Bholaa Shankar film review: మెహర్ రమేష్ 'శక్తి' ఇంతే !
ABN , First Publish Date - 2023-08-11T15:41:50+05:30 IST
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళాశంకర్' విడుదలైంది ఈరోజు. మెహర్ రమేష్ దీనికి దర్శకుడు, కాగా కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలుగా, తమన్నా కథానాయకురాలిగా చేసింది. ఇది అజిత్ నటించిన తమిళ సినిమా 'వేదాళం' కి రీమేక్. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
సినిమా: భోళా శంకర్
నటీనటులు: చిరంజీవి, తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, తులసి, బ్రహ్మాజీ, తరుణ్ అరోరా తదితరులు
ఛాయాగ్రహణం: డడ్లీ
సంగీతం: మహతి స్వరసాగర్
మాటలు: మామిడాల తిరుపతి
కథనం, మాటలు, కథా విస్తరణ, దర్శకత్వం: మెహర్ రమేష్
-- సురేష్ కవిరాయని
మెగాస్టార్ చిరంజీవి (MegaStarChiranjeevi) సినిమా విడుదల అంటే మెగా అభిమానులకు పండగే ! అయితే చిరంజీవి ఈమధ్య కొంచెం రీమేక్ ల మీద ఎందుకో దృష్టి పెట్టారు. ఇంతకు ముందు 'గాడ్ ఫాదర్' #GodFather, మలయాళం సినిమా 'లూసిఫెర్' #Lucifer కి రీమేక్, ఆ తరువాత వచ్చిన 'వాల్తేరు వీరయ్య' #WaltairVeerayya రెగ్యులర్ సినిమాగా అఖండ విజయం సాధించి ఈమాధ్య విడుదలైన సినిమాల్లో అగ్రస్థానంలో వుంది. ఇప్పుడు 'భోళాశంకర్' #BholaaShankar అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది అజిత్ (AjithKumar) నటించిన తమిళ సినిమా 'వేదాళం' #Vedalam అనే సినిమాకి రీమేక్. మెహర్ రమేష్ (MeherRamesh) దీనికి దర్శకుడు. మెహర్ రమేష్ దాదాపు పదేళ్ల తరువాత ఈ సినిమాకి దర్శకత్వం చేస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ (KeerthySuresh), చిరంజీవి కి చెల్లెలుగా నటించింది, అలాగే తమన్నా భాటియా (TamannaahBhatia) కథానాయకురాలిగా చేసింది. సుశాంత్ (Sushanth) ఒక ప్రత్యేక పాత్రలో కనపడతాడు. ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం. #BholaaShankarReview
Bholaa Shankar story కథ:
కలకత్తాలో అమ్మాయిలు మాయం అయిపోతూ వుంటారు, ఒక మాఫియా గ్యాంగ్ వీళ్ళని మాయం చేస్తూ విదేశాలకి ఎగుమతి చేస్తూ డబ్బులు సంపాదించుకుంటూ వుంటారు. అదే సమయంలో శంకర్ (చిరంజీవి) తన చెల్లెలు మహాలక్ష్మి (కీర్తి సురేష్) తో కలకత్తాలో అడుగుపెడతాడు, శంకర్ క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తూ ఉంటాడు. చెల్లెలు మహాలక్ష్మిని కలకత్తాలో ఒక కాలేజీలో జాయిన్ చేస్తాడు, ఆమె మంచి చిత్రకారిణి, ఎవరి చిత్రం అయినా నిముషాల్లో వేసేస్తూ ఉంటుంది. #BholaaShankarReview కలకత్తా పోలీసులు క్యాబ్ డ్రైవర్ లు అందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేసి, అమ్మాయిల మాయం వెనక వున్న మాఫియా గ్యాంగ్ సభ్యుల ఫోటోలను ప్రతి డ్రైవర్ కి అందచేసి, ఎవరికైనా వీళ్ళు ఎక్కడైనా తారసపడినా, అనుమానం కలిగినా వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వమని చెప్తారు. #BholaaShankarReview శంకర్ కి ఒకసారి అనుమానం వచ్చి, పోలీసులకి వెంటనే సమాచారం ఇవ్వటంతో కొంతమంది అమ్మాయిలని రక్షించడమే కాకుండా, కొంతమంది ముఠా సబ్యులని కూడా చంపేస్తారు పోలీసులు. ఈ గ్యాంగ్ కి లీడర్ అయిన అలెక్స్ (తరుణ్ అరోరా) కి ఈ విషయం తెలిసి ఎవరు పోలీసులకు సమాచారం ఇచ్చారో ఆచూకీ లాగుతాడు. శంకర్ అని తెలుస్తుంది, వెంటనే శంకర్ ని పట్టుకోవడానికి, అతని చెల్లెలిని టార్గెట్ చేస్తాడు. ఇది తెలిసిన శంకర్ ఏమి చేసాడు? అతన్ని హైదరాబాద్ లో భోళా అని ఎందుకు పిలుస్తారు? అసలు హైదరాబాద్ నుండి భోళా కలకత్తా ఎందుకు వచ్చాడు? ఇవన్నీ తెలియాలంటే మీరు 'భోళాశంకర్' సినిమా చూడాల్సిందే ! #BholaaShankarReview
విశ్లేషణ:
దర్శకుడు మెహెర్ రమేష్ అనే అతను దాదాపు పది సంవత్సరాలు అయింది సినిమా చేసి. అతను ఇంతకు ముందు చేసిన 'షాడో', 'శక్తి' అనే సినిమాలు పరిశ్రమలో వరస్ట్ సినిమాలు అనేవి ఏమైనా వున్నాయి అంటే ఆ రెండు సినిమాలనే చెప్తారు. అంత చెత్తగా తీసాడు ఆ రెండు సినిమాలని మెహర్ రమేష్. ఆ తరువాత అతనికి ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదు, మెగాస్టార్ చిరంజీవి పిలిచి మరీ ఈ 'భోళాశంకర్' సినిమా చెయ్యమని అతనికి అవకాశం ఇచ్చారు. #BholaaShankarReview పదేళ్ల తరువాత వచ్చిన అవకాశం, అదీ కాకుండా తనమీద దర్శకుడిగా చాలా చెడ్డ పేరు వుంది, అవన్నీ చెరిపెయ్యడానికి ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు మెహర్ రమేష్ ఎంత కృషి చెయ్యాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మెగా స్టార్ చిరంజీవి అనే వ్యక్తి, తెలుగు పరిశ్రమలో అగ్ర నటుడు, అటువంటి వ్యక్తే అందులో కథానాయకుడు అంటే, ఇంకెంతలా కష్టపడాలి మెహర్ రమేష్ దర్శకుడిగా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అజిత్ నటించిన తమిళ సినిమా 'వేదాళం'కి రీమేక్, అంటే కథ కూడా ఇచ్చేసారు, దర్శకుడిగా మెహర్ చెయ్యాల్సింది, ఆ తమిళ కథని, మెగాస్టార్ కి అనుగుణంగా ఎలా చెయ్యగలం, చూపించగలం అనే దానిమీద దృష్టి పెట్టి చెయ్యడమే.
కానీ ఇక్కడే దర్శకుడిగా మెహర్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఒక మెగాస్టార్ ని ఎలా వాడుకోవాలో, ఎలా చూపించాలో పూర్తిగా విఫలం అయ్యాడు. 'వేదాళం' విడుదలైంది 2015 లో, ఆ సినిమా ఇప్పుడు అంటే 2023 లో తీస్తున్నావు అంటే, దర్శకుడిగా ఎంత అప్డేట్ అవ్వాలి, అవేమీ చెయ్యకుండా, 'వేదాళం' విడుదలైన పదేళ్ల వెనక్కి వెళ్ళిపోయాడు మెహర్ రమేష్, అంటే అంత అవుట్ డేటెడ్ గా ఈ 'భోళాశంకర్' కథ, సన్నివేశాలు, మాటలు ఒకటేమిటి అన్నీ అలానే తీసాడు. #BholaaShankarFilmReview ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు మెహర్ రమేష్. సినిమా అంతా 'జబర్దస్త్' స్కిట్స్ చేసి పడేసాడు. లక్షలాది అభిమానులు వున్న ఒక మెగాస్టార్ ని కనీసం ఎలా చూపించాలో కూడా తెలుసుకోలేకపోయాడు.పైగా అజిత్ 'వేదాళం' సినిమా టెన్ టైమ్స్ క్రింజ్ అని విమర్శ కూడా చేసిన మెహర్, మరి ఈ 'భోళా శంకర్' సినిమాలో ఏమి చేసాడు, ఏమీ చెయ్యలేకపోగా, మెగాస్టార్ తో 'జబర్దస్త్' స్కిట్స్ చేయించాడు. మళ్ళీ ప్రేక్షకులకు అవి స్కిట్స్ అని గుర్తు రావేమో అని ఆ 'జబర్దస్త్' లో చేస్తున్న నటులనే ఇందులో కూడా పెట్టేసాడు.
పవన్ కళ్యాణ్ 'ఖుషీ' సినిమా ఒక సూపర్ డూపర్ హిట్ అయిన రొమాంటిక్ కామెడీ సినిమా. ఆ సినిమాలో వున్న ఒక పాపులర్ సన్నివేశాన్ని అదే పవన్ కళ్యాణ్, భూమిక మధ్య వచ్చే నడుము సన్నివేశం, చిరంజీవి-శ్రీముఖి మీద తీసి ఒరిజినల్ సినిమాలో వున్న సన్నివేశాన్ని కూడా పాడుచేసేంతలా చేసావు కాదయ్యా మెహర్ అని మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ 'భోళాశంకర్' లో ఆ సన్నివేశం చూసి. పోనీ అది కూడా ఒకే. అసలు ఒరిజినల్ తమిళ సినిమాలో కథ ఎంత ఆసక్తికరంగా వుంది, మరి మెహర్ కథ మీద దృష్టి మానేసి, ఒక్కో సన్నివేశం మీద దృష్టి పెట్టి, స్కిట్ లాగా ప్రతి సన్నివేశాన్ని చూపించి, ఒక అవుట్ డేటెడ్ సినిమాగా మొత్తం చూపించేసాడు. ఆ పోరాట సన్నివేశాలు నిడివి కూడా మరీ ఎక్కువగా వుంది. #BholaaShankarFilmReview
మెహర్ రమేష్ తన 'శక్తి' నంతా ధారపోసి ఈ 'భోళా శంకర్' ని ఇంతకు ముందు తను తీసిన ఆ రెండు సినిమాల జాబితాలో దీనిని చేర్చేసాడు. అంటే ఇప్పుడు వరసగా ఇది మూడోది అతనికి, 'శక్తి', 'షాడో', 'భోళాశంకర్'. అలాగే ఒక నటుడు గురించి, అతను చేస్తున్న సామజిక సేవ, లేదా ఇతరులకు ఏవిధంగా ఉపయోగం చేస్తున్నాడు అనేది ప్రజలకి తెలిసిన విషయం. అది అందరూ హర్షిస్తారు కూడా. కానీ పని కట్టుకొని అవే మాటలు సినిమాలో పెడితే అవి బోర్ కొట్టేస్తాయి. #BholaaShankarReview ప్రీ రిలీజ్ వేడుకల్లో, ప్రచార వీడియోల్లో అందరూ చిరంజీవి గురించి చెప్తున్న మాటలు, పొగడ్తలు వింటున్నాం, మళ్ళీ సినిమాలో కూడా అవే వింటే అందులో కొత్తదనం ఏముంటుంది. ఒక సన్నివేశం వుంది సినిమాలో, చిరంజీవికి వెనకాల నుండి రౌడీలు పొడిచి పారిపోతారు, కీర్తి సురేష్ చూసి చిరంజీవిని హాస్పిటల్ కి తీసుకు వెళుతుంది, అక్కడ నర్సు కీర్తి సురేష్ తో బ్లడ్ చాలా పోయింది బ్లడ్ తొందరగా తెప్పించండి అని చెప్తుంది. వెంటనే చిరంజీవి బ్లడ్ బ్యాంకు చూపించేస్తాడేమో అని భయపడ్డాం ! కానీ అది చూపించలేదు మెహర్ రమేష్ ! ఇదంతా ఎందుకు అంటే, సినిమాలో కథాపరంగా నటుడిని చూపించాలి తప్ప, అతని వ్యక్తిగతంగా చేసిన పనులని తెరమీద చూపిస్తే, ప్రేక్షకులకి అంతగా రుచించదు. సినిమా సినిమాల తీయాలి, వ్యక్తుల పొగడ్తలకు సినిమా ఎందుకు తీయడం? ఇంతకన్నా ఈ సినిమా మీద చర్చ కూడా అనవసరమే అనిపిస్తుంది! #BholaaShankarReview
ఇక నటీనటుల విషయానికి వస్తే, చిరు తనదైన మార్కుతో తన అభిమానులను మెప్పించడానికి ప్రయత్నం చేశారు. పాటల్లో డాన్సుల గురించి చెప్పనక్కరలేదు, చిరంజీవికి అవి కొట్టిన పిండి, అలాగే పోరాట సన్నివేశాల్లో కూడా ఈ వయసులో కూడా బాగా కష్టపడ్డారు అని అర్థం అవుతోంది. కీర్తి సురేష్ చెల్లెలుగా బాగా చేసింది, తమన్నా కేవలం గ్లామర్ కోసం, సుశాంత్ పరవాలేదు అనిపించాడు. వెన్నెల కిశోర్ కామెడీ అంతగా పండలేదు. #BholaaShankarReview ఇక శ్రీముఖి (Sreemukhi), గెటప్ శీను, బిత్తిరి సత్తి, లోబో, రష్మీ గౌతమ్ (RashmiGautam), హైపర్ అది (HyperAdi), వైవా హర్ష, వీళ్ళందరూ చిరంజీవితో స్కిట్ లు కోసం పని చేసినట్టుగా అనిపించింది. బ్రహ్మాజీ (Brahmaji) పరవాలేదు, తరుణ్ అరోరా (TarunArora) ఏ సినిమాలో చూసిన ఒకేలా ఉంటాడు విలన్ గా, ఇందులో కూడా అంతే. ఇక సంగీతం పరవాలేదు అనిపించినట్టుగా వుంది. ఛాయాగ్రహణం కూడా ఒకే. మాటలు చాలా వరకు చిరంజీవిని పొగడటానికే రాసారు అన్నట్టు వున్నాయి.
చివరగా, 'భోళా శంకర్' సినిమా దర్శకుడు మెహర్ రమేష్ కి వచ్చిన అవకాశాన్ని పాడుచేసుకునే విధంగా తీసాడు. అటు చిరంజీవి అభిమానులకి గానీ, ఇటు సగటు ప్రేక్షకుడిని ఏవిధంగా కూడా మెప్పించేటట్టుగా, ఆసక్తికరంగా తీయలేకపోయాడు దర్శకుడు. తమిళ సినిమా 'వేదాళం'లో చాలా ఆసక్తికర అంశాలు వున్నాయి, అజిత్ కొన్ని సన్నివేశాల్లో అయితే చాలా బాగా చేసాడు, కానీ ఈ తెలుగు రీమేక్ లో దర్శకుడు పూర్తిగా ఫెయిల్ అయ్యాడు, మెగాస్టార్ స్టామినాని వాడుకోలేకపోయాడు, ఆ స్టామినాకి తగ్గట్టుగా చూపించలేకపోయాడు.