అమెజాన్ ప్రైమ్‌లో దిమ్మతిరిగే డార్క్, యాక్షన్ థ్రిల్లర్.. ఒంటరిగా మాత్రమే చూడండి
ABN , First Publish Date - 2023-12-17T19:58:20+05:30 IST
మేం చెప్పేది, మీరు చూడబోయేది దశాబ్దం కిందటి సినిమానే అయినప్పటికీ ఇది మనం రెగ్యులర్‌గా చూసిన, చూస్తున్న సినిమాలకు కొద్దిగా భిన్నమైనది. హీరో విలన్‌ను టార్గెట్ చేసి ఎలా చిత్రహింసలు పెట్టాడనే కాన్సెప్ట్‌లో తీసి సినిమాను ఈ యాంగిల్‌లో కూడా తీస్తారా అనే విధంగా ఉంటుంది.

మేం చెప్పేది, మీరు చూడబోయేది దశాబ్దం కిందటి సినిమానే అయినప్పటికీ ఇది మనం రెగ్యులర్‌గా చూసిన, చూస్తున్న సినిమాలకు కొద్దిగా భిన్నమైనది. ఎంత డిఫరెంట్ అంటే చాలా సినిమాల్లో విలన్ హీరోనో, హీరో కుటుంబాన్నో టార్గెట్ చేస్తే ఈ చిత్రంలో అందుకు విరుద్ధంగా హీరో విలన్‌ను టార్గెట్ చేసి ఎలా చిత్రహింసలు పెట్టాడనే కాన్సెప్ట్‌లో తీసి సినిమాను ఈ యాంగిల్‌లో కూడా తీస్తారా అనే విధంగా ఉంటుంది. మనకు ఇప్పటివరకు తెలియక కానీ ఈ సినిమాలోని మెయిన్ థీమ్‌ను కాఫీ కొట్టి ఆల్రెడీ మనోళ్లు సినిమా చేశారంటే మీరు నమ్మరు. ఇంతకు ఆ వెరైటీ సినిమా పేరేంటంటే ఐ సా ది డెవిల్ (I Saw the Devil).
2010లో వచ్చిన ఐ సా ది డెవిల్ (I Saw the Devil) సినిమా కొరియాలో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. లీ బైంగ్-హమ్ (Lee Byung-Hum) కథానాయకుడిగా, చోయ్ మైనా-సిక్ (Choi Myna-Sik) ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాకు కిమ్ జీ-వూన్ (Kim Jee-woon) దర్శకత్వం వహించారు. రూ.49 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం అక్కడ రూ100 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. 2 గంటల 22 నిమిషాల నిడివితో డార్క్, యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ఈ రివేంజ్ సినిమా చాలా ఆలస్యంగా ఓటీటీలోకి రాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నది.
ఓ సీరియల్ కిల్లర్ స్కూల్ వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తూ ఉదయం వ్యాన్ నడుపుకుంటూ రాత్రిళ్లు ఒంటరిగా కనిపించే ఆడ వారిని కిడ్నాప్ చేయడం, విచక్షణారహితంగా చంపడం వంటివి చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ NIS (The National Intelligence Service) ఏజెంట్ భార్య ఒంటరిగా కారులో వెళుతూ నిర్మానుష్య ప్రాంతంలో చిక్కుకుపోగా విలన్ గమనించి ఆమెపై దాడి చేసి తన ఇంటికి తీసుకెళ్లి ముక్కలుముక్కులుగా చంపేస్తాడు.
ఈ ఘటనతో బాగా డిస్టర్బ్ అయిన హీరో విలన్ ఆచూకీ తెలుసుకుని అతన్ని పట్టుకుంటాడు. నిన్ను సింపుల్‌గా ఒక్కసారికే చంపను నీకు నరకం చూపిస్తూ చంపుతానంటూ మొదటిసారి అతని చేయి విరగొట్టి కడుపులో జీపీఎస్ ట్రాకర్ పెట్టి, ట్రీట్మెంటుకు డబ్బులిచ్చి వదిలేస్తాడు. తర్వాతి నుంచి అతన్ని ఫాలో అవుతూ రెండు రోజులకోసారి అతనిపై దాడి చేసి రకరకాలుగా టార్చర్ పెడతాడు. చివరకు తన కడుపులో ఉన్న జీపీఎస్‌ను వదిలించుకున్న విలన్ ఆ తర్వాత హీరోను ఎలా ఎదుర్కొన్నాడనేదే కథ.
అయితే ఈ సినిమాను పిల్లలతో, ఫ్యామిలీతో ఎట్టి పరిస్థితుల్లో చూడలేం. కొన్ని బోల్డ్ సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ మనకే వెగటు పుట్టిస్తాయంటే సినిమా ఎంత రస్టిక్‌గా తీశారో అర్థం చేసుకోవచ్చు. ఇక సినిమా తెలుగుతో పాటు మరో మూడు సౌత్ బాషల్లోనూ అందుబాటులో ఉంది కాబట్టి మన భాషలోనే చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయవచ్చు. ముఖ్యంగా.. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సినిమాను చూడండి.
ఇక ఈ సినిమాలోని ఆ జీపీఎస్ ట్రాకర్ నేపథ్యాన్నే తీసుకుని 2015లో జయం రవి హీరోగా మోహన్‌రాజా తని ఓరువన్ చిత్రాన్ని తమిళంలో తెరకెక్కించగా, 2016లో తెలుగులో ధృవ పేరుతో రామ్‌చరణ్ హీరోగా తీసి హిట్ కొట్టారు.