Bedurulanka 2012 film review: యుగాంతం ఆధారంగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే...
ABN , First Publish Date - 2023-08-25T16:28:26+05:30 IST
కార్తికేయ గుమ్మకొండ 'ఆర్ఎక్స్ 100' అనే సినిమాతో విజయం సాధించి వరసగా సినిమాలు చేస్తూ వచ్చినా అంత పెద్ద విజయం మళ్ళీ సాధించలేదు. ఇప్పుడు 'బెదురూలంక 012' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు, క్లాక్స్ దీనికి దర్శకుడు, నేహా శెట్టి కథానాయిక. ఈ సినిమా ఎలా వుందో చదవండి.
నటీనటులు: కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి (NehaShetty), ఎల్బీ శ్రీరామ్, అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, గోపరాజు రమణ, రాజ్ కుమార్ కసిరెడ్డి, సత్య, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు
ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి
సంగీతం: మణిశర్మ
రచన, దర్శకత్వం: క్లాక్స్
నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పనేని (బెన్నీ)
-- సురేష్ కవిరాయని
నటుడు కార్తికేయ (KartikeyaGummakonda) 'ఆర్ఎక్స్ 100' #RX100 అనే సినిమాతో అప్పుడెప్పుడో మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఆ తరువాత అతని వరసగా సినిమాలు చేసాడు కానీ ఏదీ కూడా సరైన హిట్ ఇవ్వలేదు. ఇప్పుడు 'బెదురులంక 2012' #Bedurulanka2012Review అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి క్లాక్స్ (Clax) అనే అతను దర్శకుడు, అతనే రచయిత కూడాను. కార్తికేయ ముందు సినిమా 'ఆర్ఎక్స్ 100' సినిమాలో వున్నట్టే, ఇందులో కూడా గోదావరి నేపధ్యం, అలాగే అందులో అతని పాత్ర పేరు శివ అయితే ఇందులో కూడా శివ. ఇలా ఆ సినిమాకి ఈ సినిమాకి కొంచెం సెంటిమెంట్ కుదిరింది అని కథానాయకుడు కార్తికేయ భావించాడు. మరి అతను అనుకున్నట్టుగా ఈ సినిమా అతనికి విజయాన్ని ఇచ్చిందా, సినిమా ఎలా వుందో చూద్దాం. జాతీయ అవార్డు #NationalAward సాధించిన 'కలర్ ఫోటో' #ColourPhoto సినిమాని నిర్మించిన రవీంద్ర బెనర్జీ ముప్పనేని (బెన్నీ) (Benny) ఈ 'బెదురూలంక2012' సినిమాకి నిర్మాత.
Bedurulanka 2012 story కథ:
ఈ కథ గోదావరి జిల్లాలోని బెదురులంక అనే ఊరులో 2012 లో జరిగిన కథ. ఆ సంవత్సరంలో యుగాంతం వస్తుంది అని ప్రజలు భయపడుతూ వుంటారు, టీవిలో వార్తలు కూడా అలాంటివే వస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తూ ఉంటాయి. అదే సమయంలో ఆ ఊళ్ళో వున్న భూషణం (అజయ్ ఘోష్), బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగార్), డానియల్ (ఆటో రాంప్రసాద్) ఆ ఊరి ప్రజల భయాన్ని చూసి కొన్ని మూఢనమ్మకాలని జాతపెట్టి వూర్లో ప్రజల డబ్బుని దోచెయ్యాలని ఒక పథకం వేస్తారు. దానికి ఆ వూరి ప్రెసిడెంట్ (గోపరాజు రమణ) అమాయకత్వాన్ని కూడా వాడుకుంటారు. #Bedurulanka2012Review హైదరాబాద్ లో గ్రాఫిక్ డిజైనర్ గా వుద్యోగం చేసుకుంటున్న శివ (కార్తికేయ) తన పై అధికారితో మాట వచ్చి వుద్యోగం మానేసి తన సొంతవూరు అయిన బెదురులంక వచ్చేస్తాడు. ఇక్కడ అతను ప్రేమించిన ప్రెసిడెంట్ గారి కుమార్తె చిత్ర (నేహా శెట్టి) ని పెళ్ళిచేసుకోవాలని అనుకుంటాడు. ఆ ఊరి ప్రజలందరూ మూఢనమ్మకాలతో ఆ ముగ్గురూ ఏమి చెయ్యమంటే అది చెయ్యడానికి సిద్ధపడతారు, కానీ శివ ఆ మూఢనమ్మకాలని నమ్మడు, వాళ్ళకి ఎదురుతిరుగునాడు. ఆలా చేసిన శివకి ఊరి ప్రజలు ఏమి చేశారు? ఇంతకీ యుగాంతం వచ్చి ఆ బెదురులంక అనే వూరు కొట్టుకుపోయిందా? శివ, చిత్రలు పెళ్లి చేసుకుంటారా లేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే 'బెదురులంక2012' లో ఏమయిందో వెండితెర మీద చూడాల్సిందే!
విశ్లేషణ:
యుగాంతం నేపథ్యంలో అప్పట్లో సినిమాలు చాలానే వచ్చాయి. అయితే ఈ 'బెదురులంక 2012' సినిమాలో దర్శకుడు క్లాక్స్ ఇంకో కోణాన్ని ఆవిష్కరించాడు. ఊరి ప్రజల భయాన్ని, మూఢ నమ్మకాలతో జతచేసి కొందరు ఎలా ప్రజలని మోసం చెయ్యాలని అనుకుంటున్నారు అన్నది దర్శకుడు కొంచెం సరదాగా చెప్పిన కథ ఈ సినిమా. గ్రామంలో వున్న పూజారి, డానియల్, భూషణం అనే వ్యక్తితో ప్రజలని మూఢనమ్మకాలతో ఎలా తప్పుదోవ పట్టించారు అనే విషయాలు కొంచెం సరదాగా, హాస్య సన్నివేశాలతో తీసుకుపోయాడు దర్శకుడు. #Bedurulanka2012Review అక్కడ వరకు బాగానే వుంది, కానీ క్లాక్స్ కొంతవరకే సఫలీకృతుడు అయ్యాడు అని చెప్పాలి, ఎందుకంటే రెండో సగంలో మాత్రం కథ కొంచెం గాడి తప్పింది. ఆ మూఢనమ్మకాలు నమ్మొద్దు అవన్నీ అబద్ధాలు అని చెప్పడానికి వెన్నెల కిశోర్, సత్య పాత్రలతో చూపించడం అంత సహజంగా లేదు. అదీ కాకుండా ఆ ఊరి గ్రామస్థులు అందరూ కలిపి గెంతుతూ పాట పాడటం కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమాలో అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు నవ్వులు తెప్పిస్తూ ఉంటాయి, కొన్ని జోక్స్ మాస్ కి నచ్చే విధంగా కూడా వున్నాయి. రెండో సగంలో దర్శకుడు కథ, రచన మీద కొంచెం దృష్టి పెట్టి ఉంటే ఈ సినిమా ఇంకా బాగుండేది. మణిశర్మ సంగీతం పరవాలేదు, ఛాయాగ్రహణం బాగుంది, గోదావరి పచ్చదనం, గ్రామం, నది బాగా చూపించారు. మాటలు కూడా పరవాలేదు.
ఇక నటీనటుల విషయానికి వస్తే కార్తికేయ తన పాత్రని బాగానే చేసాడు. చాలా సన్నివేశాల్లో తన బాడీని చూపించడానికి అన్నట్టు వున్నాయి. నేహా శెట్టి పాత్ర ఏమీ అంత పెద్దగా లేదు. ఆమె మొదట్లో పాటలకు కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితం అయింది. సినిమాలో మాత్రం ప్రధాన హైలైట్ శ్రీకాంత్ అయ్యంగార్ (SrikanthAyyangar), అజయ్ ఘోష్ (AjayGhosh), ఆటో రాంప్రసాద్ ల మీదే ఉంటుంది. వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువయింది. అలాగే వాళ్ళు ముగ్గురూ కూడా బాగా చేశారు. గోపరాజు రమణ (GoparajuRamana) అమాయక ప్రెసిడెంట్ పాత్రలో నటించాడు. రాజకుమార్ కసిరెడ్డి కి కూడా మంచి పాత్రే దక్కింది, చివర్లో నవ్విస్తాడు. వెన్నెల కిశోర్ (VennelaKishore), గెట్ అప్ శీను, సత్య (ComedianSatya) వాళ్ళ పాత్రలు అప్పుడప్పుడూ నవ్విస్తారు.ఎల్బీ శ్రీరామ్ (LBSriram) ఒక ప్రత్యేక పాత్రలో కనపడతారు.
చివరగా, 'బెదురులంక 2012' అనే సినిమా మూఢనమ్మకాల నేపథ్యంలో ప్రజలు ఎలా మోసపోతున్నారు అని సరదాగా చెప్పిన సినిమా. దర్శకుడు కథ మీద, రచన మీద ఇంకొంచెం దృష్టి పెట్టి ఉంటే ఈ సినిమా ఇంకా బాగా వచ్చేది. అక్కడక్కడా నవ్వించే సన్నివేశాలున్నాయి.