Tamannaah marriage: టాలీవుడ్ లో ఇంకో వివాహ వేడుక
ABN , First Publish Date - 2023-11-13T11:55:29+05:30 IST
ఈమధ్యనే నటీనటులు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం చేసుకున్నారు. అయితే ఇదే బాటలో ఇంకో నటీనటుల జంట కూడా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. తమన్నా, విజయ్ వర్మల వివాహం వచ్చే సంవత్సరం ఉండవచ్చు అనే వార్త వైరల్ అవుతోంది.
కొన్ని రోజుల క్రితం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (VarunTej), నటి లావణ్య త్రిపాఠి (LavanyaTripathi)లు ఇటలీలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇంకో జంట కూడా ఇదే బాటలో వెళ్లాలని అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో బిజీగా వున్న నటి తమన్నా భాటియా (TamannahBhatia) వివాహం త్వరలో జరగబోతోంది అని టాక్. తమన్నా మొదటి సినిమా టాలీవుడ్ లో చేసిన సంగతి తెలిసిందే, ఇక్కడ అగ్రనటిగా వెలుగొంది, తరువాత బాలీవుడ్ లో కూడా ఓ వెలుగు వెలుగుతోంది. అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్, వెబ్ సినిమాలు చేసుకుంటూ చాలా బిజీగా వున్న నటీమణుల్లో తమన్నా ఒకరు.
తమన్నా, హైదరాబాదుకి చెందిన నటుడు విజయ్ వర్మ (VijayVarma) తో రిలేషన్ షిప్ లో వున్న సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. మొదట్లో కొన్నాళ్ళు ఇద్దరూ దాచినా, తరువాత బహిరంగంగానే తాము ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఆ తరువాత వీరిద్దరూ ఎన్నో ఫంక్షన్స్ లో కలిసి కనిపించారు, చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు కూడా.
అయితే ఇప్పుడు ఈ రిలేషన్ షిప్ ని వివాహం వరకు తీసుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. వచ్చే సంవత్సరం ఇద్దరూ వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నట్టు ఒక వార్త నడుస్తోంది. 33 సంవత్సరాల తమన్నా ఇక వివాహం చేసుకోవాలని, అందుకోసం తాను ప్రేమిస్తున్న విజయ్ వర్మతో మాట్లాడి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనుందని అంటున్నారు. అలాగే తమన్నా తల్లిదండ్రులు కూడా ఈ వివాహానికి తమ మద్దతు తెలిపినట్టుగా కూడా తెలిసింది.