Changure Bangaru Raja film review: ఏంటి రాజా ఇది!
ABN , First Publish Date - 2023-09-15T17:32:30+05:30 IST
సీనియర్ నటుడు రవితేజ నిర్మాతగా 'ఛాంగురే బంగారు రాజా' అనే సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో సతీష్ వర్మ అనే అతన్ని దర్శకుడిగా పరిచయం చేసాడు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
సినిమా: ఛాంగురే బంగారు రాజా
నటీనటులు: కార్తీక్ రత్నం, సత్య, అల్లరి రవిబాబు, గోల్డీ నిస్సీ, సునీల్ (voiceover), ఎస్తర్, అజయ్, రాజ్ తిరందాసు తదితరులు
మాటలు: జనార్థన్ పసుమర్తి
ఛాయాగ్రహణం: ఎన్ సీ సుందర్
సంగీతం: కృష్ణ సౌరబ్
నిర్మాత: రవితేజ
రచన, దర్శకత్వం: సతీష్ వర్మ
-- సురేష్ కవిరాయని
టాలీవుడ్ లో చాలామంది కథానాయకులు ఇప్పుడు తమ స్వంత సంస్థలను ప్రారంభించారు. మొన్నటివరకు వాళ్ళు నటిస్తున్న సినిమాల్లో భాగంగా వున్నా, ఇప్పుడు కొత్త టాలెంట్, కొత్త సాంకేతిక నిపుణలని, బడ్జెట్ సినిమాలను తియ్యడానికి ముందుకు వస్తున్నారు. మహేష్ బాబు (MaheshBabu) 'మేజర్' #Major సినిమా, అలాగే ఇంకో నటుడు నానీ (Nani) కూడా 'హిట్' #Hit సినిమా, రామ్ చరణ్ (RamCharan), ఇంకా చాలామంది నటులు కొత్తవాళ్ళకి ప్రోత్సాహం ఇస్తున్నారు. ఆ కోవలోనే నటుడు రవితేజ (RaviTeja) కూడా నడుస్తూ కొత్తవాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 'ఛాంగురే బంగారు రాజా' #ChangureBangaruRajaReview అనే సినిమా నిర్మించి, సతీష్ వర్మ (SatishVarma) అనే దర్శకుడిని పరిచయం చేసాడు. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కార్తీక్ రత్నం (KarthikRatnam), గోల్డీ (Goldie), సత్య (ComedianSatya), రవిబాబు (AllariRaviBabu) లాంటివాళ్లు నటించారు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
Changure Bangaru Raja story కథ:
బంగార్రాజు (కార్తీక్ రత్నం) ఆ వూరిలో ఒక మోటారు మెకానిక్, అతనికి తల్లిదండ్రులు లేరు, వున్న పొలాన్ని చూసుకుంటూ ఒక్కడే ఉంటాడు. ఆ వూరు రంగురాళ్లకి ప్రసిద్ధి, వర్షం వస్తే చాలు, వూర్లో ప్రజలందరూ బయటకి వచ్చి రంగురాళ్ళకోసం గుట్టలు, పొలాలు తవ్వుతూ వుంటారు. అదే సమయంలో బంగార్రాజుకి, సోమునాయుడుకి (రాజ్ తిరందాసు) గొడవ జరుగుతుంది, అందరి ముందు సోమునాయుడిని చంపి చెరువులో పడేస్తాను అని నోరు పారేసుకుంటాడు బంగార్రాజు. ఆ మరుసటి రోజే సోమునాయుడు శవం అయి కనపడతాడు. అతన్ని ఎవరు చంపి వుంటారు అని ఆ ఊరి ఎస్ఐ (అజయ్), కానిస్టేబుల్ మంగ (గోల్డీ) పరిశోధన మొదలెడతారు. బంగార్రాజు మీదకే అందరి దృష్టి వెళుతుంది. ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు? తాతారావు (సత్య), గటీలు (రవిబాబు) కి ఈ హత్యకి సంబంధం ఏంటి? కానిస్టేబుల్ మంగకి బంగార్రాజుకి మధ్య ఏంటి సంబంధం? ఇవన్నీ తెలుసుకోవాలంటే 'ఛాంగురే బంగారు రాజా' సినిమా చూడాల్సిందే. (Changure Bangaru Raja film review)
విశ్లేషణ:
దర్శకుడు సతీష్ వర్మ ఈ 'ఛాంగురే బంగారు రాజా' సినిమాని ఒక ప్రయోగాత్మకంగా తీద్దామని అనుకున్నాడు. ఒక హత్య జరిగితే, దానితో సంబంధం వున్న ముగ్గురితో మూడు కోణాల్లో కథ చెప్తాడు. ఒకరు బంగార్రాజు, రెండో వాడు తాతారావు, మూడోవాడు గటీలు, ఇలా ఈ ముగ్గురి కథలు చెపుతూ చివర్లో వీళ్ళందరూ కలుస్తారు, హత్య ఎవరు చేస్తారో, ఎలా చేస్తారో వివరిస్తాడు. అయితే ఇక్కడే దర్శకుడు కొంచెం తడబడ్డాడు అని చెప్పాలి. హత్య జరిగిన వరకు బాగానే ఉంటుంది, కానీ ఆ తరువాతే చాలా సాగదీసేసాడు. ఇలాంటి కథలు కొంచెం ఆసక్తికరంగా వుండి, హాస్య సన్నివేశాలతో మిళితమై ఉండాలి. కానీ దర్శకుడు సతీష్ వర్మ, ఈ సినిమాని అటు వినోదాత్మకంగా కాకుండా, ఇటు ఆసక్తికరంగా కూడా లేకుండా చాలా పేలవంగా నెరేట్ చేసాడు. #ChangureBangaruRajaReview
సినిమా మొదలవ్వటమే ఒక హత్య మూడు కోణాల్లో ఎలా ఉంటుందో అని చెప్పేసాడు దర్శకుడు. అయితే ఏ కోణంలో చూసిన ఒకటే కథలా అనిపిస్తూ ఉంటుంది. అలాగే హత్యానేరం మోపబడిన యువకుడు, తను నేరం చెయ్యలేదని రుజువు చేసుకునేందుకు తనే దర్యాప్తు మొదలెడతాడు. ఇందులో దర్శకుడు కొత్తగా ఏమీ చూపించలేదు సరి కదా, ముగ్గురు కోణంలో కథ చెప్పేటప్పుడు అవే సన్నివేశాలు మళ్ళీ మళ్ళీ వచ్చి బోర్ గా ఫీల్ అయ్యేట్టు చేస్తాయి. #ChangureBangaruRajaReview పోనీ ఏమైనా వినోదాత్మక సన్నివేశాలు వున్నాయంటే అవీ లేవు, అక్కడక్కడా కొన్ని తప్పితే. సునీల్ గొంతు కుక్కకి పెట్టారు కానీ అదీ సరిగా వర్క్ అవుట్ కాలేదు. మొదట్లోనే రంగురాళ్ల తవ్వకాలు చూపించాడు, దాని నేపథ్యంలో దర్శకుడు దృష్టి పెట్టి ఒక మంచి క్రైమ్ తో కూడిన వినోదాత్మక సినిమా గా తీయొచ్చు. కానీ అది కేవలం మళ్ళీ క్లైమాక్స్ లో ఉపయోగించాడు. అంతే. దర్శకుడు ఆసక్తికరంగా కాకుండా సినిమా అంతా సాగదీసినట్టుగా చూపించి బోర్ కొట్టించేసాడు.
ఇక నటీనటుల విషయానికి వస్తే కార్తీక్ రత్నం బంగార్రాజు గా పరవాలేదు అనిపించాడు. అతని పాత్ర అంత బలంగా డిజైన్ చెయ్యలేదు, అందుకని అతన్ని అని ఏమీ లాభం లేదు. సత్య అక్కడక్కడా నవ్వించాడు. #ChangureBangaruRajaReview అల్లరి రవిబాబు పాత్ర పరవాలేదు, పరిధి మేరకు బాగానే చేసాడు. ఇక గోల్డీ కానిస్టేబుల్ గా బాగుంది, కానీ ఆమెకి కార్తీక్ కి మధ్య కెమిస్ట్రీ సరిగ్గా కుదరలేదు. సత్యకి జోడీగా నిత్యశ్రీ బాగుంది, అలాగే రవిబాబుకి జోడీగా వేసిన ఎస్తర్ (EsterNoronha) రెండో సగంలో కనిపిస్తుంది, ఆమె పాత్రకి తగ్గట్టుగా చేసింది. మిగతావాళ్ళు అందరూ పరవాలేదు. సంగీతం కూడా అంతగా లేదు, అలాగే ఛాయాగ్రహణం కూడా నమ మాత్రంగానే వుంది.
చివరగా, 'ఛాంగురే బంగారు రాజా' సినిమా ట్రైలర్ మాత్రమే #ChangureBangaruRajaReview ఆసక్తికరంగా ఉంటుంది అనిపించింది. సినిమాలో మాత్రం విషయం లేదు. ఒక హత్య జరుగుతుంది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, తనమీద మోపబడిన నేరం తప్పు అని చెప్పడానికి ఒక యువకుడు ఏమి చేసాడు, ఇవన్నీ ఎంతో ఆసక్తికరంగా తీయొచ్చు, కానీ దర్శకుడు అన్నిటిలో పూర్తిగా విఫలం అయ్యాడు. ఈ సినిమా అంతగా ఆకట్టుకోదు అనే చెప్పాలి.