Jawan film review: షారుఖ్ ఖాన్ షో ఇది, పైసా వసూల్ సినిమా

ABN , First Publish Date - 2023-09-07T13:26:33+05:30 IST

తమిళ దర్శకుడు మొదటిసారిగా ఒక హిందీ సినిమాకి అదీ అగ్ర నటుడు అయిన షారుఖ్ ఖాన్ తో 'జవాన్' సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈరోజు. నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి, దీపికా పడుకోన్ ముఖ్యపాత్రలు ధరించిన ఈ సినిమా ఎలా వుందో చదవండి.

Jawan film review: షారుఖ్ ఖాన్ షో ఇది, పైసా వసూల్ సినిమా
Jawan Film Review

సినిమా: జవాన్

నటీనటులు: షారుఖ్ ఖాన్, నయనతార, దీపికా పడుకోన్, విజయ్ సేతుపతి, ప్రియమణి, సునీల్ గ్రోవర్, సాన్య మల్హోత్రా, సంజయ్ దత్ తదితరులు

సంగీతం: అనిరుద్ రవిచందర్

ఛాయాగ్రహణం: జికె విష్ణు

నిర్మాతలు: గౌరి ఖాన్, గౌరవ్ వర్మ

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అట్లీ

-- సురేష్ కవిరాయని

షారుఖ్ ఖాన్ (ShahRukhKhan) తన 'పఠాన్' #Pathaan సినిమాతో బాలీవుడ్ పరిశ్రమకి కొత్త ఊపిరి ఇచ్చాడు. అప్పటివరకు స్తబ్దుగా వున్న హిందీ చిత్ర పరిశ్రమ ఆ సినిమా హిట్ తో మళ్ళీ పుంజుకుందనే చెప్పాలి. ఆ వరుసలోనే వచ్చిన కొన్ని హిందీ సినిమాలు కూడా హిట్ అయ్యాయి. అన్నీ ఈ సంవత్సరమే విడుదలయ్యాయి. ఇప్పుడు షారుఖ్ ఖాన్ మళ్ళీ 'జవాన్' #JawanReview సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కోసం అతని అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళ దర్శకుడు అట్లీ (Atlee) ఈ సినిమాతో షారుఖ్ ఖాన్ లాంటి పెద్ద నటుడిని దర్శకత్వం చేస్తూ హిందీలో ఆరంగేట్రం చేసాడు. ఈ సినిమాలో నయనతార (Nayanthara), విజయ్ సేతుపతి (VijaySethupathi), దీపికా పడుకోన్ (DeepikaPadukone), ప్రియమణి (Priyamani) వున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ (AnirudhRavichander) ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా ఒక్క హిందీలోనే కాకుండా దక్షిణాది భాషలు అన్నిటిలో విడుదల అవుతోంది, అలాగే ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ సినిమా మీద అంచనాలు కూడా పెరిగాయి. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

Jawan.jpg

Jawan story కథ:

సినిమా కథ మొదలవ్వటం 1986లో అవుతుంది. బోర్డర్ దగ్గరున్న గ్రామ ప్రజలు నీటిలో కొట్టుకుపోతున్న ఒక మనిషిని చూసి, బయటకి లాగి అతనికి కట్లు కట్టి వైద్యం మొదలెడతారు. కొన్ని రోజుల తరువాత ఆ గ్రామంలోకి కొంతమంది దుండగులు వచ్చి వాళ్ళని చంపుతూ ఉంటే, ఈ కట్లతో వున్న వ్యక్తికీ ఒక్కసారిగా మెలకువ వచ్చి ఆ దుండగులని చంపేస్తాడు. అందరినీ అంతమొందించాక అతను (షారుఖ్ ఖాన్) నేనెవరిని అని అడుగుతాడు. ఇప్పుడు మళ్ళీ ఈరోజుకి వస్తే ఒక మెట్రో ట్రైన్ ని విక్రమ్ రాథోడ్ (షారుఖ్ ఖాన్) అనే అతను తన మహిళా టీముతో హైజాక్ చేస్తాడు, అతనితో టాప్ పోలీస్ ఆఫీసర్ నర్మద (నయనతార) బేరసారాలు ఆడుతుంది. అందులో భాగంగా హైజాక్ చేసిన అతను వ్యవసాయశాఖా మంత్రిని రమ్మంటాడు. అతను వచ్చాక ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో తెలుసా అని అడిగి, బ్యాంకులు పెద్ద పెద్ద వాళ్ళు లోన్ తీసుకుంటే వాళ్ళకి తక్కువ వడ్డీ వేసి ఇస్తారు, రైతులకి మాత్రం ఎక్కువ వడ్డీతో ఇస్తారు, అలాగే రైతులను డబ్బులు వసూలు చేసేంతవరకు ఇబ్బంది పెడతారు అంటూ రూ.40,000 కోట్లు డిమాండ్ చేస్తాడు. అంత డబ్బు లేదు అని మంత్రి చెపితే, ఒక వ్యాపారవేత్త కాళీ (విజయసేతుపతి) ఇస్తాడు అని చెప్తాడు. ఎందుకంటే అతని కూతురు కూడా అదే ట్రైనులో వుంది. ఆ వ్యాపారవేత్త వెంటనే డబ్బులు విక్రమ్ రాథోడ్ చెప్పిన అకౌంట్ కి బదలాయిస్తాడు. #JawanReview ఆ డబ్బులు రైతుల అకౌంట్స్ కి వెంటనే బదలాయించేస్తాడు విక్రమ్ రాథోడ్. ఆ ట్రైన్ హైజాక్ చేసిన విక్రమ్ రాథోడ్ ని పట్టుకోవటానికి నర్మద ప్రయత్నిస్తుంది, కానీ విఫలం అయిపోతుంది. ఇంతలో ఒక మహిళా జైలు అధికారిగా ఆజాద్ (షారుఖ్ ఖాన్) అతనికి సహాయం చేసిన మహిళా టీము అందులో ఖైదీలుగా వస్తారు. #JawanFilmReview వాళ్ళందరూ కలిపి ఇలా మారువేషాలతో ఆ ట్రైన్ హైజాక్ చేసి మళ్ళీ జైలుకి వచ్చేస్తారు. అలాగే ఇంకోసారి వైద్య ఆరోగ్య మంత్రి మీద దాడి చేసి ప్రభుత్వ ఆసుపత్రిలన్నిటికి సదుపాయాలు కల్పిస్తాడు ఆజాద్ అతని టీము. ఆజాద్ అనే అతను విక్రమ్ రాథోడ్ పేరు మీద ఇలా రాబిన్ హుడ్ తరహాలో ఎందుకు చేస్తున్నాడు? విక్రమ్ రాథోడ్ కి అతనికి వున్న సంబంధం ఏంటి? నర్మద, ఆజాద్ భార్య భర్తలు ఎలా అయ్యారు? కాళీకి విక్రమ్ రాథోడ్ కి, ఆజాద్ కి వున్న లింక్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే 'జవాన్' సినిమా చూడాల్సిందే.

jawan-trailer.jpg

విశ్లేషణ:

దర్శకుడు అట్లీ దేశభక్తి, రైతుల ఆత్మహత్యలు, ప్రభుత్వ ఆసుపత్రిలు, ఇలాంటి సున్నితమైన సమస్యలు తీసుకొని వాటికి కొన్ని వాణిజ్యపరమైన అంశాలు జతచేసి ఆసక్తికరంగా వున్న ఒక కథను అల్లాడు. అయితే ఇలాంటి కథలు ఇంతకు ముందు చాలా వచ్చాయి. దర్శకుడు శంకర్ తన 'భారతీయుడు', 'అపరిచితుడు' సినిమాలలో ప్రభుత్వంలోని కొన్ని అవినీతిపరమైన విభాగాల మీద తనదైన శైలిలో వాణిజ్య అంశాలు జోడించి తీసాడు. తెలుగులో కొరటాల శివ (KoratalaSiva) కూడా ఒక సామాజిక సమస్యని తీసుకొని, దానికి కొన్ని వాణిజ్య అంశాలు జతచేసి సినిమాలు తీస్తూ వచ్చాడు. ఇప్పుడు దర్శకుడు అట్లీ కూడా అదే పని చేసాడు. రైతుల ఆత్మహత్యలు అనేవి ఇప్పుడు దేశం అంతటా వినిపిస్తున్న సమస్య, ఆ సమస్యను తీసుకున్నాడు, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎటువంటి సదుపాయాలు లేక ప్రజలు ఎంతటి ఇబ్బందులు పడుతున్నారో కూడా చూపించాడు. దేశ భద్రత కోసం పనిచేస్తున్న జవాన్లకు ఎటువంటి నాసిరకం తుపాకులు అందచేస్తున్నారు, వాటివలన ఎంతమంది చనిపోతున్నారు, ఈ భాగస్వామ్యంలో ప్రైవేట్ వ్యక్తులు, మధ్యవర్తులు, అవినీతిపరులు ఎలా డబ్బులు చేసుకుంటున్నారు అనే విషయం చూపించాడు.

jawan-shahrukhkhan1.jpg

ఇలాంటి సమస్యలు చూపించినప్పుడు, ఒక అగ్ర నటుడు ఉంటే ఆ సినిమాకి మంచి హైప్ వస్తుంది, అందుకనే అట్లీ షారుఖ్ ఖాన్ ని ఎంచుకున్నాడు, ఆసక్తికరంగా చూపించాడు. ట్రైన్ హైజాక్ ఎపిసోడ్, తరువాత హాస్పిటల్ ఎపిసోడ్ అంతా ఆసక్తికరంగా సాగుతుంది. అలాగే నయనతార, షారుఖ్ ఖాన్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా బాగుంటాయి. అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. ఒక పక్కన ఇలాంటి సమస్యలు చూపిస్తూనే, ఇంకో పక్క అభిమానులకి కావలసిన అన్నీ మసాలాలు అంటే, పాటలు, పోరాట సన్నివేశాలు, షారుఖ్ ఖాన్ ని ఒక మాస్ అవతారంలో ఎలా చూపించాలో అలా చూపించాడు అట్లీ. ఇది ఒక ఫుల్ వ్యాపారాత్మక సినిమాగా రూపొందించాడు అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే దర్శకుడు అట్లీ ఒక అగ్ర నటుడు అయిన షారుఖ్ ఖాన్ తో పైసా వసూల్ సినిమా ఎలా చెయ్యాలో ఆలా చేసి చూపించాడు ఈ 'జవాన్' తో అని చెప్పొచ్చు. (Jawan FIlm Review)

ఇక ఈ సినిమా విజయంలో దీనికి సంగీతం అందించిన అనిరుద్ రవిచందర్ (AnirudhRavichander) కూడా ఒక భాగమే. పాటలు, నేపధ్య సంగీతం అన్నీ కరెక్టుగా సమకూరాయి. చాలా సన్నివేశాలు సినిమాటిక్ గా వున్నా, ఆసక్తికరంగా తీసాడు. షారుఖ్ అభిమానులకైతే ఈ సినిమా నచ్చి తీరాలి, ఎందుకంటే వాళ్ళు షారుఖ్ ని ఎలా చూడాలని అనుకుంటారో అన్ని మసాలాలు ఇందులో వున్నాయి.

Jawan.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే, షారుఖ్ ఖాన్ సినిమా అంత ఉంటాడు. ఒక రకంగా అతనే ఈ సినిమాని తన బుజాల మీదకి ఎత్తుకున్నాడు. రెండు విభిన్న పాత్రల్లో ఆజాద్, విక్రమ్ రాథోడ్ గా డ్యూయల్ రోల్ బాగా చేసాడు. రెండు పాత్రలు హైపర్ ఆక్టివ్ గానే ఉంటాయి. ఈ సినిమాలో ఒక కొత్తరకం షారుఖ్ ఖాన్ కనిపిస్తాడు అని చెప్పాలి. ఇక నయనతార మొదటి హిందీ సినిమా షారుఖ్ ఖాన్ పక్కన చేసింది. ఆమె పోలీస్ ఆఫీసర్ గా సరిగ్గా సరిపోయింది. మొదటి హిందీ సినిమా హిట్ తో మొదలెట్టిందనే చెప్పాలి. దీపికా పడుకోన్ (DeepikaPadukone) ఒక మెరుపులా కనిపించి వెళ్ళిపోతుంది. ఆమెది ఒక వీరోచితంగా పాత్ర. ఇక విజయ్ సేతుపతి విలన్ గా చెప్పనవసరం లేదు. అతను మంచి నటుడు, బాగా చేసాడు. ప్రియమణి, సాన్యా మల్హోత్రా, మిగతా అందరూ సపోర్ట్ చేశారు. చివరలో సంజయ్ దత్ (SanjayDutt)వచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

చివరగా, 'జవాన్' సినిమా సమాజంలో వున్న సున్నిత సమస్యలని లేవనెత్తుతూ దానికి వాణిజ్యపరమైన అంశాలు జోడించి తీసిన ఒక వ్యాపారాత్మకమైన సినిమా. షారుఖ్ ఖాన్ తన హావభావాలతో, అభినయంతో సినిమా అంతా తన భుజాల మీద వేసుకొని నడిపించాడు. దర్శకుడు 'అట్లీ' కి నూటికి నూరు మార్కులు వేయొచ్చు. ఇది ఒక టిపికల్ పైసా వసూల్ సినిమా, షారుఖ్ అభిమానులకే కాదు, అందరికీ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుంది ఈ సినిమా.

Updated Date - 2023-09-07T19:38:39+05:30 IST