Yash: అయోమయంలో కెజియఫ్ నటుడి కెరీర్
ABN , First Publish Date - 2023-06-10T13:53:27+05:30 IST
కన్నడ యష్ 'కెజిఫ్' సినిమాతో జాతీయ స్థాయి నటుడు అయ్యాడు. అయితే కెజిఫ్ విడుదలై సంవత్సరం పైనే అవుతోంది, కానీ ఇంతవరకు యష్ తన తదుపరి సినిమా ఎవరితో, ఏంటి అనేది ఇంతవరకు ప్రకటన లేదు, కనీసం కథలు కూడా వింటున్నట్టు లేదు అని అంటున్నారు.
కన్నడ పరిశ్రమలో యష్ (Yash) అనే నటుడు 'కెజిఫ్' #KGF సినిమా ముందు వరకు కన్నడ పరిశ్రమకే పరిమితం. ఎందుకంటే అతని సినిమాలు ఏవీ కూడా తెలుగులో కానీ, ఇతర భాషల్లో కానీ అంతగా అనువాదం చేసి విడుదల చేసినట్టు ఎక్కడ కనపడవు. అయితే 'కెజిఫ్' ఎప్పుడైతే విడుదల అయిందో, యష్ #Yash పేరు మారుమోగిపోయింది. ఒక్క కన్నడం లోనే కాకుండా ప్రపంచం అంతటా ఎవరీ యష్ అంటూ అతని గురించి గూగుల్ చెయ్యడం, తెలుసుకోవటం మొదలెట్టారు. 'కెజిఫ్' కి సీక్వెల్ 'కెజిఫ్ 2' #KGF2 రావటం, ఆ సినిమా ఒక పెద్ద విజయం సాధించటమే కాకుండా వెయ్యికోట్ల క్లబ్బులో కూడా చేరింది. ఇలా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు చాలా కొన్ని మాత్రమే వున్నాయి. ఆ సినిమాకి ప్రశాంత్ నీల్ #PrashanthNeel దర్శకత్వం వహించాడు.
ఇదంతా జరిగిపోయిన కథ. 'కెజిఫ్ 2' #KGF2 విడుదల అయింది ఏప్రిల్ 14, 2022. అంటే ఒక సంవత్సరం పైనే అయింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే 'కెజిఫ్' లో నటించిన యష్ తన తదుపరి సినిమా ఏమి చేస్తున్నాడు అంటే, ఏమీ చెయ్యటం లేదు, ఏమి చేద్దామా అని ఆలోచిస్తున్నాడు, అయోమయంలో వున్నాడు, అగమ్య గోచరంగా వుండిపోయాడు.
ఎందుకు చెయ్యడం లేదు అనే ప్రశ్న అతని అభిమానులకు వేధిస్తున్న ప్రశ్న. ఎందుకు చెయ్యడం లేదంటే తన తదుపరి సినిమా 'కెజిఫ్' అంత రేంజ్ కాకపోయినా, అందులో సగం అయినా ఉండాలి కదా. ఆలా ఉండాలి అంటే, అంత పెద్ద బడ్జెట్ సినిమా చెయ్యాలి కదా, ఆ బడ్జెట్ సినిమాని హేండిల్ చెయ్యగలిగే దర్శకుడు దొరకాలి కదా. ప్రశాంత్ నీల్ #PrashanthNeel తరువాత కన్నడ పరిశ్రమలో అంతటి పెద్ద బడ్జెట్ సినిమా హేండిల్ చెయ్యగలిగే దర్శకుడు లేడు. అదీ కాకుండా యష్ ఇప్పుడు ఒక చిన్న సినిమా చెయ్యలేడు, ఎందుకంటే అతని రేంజ్ 'కెజిఫ్' తో బాగా పెరిగిపోయింది.
పోనీ ప్రశాంత్ నీల్ రేంజ్ లో వుండే దర్శకులు తెలుగులో వున్నారు అనుకుందాం, రాజమౌళి (SSRajamouli), సుకుమార్ (Sukumar), బోయపాటి (BoyapatiSrinivas), త్రివిక్రమ్ (TrivikramSrinivas) ఈ అగ్ర దర్శకులు అందరూ తమ తమ ప్రాజెక్టులతో చాలా బిజీ గా వున్నారు. తమిళంలో కూడా అక్కడ దర్శకులు బిజీ గా వున్నారు. పోనీ ప్రశాంత్ నీల్ తో మళ్ళీ చేద్దాం అనుకుంటే, అతను ఇప్పుడు ప్రభాస్ (Prabhas) తో 'సాలార్' (Salar) , తదుపరి ఎన్టీఆర్ (NTR) తో ఒక సినిమా, ఆ తరువాత రామ్ చరణ్ (RamCharan) ఇలా చాలా ప్రాజెక్ట్స్ తో బిజీగా వున్నాడు. అందుకని యష్ ఏమి చెయ్యాలో పాలుపోక కాళీగా వుండి, దర్శకుడి కోసం చూస్తున్నాడు.
మరి ఇప్పుడు ఎలా, ఏమి చెయ్యదలచుకున్నాడు అంటే, అతనికే తెలియాలి. కన్నడంలో ప్రస్తుతం వున్న దర్శకుల్లో ఒకరిని ఎంచుకొని అతనితో సెట్ మీదకి వెళ్ళటమే ఇప్పుడు అతను చెయ్యాలి అని పరిశ్రమలో చర్చ నడుస్తోంది. లేదా హిందీ సినిమాలు ప్రయత్నం చెయ్యాలి, కానీ అది అంత సులువు కాదు. అందుకే అతని కెరీర్ ఒక అయోమయంలో పడిపోయింది అని అంటున్నారు.