Dhootha web series review: నాగచైతన్య మొదటి వెబ్ సిరీస్ అదరహో!
ABN , First Publish Date - 2023-12-03T16:03:07+05:30 IST
నాగ చైతన్య మొదటిసారిగా ఒక వెబ్ సిరీస్ 'ధూత' చేసి ఓటిటి లోకి అడుగుపెట్టాడు. దీనికి ప్రముఖ దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించగా, శరత్ మారారు నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఎలా వుందో చదవండి
వెబ్ సిరీస్: ధూత
నటీనటులు: అక్కినేని నాగ చైతన్య, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, పార్వతి తిరువొతు, రవీంద్ర విజయ్, జయప్రకాశ్, తనికెళ్ళ భరణి, రాజా గౌతమ్, రఘు కుంచె తదితరులు
ఛాయాగ్రహణం: మికొలాజ్ సైగుల
సంగీతం: ఇషాన్ చబ్రా
మాటలు: వెంకటేష్ దొండపాటి
నిర్మాత: శరత్ మరార్
రచన, దర్శకత్వం: విక్రమ్ కె కుమార్
విడుదల: డిసెంబర్ 1, 2023
ఓటిటి: అమెజాన్ ప్రైమ్ వీడియో
రేటింగ్: 3.5
-- సురేష్ కవిరాయని
హిందీ అగ్ర నటులు అటు సినిమాలే కాకుండా ఇటు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ ఓటిటిల్లో తమ సత్తా చాటుతున్నారు. తెలుగులో ఇప్పుడు ఆ ట్రెండ్ అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) మొదలెట్టాడు, 'ధూత' అనే వెబ్ సిరీస్ తో ఓటిటిలో అడుగుపెట్టాడు. సెన్సిబుల్ చిత్ర దర్శకుడు విక్రమ్ కె కుమార్ (Vikram K Kumar) దీనికి దర్శకుడు, శరత్ మరార్ (Sharath Marar) నిర్మాత. ఇది మిగతా భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి, తెలుగు, తమిళ నటులను సమానంగా తీసుకున్నారు. ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar), పార్వతి తిరువొతు, పశుపతి, తనికెళ్ళ భరణి (Thanikella Bharani), తరుణ్ భాస్కర్ (Tharun Bhascker), రవీంద్ర విజయ్ లాంటివాళ్లు నటించారు. ఇది ఒక అతీంద్రీయ శక్తుల (Supernatural) నేపథ్యంలో తీసిన కథ. ఈ వెబ్ సిరీస్ ఎలా వుందో చూద్దాం. (Naga Chaitanya debut web series Dhootha review)
Dhootha story కథ:
సాగర్ వర్మ (నాగ చైతన్య అక్కినేని) బాగా పేరున్న జర్నలిస్ట్, కొత్తగా ప్రారంభించబోయే ఒక దిన పత్రికకి చీఫ్ ఎడిటర్ గా ఉంటాడు. అతని భార్య ప్రియ (ప్రియా భవానీ శంకర్) కూడా జర్నలిస్ట్. ఒకరోజు భార్య, పాపతో కలిసి కారులో వెళుతూ ఉండగా, ఒక దాబా దగ్గర కారు ఆగిపోతుంది. అప్పుడు సాగర్ ఏదైనా తినడానికి తెచ్చుకుందామని కారు దిగి ఆ దాబాలోకి వెళతాడు, అక్కడ ఒక పాత పేపర్ కటింగ్ సాగర్ కి కనపడుతుంది. అందులో కారుకి ప్రమాదం జరగబోతుందని, కారులో వున్న సాగర్ కుక్క చనిపోతుంది రాసి ఉంటుంది. అతను చూస్తుండగానే ఆగివున్న కారుని ఒక లారీ వచ్చి గుద్దుకోవటం, కారు నుజ్జు అవటం, అందులో వున్న కుక్క మరణించటం జరుగుతుంది. పాప మాత్రం ఏమీ కాకుండానే బయటపడుతుంది. లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని అతన్ని ప్రశ్నిస్తాడు ఎస్ఐ అజయ్ ఘోష్ (రవీంద్ర విజయ్). తరువాత అలాంటి పేపర్ కటింగ్స్ దొరుకుతూ ఉంటాయి సాగర్ కి, అందులో రాసినట్టుగానే జరుగుతూ ఉంటాయి కూడా. ఈలోగా ఒక ప్రముఖ జర్నలిస్ట్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ కేసుని దర్యాప్తు చేస్తున్న ఎస్పీ క్రాంతి షినోయ్ (పార్వతి తిరువొతు) కి కొన్ని షాకింగ్ సంఘటనలు తెలుస్తూ ఉంటాయి. ఇలా జరగబోయే ప్రమాదాలు గురించి పేపర్ లో ప్రింట్ చేస్తూ సాగర్ కి కనపడేట్టు చేస్తున్నది ఎవరు? ఎస్పీ క్రాంతి దర్యాప్తులో ఎలాంటి షాకింగ్ నిజాలు తెలిసాయి? ఎస్సై అజయ్ ఘోష్ పాత్ర ఏంటి? పాతతరం పేపరు 'దూత' పత్రిక నిర్వాహకుడు సత్యమూర్తి (పశుపతి), అలాగే పాత తరం రిపోర్టర్ భూపతి వర్మ (తరుణ్ భాస్కర్), రాజకీయ నాయకుడు చక్రపాణి (రాజా గౌతమ్), రాఘవయ్య (తనికెళ్ళ భరణి)లకి ఈ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా? జర్నలిస్ట్ సాగర్ కి వీళ్ళకి ఏమైనా కనెక్షన్ ఉందా? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే 'ధూత' వెబ్ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ:
విక్రమ్ కె కుమార్ దర్శకుడిగా ఒక వైవిధ్యమైన దర్శకుడిగా ముద్ర వేసుకున్నారు. అతని సినిమాలు '13బి' హర్రర్, 'ఇష్క్' రొమాంటిక్ డ్రామా, '24' ఒక శాస్త్రీయ నేపధ్యం వున్న యాక్షన్ డ్రామా , 'మనం' మూడుతరాల నేపథ్యంలో సాగే ఒక ఫాంటసీ డ్రామా, ఇలా ఒక్కోదానికి ఒకటి సంబంధం లేకుండా చేసిన సినిమాలు. ఇవి కాకుండా 'హలో', 'థేంక్ యూ', 'గ్యాంగ్ లీడర్' సినిమాలు కూడా వున్నాయి. ఇప్పుడు ఈ 'ధూత' వెబ్ సిరీస్ తో ఓటిటి లోకి అడుగు పెట్టాడు విక్రమ్. అయితే సినిమాలో చెప్పినట్టు రెండున్నర గంటల్లో కాకుండా సుమారు ఐదు గంటలకి పైగా కథ చెప్పాలి, ప్రతి ఎపిసోడ్ లో ఒక చిన్న సస్పెన్స్ పెట్టి రెండో ఎపిసోడ్ వెంటనే చూసేటట్టు చెయ్యాలి. దర్శకుడు విక్రమ్ మొదటి వెబ్ సిరీస్ 'ధూత'లో ఈ అంశాలు అన్నీ దృష్టిలో పెట్టుకొని చక్కగా కథ రాసుకొని, ఒక్కో ఎపిసోడ్ చూస్తూ రెండో దానికి వెళ్లేట్టు ప్రేక్షకుడికి ఆసక్తి పెరిగేటట్టు చేసాడు. దానికి తోడు అతను మంచి నటీనటులను ఎంపిక చేసుకున్నాడు.
నాగ చైతన్య లాంటి నటుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక కొత్త శకానికి నాంది పలికాడు అనే చెప్పాలి. ఎందుకంటే ఓటిటి లో చేస్తున్నాడు అంటే అతనికి సినిమాలు లేక ఇలా ఓటిటి ఒప్పుకున్నాడు అని అంటారు, ముఖ్యంగా తెలుగు పరిశ్రమలో ఇలాంటి వార్తలు వింటూ ఉంటాం, అలాంటి వార్తలకి ఒక బ్రేక్ ఇస్తూ నాగ చైతన్య ఈ కథ ఒప్పుకోవటం, చెయ్యడం అతని ధైర్యానికి, నమ్మకానికి ఒక మంచి శుభపరిణామం. ఇక దీనితో మిగతా నటులు, దర్శకులు కూడా కొన్ని కథలు వెండితెర మీద చెప్పలేనివి ఇలా ఓటిటి లో చెప్పొచ్చు అని ధైర్యం చేస్తారు.
ఇక ఈ 'దూత' విషయానికి వస్తే, దర్శకుడు విక్రమ్ మొదటి ఎపిసోడ్ నుంచే ఆసక్తికరంగా ఉండేట్టు కథని మలిచాడు. ఈ ఎపిసోడ్ చివర్లో సస్పెన్స్ పెట్టి రెండో ఎపిసోడ్ కి ఆగకుండా వెళ్లేట్టు చేయగలిగాడు. అలాగే మూడు నాలుగు ఎపిసోడ్స్ అవగానే చూస్తున్న ప్రేక్షకుడికి అసలు కథ ఎటు మలుపు తిరుగుతోంది, ఎలా వుండబోతోంది అనే ఆలోచన కూడా ఇవ్వకుండా చాలా ఆసక్తికర సన్నివేశాలు పెట్టి, మంచి కథనంతో ఈ వెబ్ సిరీస్ అంతా బాగా నడిపించాడు. అయితే ఇక్కడ కథ అంతా చెప్పేస్తే మీరు ఆ సస్పెన్స్ తెలిసిపోతుంది కాబట్టి, చెప్పడం కన్నా మీరు వెబ్ సిరీస్ నేరుగా చూసి ఫీల్ అయితే బాగుంటుంది. మీడియాలో అవినీతి, అలాగే మీడియాకి, రాజకీయ నాయకులకి మధ్య సంబంధాలు, మీడియాను రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటున్నారు అనేది చూపించాడు. మీడియాని, రాజకీయాలని, పోలీస్ వ్యవస్థ తీరు తెన్నులను తనదైన శైలిలో వివరించాడు విక్రమ్ ఇందులో.
మహేష్ బాబు, కృష్ణ వంశీ సినిమా 'మురారి' లో ఒక సంఘటన కొన్ని తరాల వరకు ఎలా వెంటాడుతూ ఉంటుందో అలాగే ఈ వెబ్ సిరీస్ లో కూడా అలాంటి చిన్న పాయింట్ ఒకటి తీసుకున్నాడు విక్రమ్. అలాగే ఇందులో కొంచెం 'మనం', '24' సినిమాల షేడ్స్ కూడా ఉంటాయి. చివర్లో ఒక్కో పాత్రని కలుపుతూ వెళుతూ ఉంటాడు విక్రమ్, అది కొంచెం సినిమాటిక్ గా అనిపించినా చూసే ప్రేక్షకుడికి కొత్తగా వుండి, ఆస్వాదిస్తారు. అలాగే ఈ వెబ్ సిరీస్ సాంకేంతికంగా చూస్తే సినిమాకి ఏ విధంగా ఖర్చు పెట్టి తీస్తారో అంతలా ఈ వెబ్ సిరీస్ కి కూడా ఖర్చు పెట్టి మంచి క్వాలిటీ తో తీశారు. దానికి నిర్మాత శరత్ మరార్ కి అభినందనలు చెప్పాలి, ఎందుకంటే ఈమధ్య చాలా తెలుగు వెబ్ సిరీస్ లు చుట్టేస్తున్నారు, టీవీ సీరియల్ లా తీస్తున్నారు. ఈ 'ధూత' అలా కాకుండా క్వాలిటీతో, బాగా తీశారు.
ఇక నటీనటుల విషయానికి వస్తే నాగ చైతన్య ఈ వెబ్ సిరీస్ ఒప్పుకోవటం నిజంగా అతన్ని అభినందించాలి. ఎందుకంటే ఇందులో పాత్ర సినిమాల్లో చేసినట్టుగా కథానాయకుడు విలన్స్ ని కొట్టడం, పాటలు పాడటం, లేదా రివెంజ్ తీర్చుకోవటం లాంటిది కాదు. ఇందులో నాగచైతన్య పాత్రలో అన్ని వైవిధ్యాలు ఉంటాయి. తండ్రిగా, భర్తగా అలాగే వృత్తిలో ఎలా ఉంటాడు, ఇలా చూస్తే, అతను నెగటివ్ రోల్ చేస్తున్నాడా, లేదా పాజిటివ్ రోల్ చేస్తున్నాడా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఆసక్తికరం ఏంటంటే చైతన్య తన పాత్రని మొదటి ఎపిసోడ్ నుండి చివరి ఎపిసోడ్ వరకు తీసుకెళ్లే తీరు చాలా బాగుంటుంది. మంచి నటన, హావభావాలతో బాగా ఆకట్టుకుంటాడు, అలాగే చాలామంది అగ్ర నటులకి వెబ్ సిరీస్ అంటే చులకన భావం వుంది అనిపిస్తుంది, కానీ ఇది చూసాక అది పోయి, అందరూ చేస్తే బాగుంటుంది అని నాగ చైతన్య లీడ్ ఇచ్చాడు దీనితో. తరువాత అటు ప్రేక్షకులకి బాగా నచ్చిన పాత్ర పార్వతి తిరువొతు. ఎస్పీ క్రాంతిగా పార్వతి మంచి ప్రతిభ కనపరిచింది, అలాగే తెలుగు మాటలు కూడా తనే చెప్పినట్టుగా కనిపిస్తోంది, చాలా బాగా చేసింది, సహజంగా నటించి చూపించింది. ప్రాచీ దేశాయ్, ప్రియా భవానీ శంకర్ పాత్రలు పరిమితమే. కానీ, ఉన్నంతలో బాగా చేశారు. రవీంద్ర విజయ్ కి కూడా మంచి పాత్ర లభించింది. జయప్రకాశ్, తనికెళ్ళ భరణి, పశుపతి, రాజా గౌతమ్, తరుణ్ భాస్కర్ లు 1960లో వున్న సన్నివేశాల్లో కనపడి తళుక్కున మెరుస్తారు. రోహిణి, ఈశ్వరీ రావు, జీవన్ కుమార్, కామాక్షీ భాస్కర్ల కూడా తమ పాత్రల పరిధి మేరకి చేశారు.
చివరగా, 'ధూత' ఈమధ్య కాలంలో మంచి క్వాలిటీ తో వచ్చిన తెలుగు వెబ్ సిరీస్ అని చెప్పాలి. విక్రమ్ కె కుమార్ దర్శకత్వ ప్రతిభకి, నాగచైతన్య లాంటి నటుడు తోడు అవటంతో ఈ వెబ్ సిరీస్ ఆద్యంతం ఆసక్తికరంగా వచ్చింది. అక్కడక్కడా కొన్ని సాగదీతలు వున్నా, సినిమాటిక్ స్వతంత్రం తీసుకున్నా 'ధూత' చూడాల్సిన వెబ్ సిరీస్. అందరినీ ఆకట్టుకుంటుంది అనటంలో సందేహం లేదు.