర్టిస్టుల ప్రొఫైల్‌ను బట్టి, సినిమా పాత్రలకు తగినవారిని ఎంపిక చేసుకున్న దర్శకులు నేరుగా వారిని సంప్రదించవచ్చు. ఎప్పటికప్పుడు వివిధ ప్రొడక్షన్‌ హౌస్‌ల నుంచి వచ్చే కాస్టింగ్‌ కాల్స్‌, ఆడిషన్స్‌ అప్‌డేట్‌ను కూడా తెలుసుకోవచ్చు.

‘‘రచనల మీద ఆసక్తి ఉన్నవారంతా ఒక బృందంగా చేరి .. ఒకరికొకరు ఆలోచనలు పంచుకుంటూ ‘సీ-స్పేస్‌’లో కథలు రాస్తారు. అమెజాన్‌ ప్రైమ్‌, హాట్‌స్టార్‌.. వంటి ఓటీటీ ప్లాట్‌ఫాంలకి రాశారు. స్వప్నదత్‌, క్రిష్‌ సినిమాలకు కూడా మా వాళ్లు రాశారు. గతంలో ‘సీ-స్పేస్‌’ వాళ్లు ‘లవ్‌ మౌళి’ అనే సినిమాను నిర్మించారు. ఇప్పుడు ఇదే హౌస్‌ నుండి వస్తున్న రెండో సినిమా ‘ఏవమ్‌’. సాధ్యమైనంత వరకు కొత్త వాళ్లకే అవకాశం ఇస్తున్నాం.

- నవదీప్‌, నటుడు, ‘సీ-స్పేస్‌’

‘‘ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించాలన్నా, వారందరినీ ఒకతాటిపైకి తీసుకురావాలన్నా అందుకో వేదిక కావాలి. అలాంటి సేవలు అందించేందుకు ‘హైస్టార్‌’ను తీసుకొచ్చాం. సినిమా, టెలివిజన్‌, ఓటీటీ, అడ్వర్‌టైజ్‌మెంట్‌లలోకి వెళ్లాలనుకునే ఆశావహులు మా డిజిటల్‌ ప్లాట్‌ఫాంలో ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ‘హైస్టార్‌’ యాప్‌, వెబ్‌సైట్‌ అందుబాటులో ఉన్నాయి. ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసుకున్నవారికి ‘పిలుపు’, ‘కాక్‌ టెయిల్‌ డైరీస్‌’, ‘అమెరికాలో మనం’.. ఇలా పలు సినిమాల్లో అవకాశాలు లభించాయి. మా ప్లాట్‌ఫామ్‌ నుంచి ఇండియాతో పాటు అమెరికాలోనూ పలువురు కళాకారులు అవకాశాలు అందుకున్నారు..’’

- వేణుగోపాల్‌ నక్షత్రం

‘‘సినిమాల్లో నటించాలనేది నా కల. అమెరికాకు వచ్చాక ఆ కల నెరవేరింది. హైస్టార్‌ యాప్‌లో ఎన్నారై కేటగిరిలో నా ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసుకున్న నెల రోజుల్లోపే యూఎస్‌లో ఛాన్స్‌ కొట్టేశాను. ఎన్నారై ప్రొడ్యూసర్‌ ఎన్‌.అవంతిక నిర్మించిన ‘కాక్‌టైల్‌ డైరీస్‌’లో నటించాను..’’

- స్వాతిరెడ్డి, ఎన్నారై, నటి

‘‘సోషల్‌ మీడియాలో షార్ట్‌ వీడియోలు చేస్తుంటాను. మంచి ఫాలోయింగ్‌ ఉంది. సినిమాల్లో నటించాలని, రియాలిటీ షోలకు హోస్టుగా చేయాలనేది నా కోరిక. డిజిటల్‌ టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాట్‌ఫాం ద్వారా నా కల నెరవేరింది. ఓ వెబ్‌సిరీస్‌లో నటించే అవకాశం వచ్చింది..’’

- స్వర్ణదేవి గుడ్ల, టిక్‌టాక్‌ స్టార్‌, హోస్ట్‌

సెల్‌, సోషల్‌ మీడియాతో..

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ చేతిలో ఉంటే చాలు. ఏకంగా ఓ మోస్తరు సినిమానే తీసేయొచ్చు. ప్రతిభ ఉండాలే కానీ వనరులకు ఢోకా లేదు. మొబైల్‌ కెమెరాతోనే చక్కటి లఘుచిత్రాలు తీస్తున్నారు యువతీ యువకులు. వాటిని యూట్యూబ్‌, టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. వంటి సామాజికమాద్యమాల్లో అప్‌లోడ్‌ చేసి ప్రపంచానికి చూపిస్తున్నారు. వీరిలో చాలామంది సినిమాల్లో అవకాశం కోసం చూస్తున్నారు. సోషల్‌ మీడియాలో టాలెంట్‌ చూపిస్తున్న వారిని టీవీ షోలు కూడా ఆహ్వానిస్తున్నాయి. దీంతో బిగ్‌బాస్‌ వంటి బిగ్గెస్ట్‌ రియాలిటీ షోల్లో కూడా ఛాన్స్‌ కొట్టేస్తున్నారు. ఈ రకమైన ప్రయత్నాలతో కూడా సినిమా అవకాశాలు వస్తున్నాయి. సెల్‌ఫోన్‌, సోషల్‌మీడియా.. ఈ రెండే చాలు. టాలెంట్‌ను చెప్పడానికి!.

ఇవన్నీ చేస్తూనే టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాట్‌ఫాంలను వాడుకోవాలి. ఉద్యోగార్థులకు నౌకరీ.కామ్‌, మాన్‌స్టర్‌.కామ్‌ వంటి జాబ్‌ పోర్టల్స్‌, యాప్స్‌ ఉన్నాయి. రెజ్యూమ్‌ అప్‌లోడ్‌ చేస్తే చాలు.. సంబంధిత కంపెనీల నుంచి ఆహ్వానాలు అందుతుంటాయి. ఇటు ఉద్యోగార్థులకు, అటూ కంపెనీలకు ఈ జాబ్‌ పోర్టల్స్‌ ఎంతో ఉపయోగపడుతున్నాయి. సినిమా, మీడియా, యాడ్స్‌ రంగాల్లో అవకాశాలకు సంబంధించి ‘టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్స్‌’ కూడా అదే పని చేస్తున్నాయన్నమాట. ఇలా.. రకరకాల ప్రయత్నాల ద్వారా మీ టాలెంట్‌ను నిరూపించుకుని.. సినిమా ఛాన్స్‌లు కొట్టేయండి.

Updated Date - 2023-01-29T12:05:56+05:30 IST