Ravi Teja: ఓటిటి ప్రభావం, ఆగిపోయిన రవితేజ సినిమాలు
ABN , First Publish Date - 2023-12-06T10:00:05+05:30 IST
ఓటిటి ప్రభావం అప్పుడే తెలుగు సినిమా మీద పడింది అని పరిశ్రమలో అంటున్నారు. ఇంతకుముందులా ఓటిటి హక్కులు ఎక్కువ డబ్బులు ఇచ్చి తీసుకోకపోవడంతో నిర్మాతలు ముందుగానే జాగ్రత్తపడి సినిమా బడ్జెట్ తగ్గించాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే రవితేజతో లైనప్ లో వున్న కొన్ని సినిమాలు ఆగిపోయాయి అని టాక్.
ఇప్పుడు తెలుగు సినిమా మీద ఓటిటి ప్రభావం బాగా పడుతోంది అని వినిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం నిర్మాత సుధాకర్ రెడ్డి ఓటిటి ప్రభావం గురించి మాట్లాడుతూ నిర్మాతలు అందరూ చాలా జాగ్రత్తగా సినిమాలు తీయాలని, లేకపోతే చాలా కష్టం అని చెప్పారు. అందుకని ఇప్పుడు నిర్మాతలు సినిమా ఖర్చులు తగ్గించే పనిలో వున్నారని పరిశ్రమలో ఒక టాక్ వినపడుతోంది. ఇందులో భాగంగానే రవితేజతో రావలసిన కొన్ని సినిమాలు ఆలోచనలో పడ్డాయి అని అవి వస్తాయో రావో చెప్పడం కష్టం అని చెపుతున్నారు పరిశ్రమలో.
మైత్రి మూవీ మేకర్స్, గోపీచంద్ మలినేని (GopichandMalineni), రవితేజ (RaviTeja) కాంబినేషన్ లో ఒక సినిమా ప్రకటించారు, అది అధికారికంగా కూడా ప్రారంభం అవుతోంది అని కూడా మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ సినిమా దాదాపు ఆగిపోయినట్టే అని అర్థం అవుతోంది. ఎందుకంటే రవితేజ పారితోషికం చాలా ఎక్కువ అడిగారని, అంత పారితోషికం ఇచ్చి సినిమా బడ్జెట్ పెంచుకుంటే, ఆ సినిమా థియేట్రికల్ రెవిన్యూ అంత రాదని చెప్పి, ఆ సినిమా ఆపెయ్యడం మంచిదని అందుకని ఆపేశారని చెపుతున్నారు. ఇంతకుముందు ఓటిటి, శాటిలైట్ హక్కులు అమ్ముకొని సినిమాలు చేసేవారు, ఇప్పుడు అవి పడిపోవటంతో ఇంత బడ్జెట్ పెట్టడం కష్టం అని చెపుతున్నారు.
'భగవంత్ కేసరి' #BhagavanthKesari తో పెద్ద హిట్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి (AnilRavipudi), తదుపరి సినిమా రవితేజ తో ఉంటుంది అని వార్తలు చక్కర్లు కొట్టాయి, అయితే ఈ సినిమా కూడా ఉండకపోవచ్చు అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఇది కూడా ఓవర్ బడ్జెట్ అవుతుందని, అంతంత బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే థియేట్రికల్ గా ఆడకపోతే కష్టం అని ఈ సినిమా కూడా డ్రాప్ అయినట్టుగా చెపుతున్నారు. రవితేజ పారితోషికం బాగా పెంచేశారని, అతని మీద అంత పెద్ద వ్యాపారం అవదు అని తెలిసి అతనితో చేసే రెగ్యులర్ నిర్మాతలు ఇప్పుడు కొంచెం వెనక్కి తగ్గుతున్నారని భోగట్టా. ఈ రెండే కాకుండా రవితేజతో చెయ్యబోయే ఇంకో సినిమా కూడా ఆగిపోయినట్టుగా పరిశ్రమలో టాక్ వినపడుతోంది. నిర్మాతలు అందరూ ఇప్పుడు ఆలోచనలో పడినట్టుగా తెలుస్తోంది. ఒక్క రవితేజ విషయంలోనే కాకుండా మిగతా సినిమా నిర్మాతలు కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా పరిశ్రమలో అంటున్నారు. రవితేజ పారితోషికం తగ్గించి చేస్తే నిర్మాతలు ఈ సినిమాలు తీయడానికి ముందుకు రావచ్చు అని కూడా తెలుస్తోంది.