Guntur Kaaram: ఏమి జరుగుతోంది, నిర్మాత ఎక్స్ (ట్విట్టర్) లో పోస్ట్ ఎందుకు డిలీట్ చేశారు...

ABN , Publish Date - Dec 18 , 2023 | 06:36 PM

ఒక అగ్ర నటుడితో సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా నిర్మాత, ఇతర సాంకేతిక నిపుణులు కొంచెం సహనం, సంయనం పాటించాలని పరిశ్రమలో అంటూ వుంటారు. మహేష్ అభిమానులను కోతులతో పోల్చడం ఎందుకు, మళ్ళీ ఆ పోస్ట్ ను డిలీట్ చెయ్యడం ఎందుకు? అని కొంతమంది మహేష్ అభిమానులు అడుగుతున్నారు.

Guntur Kaaram: ఏమి జరుగుతోంది, నిర్మాత ఎక్స్ (ట్విట్టర్) లో పోస్ట్ ఎందుకు డిలీట్ చేశారు...
Mahesh Babu and Sreeleela from Guntur Kaaram

మహేష్ బాబు (MaheshBabu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' #GunturKaaram విడుదలయ్యేంతవరకు వివాదాలతో నడుస్తోంది అనిపిస్తోంది ఒక టాక్ నడుస్తోంది. సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాకి నిర్మాత, రానున్న సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 12న విడుదలవుతోంది. అయితే ఈ సినిమాలో 'ఓ మై బేబీ' అనే పాట ఒకటి కొన్ని రోజుల క్రితం విడుదలైంది. అయితే ఈ పాట మహేష్ బాబు అభిమానులకి అంతగా నచ్చకపోవటంతో ఈ సినిమా సంగీత దర్శకుడు థమన్ ని, గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ని ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీలీల కథానాయకురాలు, మీనాక్షి చౌదరి కూడా ఇంకొక కథానాయకురాలు అని అంటున్నారు.

ఈ ట్రోలింగ్ కి గేయ రచయిత ఎక్స్ (ట్విట్టర్) నుండి తప్పుకున్నారు. ఈ సినిమా నిర్మాత అన్నయ్య కుమారుడు, నిర్మాత అయిన నాగవంశీ ఈ ట్రోలింగ్ కి ప్రతిస్పందిస్తూ మహేష్ బాబు అభిమానులను కోతులతో పోలుస్తూ, 'యానిమల్' #Animal సినిమా నుండి రణబీర్ కపూర్ (Ranbir Kapoor) వీడియో చిన్నది ఒకటి పోస్ట్ చేశారు. అయితే నాగవంశీ ని కూడా మహేష్ అభిమానులు ట్రోల్ చెయ్యడమే కాకుండా, అతను పెట్టిన వీడియోని నిర్మాత అయివుండి పైరసీని ఎలా ప్రోత్సహిస్తారు అని కూడా ట్రోల్ చేశారు అభిమానులు.

ఇదిలా ఉండగా, అన్నపూర్ణ స్టూడియోలో ఖరీదైన సెట్ లో మహేష్ బాబు, కథానాయకురాలు మిగతా డాన్సర్స్ పై ఒక పాట చిత్రీకరణ జరగాల్సి ఉండగా, అది ఎందువల్లనో రద్దయింది. ఆ వార్త వైరల్ అయింది కూడా. మహేష్ బాబు అభిమానులకే కాదు, మహేష్ బాబుకి కూడా పాట నచ్చలేదని ఒక వార్త వచ్చింది. ఇదిలా ఉండగా, మహేష్ అభిమానులను కోతులతో పోల్చిన సదరు నిర్మాత నాగవంశీ ఈ పోస్టును ఎక్స్ (ట్విట్టర్) నుండి తీసివేయడం జరిగింది. మరి అది పెట్టడం ఎందుకో తీయడం ఎందుకో అని అభిమానులు ఒకటే ప్రశ్నలు వేస్తున్నారు.

gunturkaaram1.jpg

అది తీసెయ్యడమే కాకుండా, మళ్ళీ ఇంకో పోస్ట్ పెట్టారు. అందులో పాట 21 నుండి మొదలవుతుంది అని, ఇప్పటికే మూడు పాటలు షూటింగ్ పూర్తి చేశామని చెపుతూ, కొంతమంది క్లిక్ ల కోసం ఏదేదో వార్తలు రాస్తూ వుంటారు అని కూడా అన్నారు. అసలు నిప్పులేనిదే పొగ రాదు కదా. ఈ సినిమా మొదటి నుండీ వివాదాల్లోనే వుంది అని అందరికి తెలిసిన విషయమే. మరి అలాంటప్పుడు పెట్టిన పోస్టులు డిలీట్ చెయ్యడం ఎందుకు? మళ్ళీ ఇంకో పోస్ట్ పెట్టి కొంతమందిని తిట్టడం ఎందుకు? మహేష్ బాబు, దర్శకుడిని, నిర్మాతని పిలిచి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు అని కూడా పరిశ్రమలో ఒక వార్త నడుస్తోంది. మరి అది ఎంతవరకు నిజమో కూడా సదరు నిర్మాతకు తెలియాలి.

ఒక అగ్రనటుడితో ఒక హై బడ్జెట్ సినిమా చేస్తున్నప్పుడు, ఆ నటుడి అభిమానుల నుంచి కొంత ట్రోలింగ్ రావటం సహజం. అగ్ర నటులతో చేసిన ప్రతి నిర్మాత ఇలాంటివి చూస్తూ వుంటారు. 'గేమ్ చేంజర్' గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదని రామ్ చరణ్ అభిమానులు నిర్మాత దిల్ రాజుని ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ సినిమా 'సలార్' గురించి ఎటువంటి సమాచారం లేదని, ఆ సినిమా నిర్మాతలని కూడా ప్రభాస్ అభిమానులు ట్రోల్ చేసిన సంగతి కూడా తెలిసిందే. సామజిక మాధ్యమంలో వున్నప్పుడు ఇవన్నీ అలవాటు చేసుకోవాలి. పెద్ద బడ్జెట్ సినిమాలు తీస్తున్నప్పుడు కొంచెం సహనం పాటించడం మంచిది అని పరిశ్రమలో అగ్ర నిర్మాతలు చెపుతూ వుంటారు.

Updated Date - Dec 18 , 2023 | 06:36 PM