Mega Star Chiranjeevi: 'భూలోక వీరుడు'కి ఆ సినిమాకి ఒక్క సన్నివేశం కూడా కనెక్షన్ లేదు
ABN , First Publish Date - 2023-10-16T18:15:17+05:30 IST
చిరంజీవి, యువ దర్శకుడు మల్లిడి వసిష్ఠతో చెయ్యబోయే ఫాంటసీ సినిమాకి, అశ్విని దత్ నిర్మాతగా ఇంతకు ముందు వచ్చిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమా కథకి అసలు పోలికే లేదని, ఈ రాబోయే సినిమా పూర్తిగా ఒక కొత్త కథతో వస్తున్నారు అని తెలిసింది.
మెగాస్టార్ చిరంజీవి (MegaStarChiranjeevi) యువ దర్శకుడు మల్లిడి వసిష్ఠ (MallidiVasishta) తో ఒక ఫాంటసీ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'భూలోక వీరుడు' #Bhoolokaveerudu అనే టైటిల్ పెడుతున్నట్టుగా వార్తలు వైరల్ అయ్యాయి, కానీ చిత్ర నిర్వాహకులు మాత్రం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఇందులో చిరంజీవి పక్కన నలుగురు కథానాయికలు ఉంటారని కూడా వార్తలు వచ్చాయి. అందులో అనుష్క శెట్టి (AnushkaShetty) ఒకరు అని కూడా అంటున్నారు. మిగతా కథానాయికల కోసం బాలీవుడ్ నటీమణులను తీసుకోవచ్చు అని కూడా వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉండగా ఈమధ్యనే అశ్విని దత్ (AshwiniDutt) కి చెందిన వైజయంతీ మూవీస్ (VyjayanthiMovies) సంస్థ ఒక పబ్లిక్ ప్రకటన ఇచ్చింది. అశ్విని దత్ నిర్మాతగా చిరంజీవి, శ్రీదేవి (Sridevi) జంటగా నటించిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' #JagadekaVeeruduAthilokaSundari సినిమా గురించి ఆ ప్రకటన. ఈ సినిమా నుండి ఒక్క సన్నివేశం, పాత్ర, ఏదైనా పేరు, సంగీతం, సీక్వెల్, ప్రీక్వెల్, అసలు ఆ సినిమా నుండి ఎటువంటి చిన్న బిట్ కూడా ఎవరు తీసుకున్నా వాళ్ళు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారని చెప్పారు.
ఇప్పుడెందుకు ఇలా ప్రకటన ఇచ్చారు అన్నదానికి పరిశ్రమలో ఒక టాక్ నడిచింది. చిరంజీవి నటించబోతున్న ఈ ఫాంటసీ సినిమాలో 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాకి సంబంధించి కొన్ని సన్నివేశాలు ఉండొచ్చు అని వార్తలు రావటంతో, ఈ ప్రకటన ఇచ్చినట్టుగా పరిశ్రమలో టాక్. అయితే మల్లిడి వసిష్ఠ తీస్తున్న ఈ ఫాంటసీ సినిమాలో అసలు పాత సినిమాకి, ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు అని ఆ చిత్ర యూనిట్ లో ఒకరు చెప్పారు. "ఈ ఫాంటసీ కథ పూర్తిగా భిన్నమైనది, మామూలుగా 14 లోకాలు ఉంటాయి అని అంటారు, కానీ ఈ కథ పూర్తిగా ఒక కొత్త లోకంలో అంటే 15వ లోకంలో జరిగే ఫాంటసీ కథ" అని చెప్పారు.
'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా కథ భూలోకంలో జరిగింది. అందుకే ఆ సినిమాకి, ఈ రాబోయే ఫాంటసీ సినిమాకి పోలికలు ఉంటే, చిరంజీవి అంతటి నటుడు సినిమా చెయ్యడానికి ఒప్పుకుంటారా అని పరిశ్రమలో ఒక పెద్దాయన అన్నారు. మామూలుగా పరిశ్రమలో వార్తలు వస్తూ ఉంటే, అవి చూసి వైజయంతి మూవీస్ ఆ ప్రకటన ఇచ్చి వుంటారు అని అంటున్నారు, అంతేకానీ ఈ సినిమా పూర్తిగా భిన్నమైనది అని తెలిసింది.