Saptha Sagaralu Dhaati-Side A film review: రక్షిత్ శెట్టి సినిమా ఎలా ఉందంటే....
ABN , First Publish Date - 2023-09-22T18:55:57+05:30 IST
రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన 'సప్త సాగరాలు దాటి- సైడ్ ఎ' సినిమా ఈరోజు విడుదలైంది. ఇది కన్నడంలో రెండు వారాల క్రితమే విడుదలై అక్కడ పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో విడుదలైంది. ఈ సినిమా మొదటి భాగం మాత్రమే, ఈ కథ రెండో భాగంలో కూడా వుంది, అది వచ్చే నెలలో విడుదలవుతుంది.
సినిమా: సప్త సాగరాలు దాటి - సైడ్ ఎ
నటీనటులు: రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ (RukminiVasanth), పవిత్ర లోకేష్ (PavitraLokesh), అచ్యుత్ కుమార్, అవినాష్, గోపాల్ దేశ్ పాండే, రమేష్ ఇందిర తదితరులు
ఛాయాగ్రహణం: అద్వైత గురుమూర్తి (Advaitha Gurumurthy)
సంగీతం: చరణ్ రాజ్ (Cheran Raj)
దర్శకత్వం: హేమంత్ ఎం రావు (HemanthMRao)
నిర్మాత: రక్షిత్ శెట్టి (RakshitShetty)
-- సురేష్ కవిరాయని
కన్నడంలో ఆమధ్య వచ్చిన 'కాంతారా' #Kantara సినిమా తెలుగులో విడుదలై ఇక్కడ కూడా పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. దానికి రిషబ్ శెట్టి (RishabhShetty) కథానాయకుడు అయితే, ఇప్పుడు రక్షిత్ శెట్టి (RakshitShetty) నటించిన కన్నడ సినిమా 'సప్త సాగరాదాచే ఎల్లో -సైడ్ ఎ' #SaptaSaagaradaacheEllo- SideA ని తెలుగులో 'సప్త సాగరాలు దాటి - సైడ్ ఎ' #SapthaSagaraluDhaati-Side A గా విడుదల చేశారు. ఈ సినిమా కన్నడంలో రెండు వారాల క్రితం విడుదలై అక్కడ పెద్ద విజయం సాధించింది, ఈ శుక్రవారం తెలుగులో విడుదల చేశారు. దీనిలో రుక్మిణి వసంత్ కథానాయకురాలు, చరణ్ రాజ్ సంగీతం అందించారు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. #SapthaSagaraluDhaati-SideAFilmReview
SapthaSagaraluDhaati-Side A story కథ:
మను (రక్షిత్ శెట్టి), ప్రియ (రుక్మిణి వసంత్) ఇద్దరూ ఒక ప్రేమ జంట, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇద్దరూ తమ బంగారు భవిష్యత్తు గురించి చాలా కలలు కంటూ వుంటారు. మను ఒక ధనవంతుడి దగ్గర కారు డ్రైవర్ గా పని చేస్తూ వుంటాడు, ప్రియ చదువుకుంటూ పాటలు బాగా పడుతుంది, గాయని అవుదామని అనుకుంటుంది. #SapthaSagaraluDhaati-SideAFilmReview పెళ్లి కాక ముందే ఇద్దరూ భార్యాభర్తలుగా చలామణి అవుతూ పెళ్లయ్యాక ఉండటానికి ఇల్లు అద్దెకు దొరుకుతుందేమో అని వెతుకుతూ వుంటారు. అలాంటి సమయంలో బాగా డబ్బులు వస్తాయని, దానితో జీవితంలో ఇక స్థిరపడిపోవచ్చు అన్న ఆశతో చెయ్యని తప్పుకు మను జైలుకు వెళతాడు. అయితే ఇక్కడే కథ తారుమారు అవుతుంది. జైలుకు వెళ్లి తొందరగానే బయటకి వచ్చేయవచ్చు అనుకున్న మనుకు ఏమైంది? వాళ్లిద్దరూ తమ భవిష్యత్ జీవితం గురించి కన్న కలలు నిజమయ్యాయా? ప్రియ, మను ప్రేమ కథ ఎటువంటి మలుపులు తిరిగిందో చూడాలనుంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
దర్శకుడు హేమంత్ సినిమా మొదలవ్వగానే ఎటువంటి సాగదీత లేకుండా ప్రేమ జంట అయిన మను, ప్రియతోటే మొదలెట్టేసాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన చిన్న చిన్న సంఘటనలు, చిలిపి తగాదాలతో కథని మెల్లగా తీసుకెళ్లాడు. ఈ ప్రేమ కథని సముద్రంతో ముడిపెడతాడు దర్శకుడు. ఎందుకంటే సముద్రంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, నిలకడగా ఉంటుంది, అలాగే ఒక్కోసారి కల్లోలంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రేమ కథలో కూడా సముద్రం లా ఆటుపోట్లు, సంఘర్షణలు ఉంటాయి. అందుకనే రెండిటికి ముడిపెట్టాడు. ఈ సినిమా కథని పేపర్ మీద రాయమంటే ఏమీ ఉండదు చెప్పడానికి, కానీ దర్శకుడు ఈ ప్రేమ కథను ఒక అందమైన కవిత్వం చెపుతున్నట్టుగా తెర మీద చూపించాడు. ప్రేమ కథలో వుండే భావోద్వేగాలు, తగాదాలు అన్నీ చాలా సహజంగా చూపించాడు దర్శకుడు. (Saptha Sagaralu Dhaati - Side A film review)
ఇద్దరి మధ్య వచ్చే ఆ కెమిస్ట్రీ బాగుంది, అలాగే వాళ్ళిద్దరి మధ్య ఒక సంఘటన జరిగి విడిపోయినప్పుడు కూడా ఆ భావోద్వేగాలను బాగా చూపించగలిగాడు దర్శకుడు. కోర్టులు, జైలు, జైలులో పరిస్థితులు బాగా సహజంగా ఉండేట్టు చూపించాడు. అయితే దర్శకుడు ఈ సినిమాకి రెండో భాగం కూడా ఉందని చెప్పాడు, అది కూడా వచ్చే నెలలో విడుదల అవుతుందని చెప్పాడు. అందుకనే ఈ సినిమాలో చాలా సన్నివేశాలు సాగదీతలా, కథ కూడా నింపాదిగా మెల్లగా సాగుతూ ఉంటుంది. అంటే రెండో భాగంలో ఈ కథలో ఇంకా చాలా మార్పులు వున్నాయన్న సంగతి తెలుస్తోంది. అయితే ఇలాంటి సినిమాలు చూడటానికి కొంచెం సహనం అవసరం, ఎందుకంటే ఆసక్తికరంగా వుండే ప్రేమ కథ, కానీ చాలా మెల్లగా నడుస్తూ ఉంటుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే ఇందులో నటించిన జంట రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ ఇద్దరూ ఈ సినిమాకి ఆయువుపట్టు. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, వారిద్దరి కెమిస్ట్రీ, చిలిపి సంఘటనలు అవన్నీ చాలా సహజంగా వుంది, సినిమాకి కూడా చాలా సహజత్వాన్ని తీసుకొచ్చింది. ఇక ఇద్దరూ పోటీ పడి బాగా నటించారు. రక్షిత్ శెట్టి ఇంతకు ముందు చాలా సినిమాలు చేసి మంచి నటుడు అనిపించుకున్నాడు, ఇందులో కూడా మంచి భావోద్వేగాలను పలికించాడు. అలాగే రుక్మిణి వసంత్ చాలా బాగుంది, తన భావాలను ఎక్కువగా కళ్ళతో పలికించింది. మంచి నటన కనపరచింది. 'గాడిద' అని అతన్ని అంటూ ఉంటుంది, అది బాగుంది. పవిత్ర లోకేష్, రుక్మిణి తల్లిగా బాగా చేసింది. అలాగే మిగతా పాత్రల్లో అచ్యుత్, అవినాష్, శరత్, రమేష్ అందరూ ఆ పాత్రలో ఒదిగిపోయారు. అద్వైత మూర్తి ఛాయాగ్రహణం చక్కగా వుంది, ప్రతి సన్నివేశాన్ని కళాత్మకంగా చూపించాడు. ఇక చరణ్ రాజ్ సంగీతం ఈ సినిమాకి ఇంకో బలం, ప్రతి సన్నివేశాన్ని తన సంగీతంతో ఇంకా బాగా ఫీల్ అయ్యేట్టు చేసాడు. అన్ని అంశాలు సరిగ్గా కుదిరాయి ఈ సినిమాకి.
చివరగా, దర్శకుడు హేమంత్ నిజాయితీతో కూడిన ఒక ప్రేమ కథను తెర మీద ఆవిష్కరించాడు అని చెప్పొచ్చు. కథ కొంచెం సాగదీసేలా వున్నా, మొదటి నుండి చివరి వరకు సహజంగా వుంది, ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు, అలాగే రెండో భాగం ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తూ వుంటారు కూడా.