KrithiShetty: వరస ఫ్లాపులొస్తున్నాయి, ఇప్పుడేం చెయ్యాలి
ABN , First Publish Date - 2023-05-13T15:26:41+05:30 IST
ఇంకా 20 కూడా నిండని కృతి శెట్టి కి అప్పుడే వరసగా ఫ్లాపులు వచ్చి పడుతున్నాయి. నిన్న విడుదల అయిన 'కస్టడీ' ఆమె ఖాతాలో ఇంకో ఫ్లాపుగా నమోదు చేసుకోవటమే కాకుండా, ఇది తమిళం లో కూడా విడుదల అయింది, కానీ సేమ్ రిసల్ట్
కృతి శెట్టి (KrithiShetty) ఖాతాలో మరో ఫ్లాప్ పడింది. మామూలుగా అయితే, మరో విజయం అనాలి, కానీ పాపం ఈ అమ్మాయికి వరసగా ఫ్లాపులు వస్తున్నాయి కాబట్టి, మరో ఫ్లాపు పడింది. నిన్న విడుదల అయిన 'కస్టడీ' (Custody) లో కృతి శెట్టి కథానాయికగా వేసింది. నాగ చైతన్య (NagaChaitanya) ఇందులో కథానాయకుడు, వెంకట్ ప్రభు (VenkatPrabhu) దర్శకుడు. ఈ సినిమా రెండు భాషల్లో అంటే తెలుగు, తమిళం లో విడుదల అయింది. అందుకని కృతి శెట్టికి ఇది ఇంకో రకమైన ఫ్లాప్ కూడా.
కృతి శెట్టి మొదటి సినిమా 'ఉప్పెన' (Uppena) చాలా పెద్ద ఘాన విజయం సాధించింది. అందులో ఆమె నటనకు గాను, అలాగే ఆమె పాత్ర పేరు అయిన 'బేబమ్మ' (Bebamma) గా తెలుగువాళ్లందరికీ చాలా సుపరిచితం అయింది. అయితే ఆ సినిమా అంతటి విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించి ఉండరేమో, అందుకే ఆమె చేసిన తరువాతి సినిమాకి కూడా అంతే క్రేజ్ వస్తుందని ప్రేక్షకులు ఎదురు చూసినట్టున్నారు. కానీ పాపం కృతి శెట్టి కి తరువాత ఒకటి రెండు సినిమాలు విజయాలు సాధించినా, చివరి నాలుగు సినిమాలు మాత్రం మొత్తం డిజాస్టర్ గా నిలిచాయి.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక నటుడు సినిమా ఫెయిల్ అయితే పరవాలేదు, అందులోకి ఒక పెద్ద పేరున్న కుటుంబం నుండి వచ్చినవాడు అయితే, అసలు చెప్పనవసరం లేదు, కానీ అదే నటీమణికి ఫెయిల్యూర్ వస్తే మాత్రం కొంచెం వెనకపడుతుంది. ఇప్పుడు కృతి శెట్టి పరిస్థితి కూడా అంతే. ఈ కస్టడీ (Custody) లో ఆమె పాత్ర పెద్దగా లేదు, బలంగా కూడా లేదు, కానీ ఎదో ఒక కథానాయకురాలు ఉండాలి కాబట్టి ఆమెని తీసుకున్నారు అనిపిస్తుంది. కృతి శెట్టి ఇంకా చిన్నమ్మాయి కాబట్టి, ఇంత చిన్న వయసులోనే ఆమె ఇలా వరస ఫ్లాపులు చూసింది కాబట్టి, తేరుకొని మళ్ళీ ముందుకు వెళ్ళవచ్చు. ఇంకా చాలా కాలం పాటు ఆమె పరిశ్రమలో ఉండాలి అంటే, ఇలాంటి ఆటుపోటులని తట్టుకోక తప్పదు.
ఇప్పుడు కృతి శెట్టి దృష్టి మంచి కథలు, స్క్రిప్ట్ ల మీద ఉండాలి, ఎందుకంటే కాంబినేషన్ కాదు, కథ ముఖ్యం అని తెలుసుకోవాలి అని పరిశ్రమలో అంటున్నారు. అందుకని ఆమె చిన్న పాత్ర అయినా, బలమైన పాత్ర కోసం ఎదురు చూడాలి అంటున్నారు.