Chinna movie review: ఆలోచింపచేసే సినిమా, సిద్ధార్థ్ నటన హైలైట్
ABN , First Publish Date - 2023-10-07T12:23:50+05:30 IST
సిద్ధార్థ్ నటించి, నిర్మించిన సినిమా 'చిన్నా'. ఇందులో చిన్నపిల్లల మీద లైంగిక దాడులు జరుగుతున్నాయి కదా, ఆ నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది. అరుణ్ కుమార్ దర్శకుడు. ఈ సినిమా సిద్ధార్థ్ చెప్పినట్టు ఒక మంచి సినిమా, ఆలోచింపచేసే సినిమా, అందరూ చూడాల్సిన సినిమా
సినిమా: చిన్నా
నటీనటులు : సిద్ధార్థ్, నిమిషా సజయన్, సహస్ర శ్రీ, అంజలి నాయర్ తదితరులు
ఛాయాగ్రహణం: బాలాజీ సుబ్రమణ్యమ్
నేపథ్య సంగీతం : విశాల్ చంద్రశేఖర్
సంగీతం: దిబు నినన్ థామస్, సంతోష్ నారాయణన్
నిర్మాత: సిద్ధార్థ్
దర్శకత్వం: ఎస్ యు అరుణ్ కుమార్
రేటింగ్: 3.5 (మూడు పాయింట్ అయిదు)
-- సురేష్ కవిరాయని
సిద్ధార్థ్ కథానాయకుడిగా నటించడమే కాకుండా, నిర్మాతగా కూడా చేసిన సినిమా 'చిన్నా'. ఈ సినిమా తమిళంలో 'చిత్తా' #Chittha గా ముందు విడుదలై అక్కడ మంచి ప్రశంసలు, పేరు సంపాదించింది. ఆ తరువాత తెలుగులో 'చిన్నా' గా #ChinnaReview విడుదల చేసాడు సిద్ధార్థ్, అప్పుడే సినిమా ప్రచారాలు సందర్భంగా ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు కూడా. సిద్ధార్థ్ సినిమా ఎవరు చూస్తారు అని ఇక్కడ అడిగారు అని భావోద్వేగం చెందాడు. ఈ సినిమా గురించి ఎంతో గొప్పగా చెప్పాడు, ఈ సినిమా బాగోలేదు అంటే తాను ఇక తెలుగుకి వచ్చి తన సినిమాలు విడుదల చెయ్యను అని కూడా ఆ భావోద్వేగంలో చెప్పాడు. అంటే అతను ఈ సినిమా మీద అంతగా నమ్మకం పెట్టుకున్నాడు అని అర్థం అవుతోంది. దీనికి ఎస్ యు అరుణ్ కుమార్ దర్శకుడు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. (Chinna movie review)
Chinna story కథ:
ఈశ్వర్ అలియాస్ చిన్నా (సిద్ధార్థ్) మున్సిపాలిటీ లో వుద్యోగం చేస్తూ ఉంటాడు. అతని అన్నయ అకాలంగా మరణిస్తే, అన్నయ్య కూతురు చిట్టి లేదా సుందరి (సహస్ర శ్రీ) ని, వదినని, చిన్నా చూసుకుంటూ ఉంటాడు. చిట్టి అంటే చిన్నాకి ప్రాణం, ఎప్పుడూ తనే స్కూల్ కి తీసుకెళ్లడం, తీసుకురావటం చేస్తూ ఉంటాడు. ఇలా సాఫీగా గడిచిపోతూ ఉంటే, ఒకరోజు చిట్టి స్నేహితురాలు మున్ని (సబియా తస్నిమ్) లైంగిక దాడికి గురవుతుంది. పదేళ్ల పిల్ల భయపడి ఆ విషయం ఎవరికీ చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది. చిన్నా ఆరోజు మున్ని అదొకలా ఉండటం గమనించి చిట్టిని స్కూల్ దగ్గరే ఉండమని చెప్పి, మున్నిని ఇంటిదగ్గర దింపడానికి వెళతాడు. #ChinnaReview తరువాత మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానే అనే ఆరోపణలు వస్తాయి. చిన్నా స్నేహితులు కూడా అదే నమ్ముతారు. పొలిసు కంప్లైంట్ ఇవ్వడానికి మున్ని కుటుంబ సభ్యులు ఒప్పుకోరు, ఎందుకంటే పరువుపోతుందని. చిన్నానే చేసాడు అనడానికి ఒక వీడియో కూడా బయటకి వస్తుంది. చిన్నా వదిన కూడా చిన్నానే అనుమానిస్తుంది. అందరూ షాక్ కి గురవుతారు. #ChinnaReview ఈలోగా చిట్టి కూడా కనపడకుండా పోతుంది. ఇంతకీ ఈ లైంగిక దాడి చిన్నానే చేశాడా, ఎవరు చేశారు? చిట్టి ఏమైంది? చివరికి కథ ఎటు మలుపులు తిరిగింది అని తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. (Chinna movie review)
విశ్లేషణ:
సిద్ధార్థ్ (Siddharth) చెప్పినట్టు ఇది ఒక అసాధారణ సినిమా. ఒక సున్నితమైన అంశం తీసుకొని దానికి కొంచెం థ్రిల్లింగ్ అంశాలు జోడించి ఎక్కడా ఎబ్బెట్టుగా గానీ, మితిమీరకుండా చూపించి చాలా జాగ్రత్తగా తీసిన సినిమా ఈ 'చిన్నా'. చిన్న పిల్లల మీద లైంగిక దాడులు జరుగుతున్నాయి, కొంతమంది బయటకి వచ్చి పోలీసులకు చెప్తారు, కొంతమంది పరువు పోతుందని సైలెంట్ గా ఉండిపోతారు. అలాగే చిన్న పిల్లలకి గుడ్ టచ్, బాడ్ టచ్ ఇవన్నీ ఎలా చెప్పాలి, దగ్గర బంధువులు అయినా కూడా, చిన్నాన్న, మామయ్య అయినా కూడా తల్లికి చెప్పాలి పిల్లలు. అలాగే మొబైల్ ఫోనులు పిల్లలకి ఇవ్వటం ఎటువంటి అనర్ధాలకు దారితీస్తుందో కూడా ఇందులో క్లియర్ గా చూపించారు. చాలా సున్నితమైన అంశాలు ఈ సినిమాలో చక్కగా చూపించారు, ఎక్కడా అతి చెయ్యకుండా ఈ సున్నితమైన అంశాన్ని తెరమీద దర్శకుడు అరుణ్ కుమార్ ఆవిష్కరించిన తీరు చాలా బాగుంది. ఈ సినిమాలో చాలా భావోద్వేగాలు కనిపిస్తాయి, అందులో నటీనటులు కూడా వాటిని చాలా బాగా చూపించగలిగారు. అంతా చాలా సహజంగా వున్నట్టుగా తెర మీద చూపించగలిగారు.
సినిమా మొదలయ్యాక ఈశ్వర్, అతని అన్నయ్య కూతురు చిట్టి, ఆమె స్నేహితురాలు మున్ని, స్కూల్, అతని ప్రియురాలు, ఇలా అతని గురించి మొదలై మెల్లగా కథలోకి తీసుకువెళతాడు దర్శకుడు. చిట్టి, మున్ని కూడబలుక్కొని ఇంటి దగ్గర చెప్పకుండా ఆటో ఎక్కి వెళ్లాలని అనుకున్నప్పుడు కథ ఇంకా ఆసక్తికరంగా సాగుతుంది. మున్నిపై లైంగిక దాడి చేసింది మున్నానే అని అన్నప్పుడు ప్రేక్షకులు ఒక షాకు కి గురవుతారు. ఆ తరువాత కథ పెద్ద మలుపు తిరుగుతుంది. ఇక ఇక్కడ నుండి కథ ఇంకా ఆసక్తికరంగా ఉండటమే కాకుండా, ప్రేక్షకుడిని మంత్రముగ్దుడ్ని చేస్తుంది. ఏమి జరుగుతుంది అనే ఆసక్తితో ప్రేక్షకుడు కుర్చీకి అతుక్కుపోయేట్టు దర్శకుడు చేసాడు. చిన్న పిల్లల్ని ఓ కంట ఎప్పుడూ కనిపెడుతూ ఉండాలి అనే విషయం, అలాగే మొబైల్స్ వాళ్ళ చేతికి ఇస్తే ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి అనే విషయం కూడా ఈ సినిమా ద్వారా చెప్పాడు. అలాగే మహిళల మీద ఒక్కోసారి బయటివాళ్లే, కాదు ఇంట్లోవాళ్లే లైంగిక దాడులు చేసినప్పుడు ఆ మహిళలు ఎవరికీ చెప్పుకోలేరు, ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారో అనే విషయం కూడా సినిమాలో స్పృశించాడు. ఇలా చాలా విషయాలు ఆలోచించే విధంగా ఈ సినిమాలో కనిపిస్తాయి. పిల్లల మీద దాడి చేసిన వాళ్ళు కూడా సమాజంలో మామూలు వ్యక్తులుగా చలామణీ అవుతూ ఎవరికీ తొందరగా దొరకరు, కనిపించరు, అనుమానించ బడటానికి ఆస్కారం కూడా ఇవ్వరు, అలాంటి వాళ్ళని పట్టుకోవటం కష్టం. ఎన్నో సమస్యలని సున్నితంగా చూపించి ప్రేక్షకుల్లో ఒక ఆలోచింపచేసే విధంగా తీసి చూపించిన ఘనత దర్శకుడు అరుణ్ కుమార్ ది అయితే, ఈ సినిమా తీసిన నిర్మాతగా సిద్ధార్థ్ కూడా అభినందించ తగ్గవాడు. వాణిజ్య, వ్యాపార అంశాలకు తావులేకుండా కేవలం కథ మీదే దృష్టి పెట్టి, అలానే తీసి శెభాష్ అనిపించుకున్న సినిమా ఈ 'చిన్నా'.
ఇక నటీనటుల విషయానికి వస్తే సిద్ధార్థ్ సినిమా అంతా తన భుజం మీద వేసుకొని మోసాడు. అతను అద్భుతమైన నటుడు అని అందరికీ తెలిసిన విషయమే, ఇందులో తన నటనతో మరోసారి అందరినీ ఆశ్చర్య చకితులను చేసాడు. భావోద్వేగాలు పలికించటంలో గానీ, హావభావాలు చెప్పడంలో గానీ, నటనలోకాని సిద్ధార్థ్ మరోసారి విజృంభించాడు అనే చెప్పాలి. చిన్నాన్న ముట్టుకున్నా చెప్పాలా అని చిట్టి, తల్లిని అడిగితే తల్లి చిన్నా ముట్టుకున్నా చెప్పాలి అంటుంది. అప్పుడు సిద్ధార్థ్ పడే వేదన చాలా బాగా చేసాడు. అలాంటివి ఎన్నో వున్నాయి సినిమాలో. మున్ని విషయం తెలిసాక చిట్టి ఒక్కసారిగా వచ్చి చిన్నాని ముట్టుకున్నప్పుడు ఉలిక్కిపడిన సన్నివేశం గగుర్పాటు కలిగిస్తుంది. సిద్ధార్థ్ అద్భుతంగా చేసాడు. వదినగా అంజలి నాయర్ చాలా సహజంగా నటించింది, బాగా చేసింది. చిన్న పిల్లలు సబియా, సహస్ర శ్రీ నటన ఈ సినిమాలో ఒక హైలైట్ అనే చెప్పాలి, ఎంతో సహజంగా చేసి చూపించారు. ఇద్దరూ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. సిద్ధార్థ్య్ ప్రేయసి గా నిమిషా పారిశుధ్య పనామె గా చాలా సహజంగా కనిపిస్తుంది, అలానే చేసింది. చివర్లో ఆమె చెప్పిన సంఘటన అందరినీ ఆలోచింపచేస్తుంది. సిద్ధార్థ్ స్నేహితులుగా, మిగతా పాత్రల్లో అందరూ చాల సహజంగా నటించారు, మంచి సపోర్ట్ చేశారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంటుంది, నేపధ్య సంగీతం, సంగీతం, ఛాయాగ్రహణం, ఒకటేమిటి అన్నీ సరిగ్గా కుదిరాయి ఈ సినిమాకి. మాటలు కూడా బాగా రాసారు. రెండో సగంలో కొన్ని సన్నివేశాలు సాగదీతగా వున్నా, విషయం వున్న సినిమా ఇది.
చివరగా, 'చిన్నా' సినిమా ఒక సున్నితమైన అంశాన్ని, ఆలోచింపచేసే విధంగా దర్శకుడు తెరమీద ఆవిష్కరించిన తీరు చాలా బాగుంది. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. అలాగే మన పిల్లల మీద మనం ఎప్పుడూ ఓ కన్ను వేసి ఉంచాలి అని చెప్పే కథ. పిల్లలకి ఎవరు ఎక్కడ తాకాలి, తాకకూడదు, ఎవరైనా, స్వంత మనుషులు అయినా కూడా, తాకితే తల్లికి ధైర్యంగా చెప్పాలి అనే విషయాన్నీ కూడా చాలా బాగా చెప్పిన సినిమా. సిద్ధార్థ్ చెప్పినట్టు ఈ సినిమా తప్పకుండా చూడాలి, అందరికీ చెప్పాలి.