Tollywood drugs: నటుడు నవదీప్ కు పోలీస్ నోటీసులు, అరెస్టు తప్పదా

ABN , First Publish Date - 2023-09-22T09:35:43+05:30 IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కలకలం మరోసారి సంచలనం సృష్టిస్తోంది. నటుడు నవదీప్ కి ఈ డ్రగ్స్ కేసుతో సంబంధం వుంది అని పోలీసులు చెప్పటం, అతన్ని 23న హాజరు కావాలని నోటీసులు ఇవ్వటం, ఈ పరిణామాల్లో ఈ కేసు ఎటునుండి ఎటు తిరుగుతుందో అని చిత్రపరిశ్రమలో చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు.

Tollywood drugs: నటుడు నవదీప్ కు పోలీస్ నోటీసులు, అరెస్టు తప్పదా
File picture of actor Navadeep

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ #TollywoodDrugsCase కలకలం రేపుతోంది. మాదాపూర్ (Madhapur) కేసులో ప్రధాన నిందితుడుగా వున్న నవదీప్ (Navadeep) కి రేపు అంటే 23న విచారణకి హాజరు కావాలని పోలీసులు నోటీసు ఇచ్చారు. కొన్ని రోజుల క్రితమే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ (CVAnand) ఈ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ పేరును వెల్లడించారు. నవదీప్ డ్రగ్స్ సేవించినట్టుగా వెల్లడించారు. కొంతమంది నైజీరియన్స్ పట్టుకోవటంతో వాళ్ళకి నవదీప్ కి సంబంధాలు వున్నట్టుగా పోలీసులకి తెలిసింది. వాళ్ళ కాల్ డేటా బట్టి ఇవన్నీ తెలుసుకున్నట్టుగా అందుకనే పోలీసులు నవదీప్ ని విచారణకి హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఇవి 41ఎ కింద జారీ చేసినట్టుగా చెపుతున్నారు.

అయితే ఇప్పటికే ఈ కేసుతో తనకి ఏమీ సంబంధం లేదని కోర్టుకి వెళ్లి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. ఆ సమయంలో నవదీప్ ని అరెస్టు చెయ్యొద్దని, కానీ విచారం మాత్రం చేయొచ్చని కోర్టు చెప్పింది. కానీ ఈ కేసులో నవదీప్ కి సంబంధం వున్నట్టుగా పోలీసులు బలంగా నమ్ముతున్నట్టుగా తెలిసింది. ఇప్పుడు 37వ నిందుతుడిగా నవదీప్ ని చేర్చారు. ఇప్పుడు కోర్ట్ బెయిల్ కూడా రద్దవటంతో ఈ కేసు ఆసక్తికరంగా మారింది.

2navadeep.jpg

మాదాపూర్ లోని విఠల్ నగర్ , ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ లో ఒకటి వీరందరికీ దందాగా మారినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అక్కడ నుండే అంత నడుస్తోందని, అదే అపార్ట్మెంట్ లో సుమారు పది లక్షల రూపాయల విలువ చేసే డ్రగ్స్ పట్టుకున్నట్టుగా కూడా తెలిసింది. ఈ కేసులో ఫిలిం ఫైనాన్సియర్ కె వెంకటరమణ రెడ్డి, అలాగే 'డియర్ మేఘ' చిత్ర దర్శకుడు అణువు సుశాంత్ రెడ్డి ని పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారిస్తున్న సమయంలోనే నవదీప్ పేరు బయటకి వచ్చిందని తెలుస్తోంది. నవదీప్ స్నేహితుడితో డ్రగ్ తీసుకున్నట్టు గా పోలీసులు భావిస్తున్నారు.

అయితే కోర్ట్ బెయిల్ రద్దవటం, పోలీసులు నవదీప్ కి నోటీసులు జారీ చెయ్యడం, చూస్తుంటే నవదీప్ ని 23న విచారణ జరిపి అరెస్టు చేసే అవకాశం కూడా లేకపోలేదని కొందరు అంటున్నారు. ఆసక్తికర అంశం ఏంటంటే 2017లో కూడా అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము టాలీవుడ్ లో చాలామందిని డ్రగ్స్ కేసులో విచారించినప్పుడు నవదీప్ ని కూడా విచారించింది. మళ్ళీ ఇప్పుడు ఇలా డ్రగ్స్ కేసులో నవదీప్ పేరు ఉండటం, టాలీవుడ్ లో ఈ డ్రగ్స్ కలకలం మరోసారి సంచలనం రేపుతోంది. ఇప్పుడు నవదీప్ ని విచారిస్తే ఎవరెవరి పేర్లు బయటకి వస్తాయో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Updated Date - 2023-09-22T09:38:59+05:30 IST