Tiger 3 film review: అంతా సల్మాన్ ఖాన్ షో

ABN , First Publish Date - 2023-11-12T18:23:19+05:30 IST

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన 'టైగర్ 3' సినిమా ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా విడుదలైంది. మామూలుగా అయితే శుక్రవారం విడుదలవుతూ ఉంటాయి సినిమాలు, కానీ ఇలా ఆదివారం విడుదలవడం కొంచెం ఆశ్చర్యమే. గూఢచారి సినిమా పరంపరలో మూడో సీక్వెల్ వచ్చిన ఈ సినిమా ఎలా వుందో చదవండి.

Tiger 3 film review: అంతా సల్మాన్ ఖాన్ షో
Tiger 3 movie review

సినిమా: టైగర్ 3

నటీనటులు: సల్మాన్ ఖాన్ (SalmanKhan), కత్రినా కైఫ్ (KatrinaKaif), ఇమ్రాన్ హష్మీ (EmraanHashmi), సిమ్రన్ (Simran), రేవతి (Revathi), అనీష్ కురువిల్లా (AneeshKuruvilla), మాస్టర్ విశాల్ జేత్వా తదితరులు

కథ: ఆదిత్యా చోప్రా (AdityaChopra)

ఛాయాగ్రహణం: అనయ్ గోస్వామి

నేపథ్య సంగీతం: తనూజ్ టికు

పాటల సంగీతం: ప్రీతమ్

నిర్మాత: ఆదిత్య చోప్రా

దర్శకత్వం: మనీష్ శర్మ (ManeeshSharma)

విడుదల తేదీ: నవంబర్ 12, 2023

రేటింగ్: 3 (మూడు)

-- సురేష్ కవిరాయని

యష్ రాజ్ ఫిలిమ్స్ (YRF) స్పై యూనివర్స్ గూఢచారి సినిమాలు తీస్తూ వచ్చారు. ఇంతకు ముందు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా 'ఏక్ థా టైగర్' #EkThaTiger దానికి సీక్వెల్ 'టైగర్ జిందా హై' #TigerZindaHai ఇప్పుడు మూడో సీక్వెల్ గా వచ్చిందే ఈ 'టైగర్ 3' #Tiger3. ఇందులో కూడా సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించారు. ఇందులో వాళ్ళకి ఒక కుమారుడు కూడా ఉంటాడు. #Tiger3Reivew అలాగే ఇదే వైఆర్ఎఫ్ ఈ సంవత్సరం షా రుఖ్ ఖాన్ (ShahRukhKhan) తో 'పఠాన్' #Pathaan సినిమా తీసి పెద్ద విజయం సాధించారు. అది కూడా గూఢచారి నేపధ్యం వున్న సినిమా, అందులో సల్మాన్ ఖాన్ చిన్న అతిధి పాత్రలో కనపడి పఠాన్ ని రక్షిస్తాడు, ఇందులో పఠాన్ చిన్న అతిధి పాత్రలో వచ్చి టైగర్ ని రక్షిస్తాడు. ఇంతకీ ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. (Tiger 3 movie review)

salmankhankatrinatiger.jpg

అవినాష్ అలియాస్ టైగర్ ఒక భారత గూఢచారి గోపిని (రణ్వీర్ షోర్) రక్షించడానికి ఒక కష్టతరమైన అసైన్మెంట్ లో పాల్గొంటాడు, గోపిని రక్షించి భారతదేశం తీసుకు వస్తుండగా అతను అన్నీ డిపార్టుమెంట్ కి చెప్పేశా కానీ ఒక్క విషయం మాత్రం చెప్పలేదు అది నీకు మాత్రమే చెప్పాలి అని టైగర్ కి చెప్తాడు. ఇంతకీ అతను చెప్పేది ఏంటంటే టైగర్ భార్య జోయా (కత్రినా కైఫ్) డబుల్ ఏజెంట్ అని, పాకిస్తానీ వాళ్ళకి కూడా పని చేస్తోందని చెప్పి మరణిస్తాడు గోపి. అప్పటినుండి టైగర్ తన భార్యని అనుమానంగా చూస్తూ ఉంటాడు. టైగర్ మారువేషంలో ఒక ముఖ్యమైన అసైన్మెంట్ పని మీద టర్కీ వెళతాడు అక్కడ తన భార్యే తనని చంపడానికి చూస్తుంది. అణ్వాయుధాలకి సంబందించిన ఒక రహస్య సంకేతాలు వున్న బ్రీఫ్ కేస్ ఆటిష్ కి ఇచ్చేస్తుంది జోయా. #Tiger3Reivew పాకిస్తాన్ ఐఎస్ఐ కి చెందిన ఆతిష్ రెహ్మాన్ (ఇమ్రాన్ హష్మీ) జోయా, టైగర్ ల కుమారుడు జూనియర్ ని కిడ్నాప్ చేసి జోయాని భారతదేశంకి వ్యతిరేకంగా పనిచెయ్యమన్న విషయం అప్పుడు తెలుస్తుంది టైగర్ కి. ఆతిష్ రెహ్మాన్ పాకిస్తాన్ ప్రధానమంత్రిని (సిమ్రాన్) చంపి తాను ఆ దేశానికి ప్రధానమంత్రి అవ్వాలని అనుకుంటాడు, ఆ నేరం టైగర్, అతని భార్య జోయా మీద వెయ్యాలి అనుకుంటాడు. #Tiger3Reivew భారతదేశం, పాకిస్తాన్ రెండు దేశాలూ టైగర్, జోయాలు నమ్మకద్రోహం చేశారని వారి కోసం వేట మొదలుపెడతాయి. ఇంతకీ ఆతిష్ రెహ్మాన్ చేస్తున్న ప్రయత్నం సఫలం అయిందా? టైగర్ అతని భార్య జోయా తమ మీద ఆపాదించబడిన దేశద్రోహ నేరం నుండి ఎలా బయటపడ్డారు? పాకిస్తాన్ ప్రధానమంత్రిని ఎలా కాపాడగలిగారు? భారతదేశం నుండి సాయం అందిందా? ఇవన్నీ చూడాలంటె 'టైగర్ 3' చూడాల్సిందే. (Tiger 3 movie review)

salmankhan-tiger31.jpg

విశ్లేషణ:

దర్శకుడు మనీష్ శర్మ, కథ రాసిన ఆదిత్య చోప్రా ఒక యాక్షన్ సినిమా తీయాలని అనుకున్నారు. ఈ సినిమాలో పెద్దగా కథ ఏమీ ఉండదు, చాలా వరకు యాక్షన్ సన్నివేశాలు మాత్రమే కనపడతాయి. సినిమా విజువల్స్ చాలా బాగుంటాయి, అందమైన లొకేషన్స్ లో అదిరిపోయేట్టు తీశారు. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ (YRFSpyUniverse) లో ఈ 'టైగర్ 3' కూడా ఇంకొక సినిమా. అయితే నొప్పింపక, తానొవ్వక అన్నట్టుగా పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యానికి అక్కడున్న ఐఎస్ఐ కారణమని, పాకిస్తాన్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉండాలని అందరూ కోరుకుంటున్నారని, అక్కడ ప్రధానమంత్రి కూడా శాంతి కోరుకుంటున్నారని చూపించారు సినిమాలో. అందుకని పాకిస్తాన్ కి మరీ వ్యతిరేకంగా సినిమా అనిపించదు.

ఇదిలా ఉంటే, దీనికి ముందు తీసిన రెండు సినిమాల్లో కొంచెం భావోద్వేగాలు, కథ ఉంటాయి. ఈ సినిమాలో ఆ రెండూ కొంచెం లోపించాయనే చెప్పాలి. ఇది కేవలం సల్మాన్ ఖాన్ ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. సినిమా మొత్తం అందుకే పోరాట సన్నివేశాలతో నింపేశారు, కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని చెప్పాలి. ఇందులో టైగర్ కుటుంబాన్ని కథలో చొప్పించారు కానీ, అది అంతగా ఆకట్టుకోలేకపోయింది. 'పఠాన్' లో సల్మాన్ అలరించారు, ఇప్పుడు ఈ 'టైగర్ 3' లో షారుఖ్ ఖాన్ వచ్చి అలరిస్తాడు. ప్రేక్షకులు ఈలలు చెప్పట్లు వేసే సన్నివేశం సల్మాన్, షా రుఖ్ ఇద్దరూ చేసిన ఆ పోరాట సన్నివేశం. అలాగే ఇందులో పాటలు బాగుంటాయి. #TIger3Review

salmankhankatrinakaif.jpg

కథ, కథనాలు అంత పెద్దగా లేకపోయినా, ఒక్కోసారి పాకిస్తాన్ ప్రధానమంత్రి సెక్యూరిటీ మరీ అంత వీక్ గా ఉంటుందా అని అనిపించినా, ఈ సినిమా నడిచేస్తోంది. ఎందుకంటే ఇది పైసా వసూల్ సినిమా అని తెలిసిపోతుంది. అలాగే చివర్లో పాకిస్తాన్ ప్రధాని, టైగర్ కి బహుమతిగా పిల్లలతో మన జాతీయగీతం ఆలపించడం ఆకట్టుకుంటుంది. ఆ సమయంలో థియేటర్ లో ప్రేక్షకులు అందరూ గౌరవంగా లేచి నిలబడటం కనపడుతుంది. చివర్లో హ్రితిక్ రోషన్ వచ్చి తాను జూనియర్ ఎన్టీఆర్ తో చెయ్యబోయే 'వార్ 2' సినిమాకి లీడ్ ఇస్తాడు. (Tiger 3 Movie Review)

ఇక నటీనటుల విషయానికి వస్తే, ఈ సినిమా మొత్తం సల్మాన్ ఖాన్ షో అనే చెప్పాలి. టైగర్ గా సల్మాన్ ఖాన్ ఇంతకు ముందు రెండు సినిమాల్లో చేసినట్టుగానే ఈ సినిమాలో కూడా కనిపించాడు. అలాగే అతనికి జోడీగా కత్రినా కైఫ్ కూడా బాగా చేసింది. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. అలాగే కత్రినా పోరాట సన్నివేశాలు చాలా బాగా చేసింది, ఆమె కష్టపడినా విషయం కనపడుతుంది. ఇక ఇమ్రాన్ హష్మీ విలన్ గా బాగున్నాడు. రేవతి 'రా' డైరెక్టర్ గా, సిమ్రాన్ పాకిస్తాన్ ప్రధానిగా తమ పాత్రలకి న్యాయం చేశారు. ఈ ఇద్దరికీ మంచి పాత్రలు వచ్చాయి. ఇక తెలుగుసినిమాల్లో ఎక్కువగా కనిపించే అనీష్ కురువిల్లా కూడా ఇందులో కనపడతాడు. మిగతావాళ్లు అందరూ తమ పాత్రల పరిధి మేరకి చేశారు. పాటలు బాగుంటాయి, నేపధ్య సంగీతం ఇంకా దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. షారుఖ్ ఖాన్ అతిధి పాత్రలో మెరుస్తాడు.

చివరగా, 'టైగర్ 3' లో కథ అంత పెద్దగా లేకపోయినా, ముందు రాబోయే సన్నివేశాలు తెలిసిపోతున్నా, సినిమా చూస్తుంటే బోర్ కొట్టకుండా ఉంటుంది. సల్మాన్ ఖాన్ అభిమాని అయితే సినిమాని బాగా ఆస్వాదిస్తాడు అని చెప్పొచ్చు. పోరాట సన్నివేశాలు బాగున్నాయి, షా రుఖ్ ఖాన్ అతిధి పాత్ర, అందమైన లొకేషన్స్, ఇవన్నీ బాగుంటాయి. సరదాగా ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు.

Updated Date - 2023-11-12T18:34:01+05:30 IST