Sembi film review: హాలీవుడ్ మూవీ నుంచి స్ఫూర్తి పొంది తీసిన సినిమాలా వుంది
ABN , First Publish Date - 2023-02-13T17:13:02+05:30 IST
ఆలా విడుదల అయిన తమిళ సినిమా 'సెంబి' (Sembi review). ప్రభు సోలొమన్ (Prabhu Solomon) దీనికి దర్శకుడు కాగా, హాస్య పాత్రల్లో ఎక్కువగా కనపడే కోవై సరళ (Kovai Sarala) ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. సెంబి గా నీల అనే అమ్మాయి చేసింది. (Sembi review) ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
సినిమా: సెంబి
నటీనటులు: కోవై సరళ, తంబీ రామయ్య, అశ్విన్ కుమార్, నంజిల్ సంపత్ తదితరులు
ఛాయాగ్రహణం: ఎం. జీవన్
సంగీతం: నివాస్ కె. ప్రసన్న
రచన, దర్శకత్వం: ప్రభు సోలొమన్ (Prabhu Solomon)
నిర్మాతలు: ఆర్. రవీంద్రన్, అజ్మల్ ఖాన్, రియా
విడుదల: డిస్నీ+హాట్ స్టార్ లో
-- సురేష్ కవిరాయని
ఈమధ్య చాలా సినిమాలు డైరెక్టుగా ఓ.టి.టి. లోనే విడుదల అవుతున్నాయి. అయితే అవి థియేటర్ లో విడుదల చేసినప్పుడు అంతగా రెవిన్యూ రాదని అనుకుంటున్నారో, లేక ఓ.టి.టి. కోసమే తీస్తున్నారో, ఏమైనా ఇలా ఒక భాషలో విడుదల అయిన సినిమాలు అన్ని భాషల్లోకి తర్జుమా చేసి చూపిస్తున్నారు. ఆలా విడుదల అయిన తమిళ సినిమా 'సెంబి' (Sembi review). ప్రభు సోలొమన్ (Prabhu Solomon) దీనికి దర్శకుడు కాగా, హాస్య పాత్రల్లో ఎక్కువగా కనపడే కోవై సరళ (Kovai Sarala) ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. సెంబి గా నీల అనే అమ్మాయి చేసింది. (Sembi review) ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
Sembi story కథ:
అడవి నమ్ముకొని జీవనం సాగిస్తున్న వీరతాయి (కోవై సరళ), ఆమె కుమారుడు, కోడలు అగ్ని ప్రమాదంలో చనిపోతే మనవరాలు సెంబి (నీల) ని పెంచుకుంటూ ఉంటోంది. సెంబి కి సుమారు 10 ఏళ్ళు ఉంటాయి, అడవిలో తేనె అమ్ముకుంటూ వీరు జీవనం సాగిస్తూ వుంటారు. ఒకరోజు అడవిలో తేనెని తీసి దగ్గరలో వున్న గ్రామానికి పోయి అమ్ముకు రావటానికి వెళుతున్న సెంబి ని ఒక ముగ్గురు యువకులు దారుణంగా చెరిచేస్తారు. అందులో ఒకడు ప్రతిపక్ష నాయకుడి కొడుకు. అది ఎన్నికల సమయం కావటం తో అధికార, ప్రతిపక్ష నాయకులు ఈ సెంబి వార్తని తమ పార్టీలకి అనుకూలంగా మార్చుకొని ఆ పసిపాపని చెరిచిన వారికి శిక్ష పడాలని పబ్లిక్ సభల్లో మాట్లాడుతూ వుంటారు. వీరతాయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యగా, దర్యాప్తు చేస్తున్న పోలీస్ ఆఫీసర్ లంచం తీసుకొని, కేసు ఫైల్ చెయ్యకుండా, వీరతాయి ని రాజీ కుదుర్చుకో అని చెప్తాడు. అవతలి వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు అని, వాళ్ళని ఎదిరించటం కష్టం అని చెప్తాడు. కానీ వీరతాయి వినకుండా పోరాటం సాగిస్తా అని చెపుతుంది. కోపగించిన పోలీస్ ఆఫీసర్ సెంబి ని చంపబోతే, వీరతాయి ఆ ఆఫీసర్ని చితక్కొడుతుంది. దానితో ఆఫీసర్ చావుబతుకుల్లో ఉంటాడు, వీరతాయి, మనవరాలు సెంబి ని తీసుకొని పారిపోతుంది. కేసు తారుమారయి పోలీసులు వీరతాయి, మనవరాలి కోసం వెతుకులాట ప్రారంభిస్తారు. బస్సు లో ఒక లాయర్ వీళ్ళని ఆదుకొని ఏమి చెయ్యాలో చెపుతాడు. ఇంతకీ ఆ ముగ్గురు యువకులు నేరం ఒప్పుకుంటారా, వీరతాయి పోరాటం నెగ్గుతుందా, ఎలా పోలిసుల వాలా లోంచి తప్పించుకొని న్యాయం కోసం పోరాటం ఈ విధంగా సాగించారు అన్నది మిగతా కథ.
విశ్లేషణ:
దర్శకుడు ప్రభు సోలొమన్ కి మంచి పేరుంది, చాలా తమిళ సినిమాలు తీసాడు. ఈ 'సెంబి' సినిమాకి రచన కూడా అతనే చేసాడు. మంచి కథని ఎంచుకున్నాడు, అలాగే ఇది ఒక ఆలోచన పరంగా (thought-provoking film) కూడా తీసాడు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే, ప్రభు సోలొమన్ హాలీవుడ్ సినిమా 'ఎ టైం టు కిల్' (A Time To Kill) అనే సినిమా నుండి స్ఫూర్తి పొందినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే ఆ కథ, ప్రభు సోలొమన్ 'సెంబి' కథ ఒక్కటేలా ఉండటం. ఆ ఇంగ్లీష్ సినిమా కూడా ప్రముఖ ఇంగ్లీష్ రచయిత, లాయర్, జాన్ గ్రిషం (John Grisham novel 'A Time To Kill') అదే పేరుతో రచించిన నవల. ఆ సినిమా 1996 లో విడుదల అయింది. ఆ సినిమా కూడా కోర్ట్ డ్రామానే. ఆ కథ కూడా, ఒక పదేళ్ల నల్ల బాలిక ఇంటికి సామాను తీసుకు వస్తుండగా, డబ్బున్న ఇద్దరు తెల్ల యువకులు ఆమెని కిడ్నాప్ చేసి దారుణంగా చెరిచేసి అక్కడ దగ్గరలో వున్న కాలువ దగ్గర పడేస్తారు.
తెల్ల యువకుల కోసం ఒక బాగా పేరున్న ఒక పెద్ద తెల్ల లాయరు వాదించటానికి పూనుకుంటాడు. ఇక ఆ యువకులు శిక్ష పడకుండా తప్పించుకుంటారని తెలిసి, ఆ బాలిక తండ్రి ఆ ఇద్దరి యువకుల్ని చంపేస్తాడు. తండ్రిని అరెస్టు చేసి వురి తీయాలని ఆ తెల్ల లాయరు వాదిస్తే, అతను చేసింది కరెక్ట్ అని ఆ బాలిక తండ్రి వేపు ఇంకో లాయరు వాదిస్తాడు. ఇది టూకీగా కథ. ఇది కోర్ట్ డ్రామా, ఆఫ్రికన్ నలుపు మనుషుల మీద తెలుపు అధికారుల నిరంకుశత్వం లాంటివి ఉంటాయి, కానీ చివరికి న్యాయమే గెలుస్తుంది.
ప్రభు సోలొమన్ కూడా ఇంచుమించు అదే కథని తీసుకున్నాడు ఇక్కడ. పదేళ్ల పాప కథ, చెరచబడింది, శిక్ష నుండి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తారు, కానీ చివరికి న్యాయం గెలుస్తుంది. అక్కడ ఆఫ్రికన్ నలుపు వాళ్ళు, ఇక్కడ గిరిజన యువతి, ఆమె మనవరాలు. అంతే తేడా. అయితే ప్రభు అంతా బాగానే తీసాడు కానీ ఆ బస్సు లో సన్నివేశాలు మరీ సాగదీసాడు. ఈ సినిమా, సంఘటన ఆలోంచించ తగినట్టుగా తీసాడు. చివరికి న్యాయం ఎలా గెలిచింది అన్న విషయం బాగుంది. ఆ గిరిజన యువతీ పోరాడే విధానం కూడా బాగా తీసాడు. చాల సన్నివేశాలు వాస్తవికతకు దగ్గరగా వుండే విధంగా చూపించాడు. ఈ సినిమా ద్వారా ప్రభు సోలొమన్ పోక్సో అనే చట్టం గురించి ప్రజలకి తెలియచేయాలనుకున్నాడు, సక్సెస్ అయ్యాడు కూడా. పోక్సో (POCSO: The Protection of Children from Sexual Offences Act, 2012).
ఇక నటీనటుల విషయానికి వస్తే కోవై సరళ మామూలుగా హాస్యనటిగా అందరికీ పరిచయం, కానీ ఈ సినిమాతో ఆమె ఎంత ప్రతిభావంతురాలో తెలుస్తుంది. వీరతాయి గా చాలా బాగా చేసింది. ధీరోదాత్తంగా కనపడి పోరాట సన్నివేశాలు కూడా అదరగొట్టింది. ఇంక మనవరాలు గా నీల అనే చిన్నపిల్ల చేసింది. ఆమె కూడా కోవై సరళ కి ధీటుగా బాగా నటించింది. ఇంకా మిగతా పాత్రల్లో తంబి రామయ్య, నంజి సంపత్ బాగా చేసారు. రాజకీయ నాయకులుగా కూడా ఆ ఇద్దరూ సహజ సిద్ధంగా నటించారు. అశ్విన్ కుమార్ పేరులేని లాయర్ పాత్రలో నటించాడు.
చివరగా, 'సెంబి' సినిమా ఒక పదేళ్ల గిరిజన బాలిక మీద ముగ్గురు అధికార బలం వున్నా ముగ్గురు యువకులు జరిపిన అత్యాచారాన్ని లంచం తిన్న అధికారులు ఏ విధంగా కేసు మాఫీ చెయ్యాలని చూసారు, అలాగే ఇంకో పక్క పోక్సో చట్టం ద్వారా న్యాయం జరుగుతుంది అని చెప్పడానికి ప్రయత్నించాడు. ఆలోచించదగ్గ సినిమా. చూడాల్సిందే.