Virupaksha film review: ఆద్యంతమూ ఆసక్తికరంగా సాగే ...

ABN , First Publish Date - 2023-04-21T12:30:59+05:30 IST

'విరూపాక్ష' సినిమా సాయి ధరమ్ తేజ్ కి బైక్ ప్రమాదం జరిగిన తరువాత ఒప్పుకున్న సినిమా. దీనికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథనం అందించాడు. అలాగే కార్తిక్ దండు కి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. మూడు హిట్ సినిమాలు ఇచ్చిన సంయుక్త మీనన్ ఇందులో కథానాయిక. ఇన్ని కలబోసిన ఈ సినిమా ఎలా ఉందంటే...

Virupaksha film review: ఆద్యంతమూ ఆసక్తికరంగా సాగే ...

సినిమా: విరూపాక్ష

నటీనటులు: సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్, సాయిచంద్, బ్రహ్మాజీ, సునీల్, శ్యామల, రాజీవ్ కనకాల, అజయ్, సోనియా తదితరులు

ఛాయాగ్రహణం: శాందత్ సైనుద్దీన్ (Shamdat Sainudeen)

సంగీతం: అజనీష్ లోకనాథ్ (B Ajaneesh Loknath)

కథనం: సుకుమార్ (Sukumar)

కథ, దర్శకత్వం: కార్తీక్ దండు (Karthik Dandu)

-- సురేష్ కవిరాయని

సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)కు బైక్ పడిపోయి ప్రమాదం జరిగాక చాలా కాలం బయటకి రాలేదు. ఆ తరువాత ఒప్పుకున్న సినిమా ఈ 'విరూపాక్ష' #VirupakshaFilmReview. కార్తీక్ దండు (Karthik Dandu) దీనికి దర్శకుడు.. ఇది అతనికి మొదటి సినిమా. ఈ సినిమాకి ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలి అంటే, అగ్ర దర్శకుడు అయిన సుకుమార్ (Sukumar) దీనికి కథనం (Screenplay) అందించాడు. ఇందులో సంయుక్తా మీనన్ (Samyuktha Menon) కథానాయకురాలిగా చేసింది. ఈ సినిమా ప్రచార చిత్రాలు చాలా ఆసక్తికరంగా ఉండటంతో, ఈ సినిమా మీద అంచనాలు #VirupakshaFilm Review ఏర్పడ్డాయి. మరి ఈ అంచనాలకి తగ్గట్టు సినిమా వుందో లేదో చూద్దాం.

virupakshafromapril21.jpg

Virupaksha story కథ:

రుద్రవనం గ్రామ ప్రజలు ఎక్కువగా మూఢనమ్మకాలను నమ్ముతారు. ఆ ఊరి పూజారి (సాయిచంద్) ఆ వూర్లో ఏమి జరిగినా ఒక పుస్తకం తీసి అందులో ఏమి రాసి వుందో చూసి అలా చేస్తూ వుంటారు. ఆ పుస్తకం ఒక శాసనం వంటిది అన్నమాట. ఆ వూరికి సూర్య (సాయి ధరమ్ తేజ్) తరువాత వాళ్ళమ్మతో వస్తాడు. అక్కడ నందిని (సంయుక్తా మీనన్) ని చూసి ప్రేమలో పడతాడు. ఇంతలో ఆ వూరిలో విచిత్ర మరణాలు సంభవిస్తూ ఉంటాయి. పూజారి పుస్తకం చూసి ఆ ఊరిని అష్ట దిగ్బంధనం చెయ్యమంటాడు. అంటే ఎనిమిది రోజుల పాటు ఆ ఊర్లోకి ఎవరూ రాకూడదు, వూర్లో వున్నవాళ్లు బయటకి వెళ్ళకూడదు. సూర్య, అతని అమ్మగారు చాలా #VirupakshaReview సంవత్సరాల తరువాత వచ్చారు కాబట్టి, వాళ్ళని ఊరి నుండి వెళ్ళిపోమంటారు. కానీ నందిని ని ప్రేమిస్తున్న సూర్య ఊరి దాటిపోయి మళ్ళీ వస్తాడు. ఇంతకీ ఎందుకు మళ్ళీ ఊర్లోకి వచ్చాడు, నందినికి ఏమైంది, వూర్లో మరణాలు ఎందుకు సంభవించాయి, ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

virupaksha.jpg

విశ్లేషణ:

దర్శకుడు కార్తీక్ దండు తన మొదటి సినిమా 'విరూపాక్ష' #VirupakshaReview తో ఒక విలక్షణమైన కథని ఎంచుకున్నాడు. చాలామంది తమ మొదటి కథని ఏదైనా రొమాంటిక్ కామెడీ, లవ్ స్టోరీ, లేదా ఇంకో జానర్ లాంటివి చూసుకుంటారు, కానీ కార్తీక్ చిన్న సూపర్ నాచురల్, చేతబడి, క్షుద్రశక్తి లాంటివి వున్న కథని ఎంచుకున్నాడు. అయితే ఇలాంటివి చెప్పడం, రాయటం చాలా సులువు, కానీ అవన్నీ వెండితెర మీద చూపించటం కష్టం. కానీ కార్తీక్ తన కథని నమ్ముకున్నాడు కాబట్టి, దాని యధాతదంగా సస్పెన్స్ తో కూడిన, కాస్త భయం అలాగే కొన్ని అతీంద్రీయ శక్తులను కలగలిపి ప్రేక్షకుడిని ఎక్కడికో తీసుకెళ్లాడు.

అయితే ఇప్పుడున్న కాలంలో ఇలాంటి అతీంద్రీయ శక్తులు, చేతబడులు లాంటివి ఉన్నాయా, నమ్ముతారా అన్నది పక్కన పెడితే, దర్శకుడు ఒక కథను ఎంచుకొని ప్రేక్షకుడిని ఎలా ఎంటర్ టైన్ చేసాడు #VirupakshaFilmReview అన్నదే ముఖ్యం. కార్తీక్ దండు అందులో సఫలం అయ్యాడు. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఆద్యంతమూ ప్రేక్షకుడిని కట్టిపడేసినట్టు చేసాడు. ముఖ్యంగా రెండో సగం సినిమా అయితే ఇంకా చాలా బాగా చూపించడమే కాకుండా, ఏమవుతుంది చివరికి అన్నట్టుగా ప్రేక్షకుడికి బాగా ఆసక్తి గొలిపే విధంగా నేరేట్ చేసాడు.

saidharamtej.jpg

అయితే ఈ సినిమాకి కథనం కూడా అంతే ముఖ్యం. అది ప్రముఖ దర్శకుడు సుకుమార్ అందించటం విశేషం. అలాగే ఇలాంటి సినిమాలకి సాంకేతికత చాలా అవసరం. ఆ రెండూ కూడా సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ (B Ajaneesh Loknath), ఛాయాగ్రహణం శాందత్ సైనుద్దీన్ (Shamdat Sainudeen) ఇద్దరూ రెండు పిల్లర్స్ లా నిలుచున్నారు. నేపధ్య సంగీతం ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకుడి గుండెల్లో గుబులు రేపుతోంది, అంతలా ఉంటుంది. అలాగే ఈ కథని తన ఛాయాగ్రహణం ద్వారా ఇంకా బాగా చెప్పగలిగాడు. ఈ ఇద్దరూ ఈ సినిమాకి ఆయువుపట్టులా వుంటారు.

సినిమాని తెరమీద ఆసక్తిగా చూపించాలంటే దానికి దర్శకుడు ప్రతిభ అవసరం. ఎందుకంటే అతని మైండ్ లో ఎటువంటి విజువలైజేషన్ వుందో అదే తెరమీద కనపడాలి. ఇందరి సహకారంతో తన కథని ప్రేక్షకుడు కుర్చీలో రెండున్నర గంటలు కూర్చునే విధంగా చేసిన దర్శకుడు కార్తీక్ దండు ప్రతిభ ఇక్కడ కనపడుతుంది. మొదటి సినిమాతో తన టాలెంట్ ని చూపించిన దర్శకుడు అభినందనీయుడు. చివరి అరగంట కథని అద్భుతంగా తెరకెక్కించాడు. అసలు ఇంతకీ ఆ మరణాలకు కారకులు ఎవరు, ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేయిస్తున్నారు అన్నవి చివరి వరకూ సస్పెన్స్ బాగా కొనసాగించాడు దర్శకుడు. గ్రాఫిక్స్ కూడా అదిరిపోయాయి.

virupaksha1.jpg

నటీనటుల విశ్లేషణ:

ఇందులో కథానాయకుడు వెళ్లి వందమందిని కొట్టడం, లేదా పాటలు పాడేసి అమ్మాయిల వెనక తిరగటం లాంటి ఘనకార్యాలు వుండవు. కథానాయకుడు సొంతవూరికి వచ్చి అక్కడ చూసిన విచిత్ర మరణాల వెనక వున్న రహస్యాన్ని ఛేదిస్తాడు. దానికి కొంచెం బుద్ధి బలం కూడా అవసరం. అలాంటి పాత్రలో సాయి ధరమ్ తేజ్ బాగా చేసాడు, ఒదిగిపోయాడు. ఇది అతనికి మంచి సినిమా అవుతుంది అనటంలో సందేహం లేదు. అలాగే సంయుక్తా మీనన్ (SamyukthaMenon) మొదట్లో మామూలుగా కనిపించినా రెండో సగంలో అయితే ఆమె అదరగొట్టింది అనే చెప్పాలి. చివరి అరగంట సినిమా అయితే ఆమె నటనా ప్రావీణ్యానికి చూపించే అవకాశం వచ్చింది. కేవలం గ్లామర్ వల్లే పాత్రలు వస్తాయి అనటం ఎంతమాత్రం నిజం కాదు. ప్రతిభా కూడా ఉండాలి, అది సంయుక్తకి వుంది, అది ఈ సినిమాతో ఆమె నటిగా నిరూపించుకుంది. అలాగే సాయిచంద్, (SaiChand) రాజీవ్ కనకాల (Rajiv Kanakala), అజయ్, అందరూ బాగా నటించాడు. ఇంకొక సీనియర్ నటుడు బ్రహ్మాజీ (Brahmaji) ఒక మంచి పాత్రలో కనపడతాడు, అలాగే చక్కగా చేసి చూపించాడు. మిగతా పాత్రల్లో చాలామంది వున్నారు, వాళ్ళందరూ కూడా బాగా చేశారు. సోనియా సింగ్ తన పాత్రకి న్యాయం చేసింది. ప్రముఖ యాంకర్ శ్యామల కూడా ఒక పాత్రలో మెరుస్తుంది. దర్శకుడు అందరి నటీనటుల నుంచి మంచి నటనని రాబట్టగలిగాడనే చెప్పాలి.

చివరగా, 'విరూపాక్ష' సినిమా ప్రేక్షకుడిని రెండున్నర గంటల వినోదాన్ని పంచుతూ కట్టిపడేస్తుంది. భయం కొలిపే సన్నివేశాలు వున్నాయి, సస్పెన్స్ చాలా వుంది, ఆసక్తికరంగా ఉంటుంది కథ. క్షుద్ర పూజలు, చేతబడి ఇలాంటివి కథలో వున్నాయి కాబట్టి, పిల్లలని తీసుకు వెళ్లకుండా ఉంటే మంచిది. అవన్నీ పక్కన పెట్టి, ఒక వైవిధ్యమైన సినిమా కోరుకునే వాళ్ళు మాత్రం ఈ సినిమా చూడొచ్చు. ఛాయాగ్రహణం, నేపధ్య సంగీతం రెండూ ఈ సినిమాకి ఆయువు పట్టు. సాయి ధరమ్ తేజ్ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు మళ్ళీ వచ్చాడు, అలాగే దీనికి ఆద్యుడు దర్శకుడు కార్తిక్ దండు, అతనికి ఫుల్ క్రెడిట్ ఇవ్వాలి.

Updated Date - 2023-04-21T12:53:39+05:30 IST