Bhagavanth Kesari film review: ఇదొక పైసా వసూల్ సినిమా !

ABN , First Publish Date - 2023-10-19T13:49:38+05:30 IST

వినోదాత్మకంగా వుండే సినిమాలు తీసిన దర్శకుడు అనిల్ రావిపూడి, భారీ డైలాగులు పెద్దగా చెప్పే బాలకృష్ణ కలిసి చేసిన సినిమా 'భగవంత్ కేసరి' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీలీల ఇందులో ఒక ప్రముఖ పాత్ర పోషించింది. అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నఈ సినిమా ఎలా వుందో చదవండి.

Bhagavanth Kesari film review: ఇదొక పైసా వసూల్ సినిమా !
Bhagavanth Kesari movie review

సినిమా: భగవంత్ కేసరి

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, శరత్ కుమార్, జయచిత్ర, మురళీధర్ రెడ్డి, రవి శంకర్ తదితరులు

ఛాయాగ్రహణం: సి రాంప్రసాద్ (C Ramprasad)

సంగీతం: థమన్ ఎస్ఎస్ (SThaman)

నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది

రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి

విడుదల తేదీ: అక్టోబర్ 19, 2023

రేటింగ్: 3 (మూడు)

-- సురేష్ కవిరాయని

నందమూరి బాలకృష్ణ (NandamuriBalakrishna) సినిమా అంటే అతని అభిమానులకి పండగే, మరి ఇప్పుడు అతని 'భగవంత్ కేసరి' #BhagavanthKesari సినిమా దసరా పండగ సందర్భంగా విడుదలైంది అంటే మరి అభిమానులకి పండగ మీద పండగ అన్నమాట. దానికి తోడు 'అఖండ' #Akhanda, 'వీరసింహారెడ్డి' #VeerasimhaReddy సినిమాలతో విజయాల బాటలో వున్న బాలకృష్ణ ఈసారి ఒక్కో సినిమాతో పెద్ద రేంజ్ కి ఎదుగుతున్న దర్శకుడు అనిల్ రావిపూడి (AnilRavipudi) తో చేతులు కలిపి 'భగవంత్ కేసరి' #BhagavanthKesariReview తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో కాజల్ అగర్వాల్ (KajalAggarwal) కథానాయిక కాగా శ్రీలీల (Sreeleela) ఒక ప్రముఖ పాత్ర పోషించింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (ArjunRampal) ఇందులో విలన్ గా నటించారు. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. (Bhagavanth Kesari movie review)

Bhagavanth-Kesari.jpg

Bhagavanth Kesari story కథ:

భగవంత్ కేసరి (నందమూరి బాలకృష్ణ) వరంగల్ జైల్లో ఖైదీగా ఉంటాడు, ఆ జైలుకు జైలర్ గా శ్రీకాంత్ (శరత్ కుమార్) అనే అతను వుంటాడు. భగవంత్ తల్లి (జయచిత్ర) చావు బతుకుల మధ్య వున్నప్పుడు ఆమె చివరి కోరికగా కొడుకుని చూడాలని కోరుకుంటుంది. జైలర్ శ్రీకాంత్ జైలు రూల్స్ బ్రేక్ చేసి భగవంత్ ని తల్లి దగ్గరికి తీసుకు వెళతాడు, అందువలన శ్రీకాంత్ ని సస్పెండ్ చేస్తారు అధికారులు. అయితే శ్రీకాంత్ వెళ్ళేముందు ఆగస్టు 15 న సత్ప్రవర్తన కారణంగా విడుదల చేసే ఖైదీల పేర్లలో భగవంత్ కేసరిని కూడా చేరుస్తాడు, అందువలన భగవంత్ ని రిలీజ్ చేస్తారు. జైలు నుంచి విడుదలయి, సరాసరి శ్రీకాంత్ ఇంటికి వస్తాడు భగవంత్ కేసరి. సస్పెండ్ అయిన శ్రీకాంత్ మళ్ళీ ఉద్యోగంలో చేరడానికి వెళ్లి, తిరిగి వస్తుంటే ప్రమాదం జరిగి చనిపోతాడు. ఇక శ్రీకాంత్ కూతురు విజ్జీ పాప (శ్రీలీల) బాధ్యత భగవంత్ తీసుకుంటాడు. #BhagavanthKesariReview తండ్రి కోరిక మేరకు విజ్జీని ఆర్మీ కి పంపాలని భగవంత్ ఆమెని అలాగే పెంచుతాడు. కానీ విజ్జీకి ఆర్మీకి వెళ్లడం ఇష్టం లేదు, తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలి అని అనుకుంటుంది. ఇదిలా ఉండగా రాహుల్ సంఘ్వి (అర్జున్ రాంపాల్) దేశంలో ఉన్న పోర్టులు అన్నీ కలిపే 'ప్రాజెక్ట్ వి' ని దక్కించుకోవాలని ముఖ్యమంత్రిని, రాజకీయ నాయకులను తన చేతుల్లోకి తెచ్చుకుంటాడు. కొన్నిఅనుకోని పరిస్థితుల్లో రాహుల్ సంఘ్వి మనుషులు విజ్జీ ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు భగవంత్ కేసరి రంగంలోకి దిగుతాడు. #BhagavanthKesariReview ఇంతకీ విజ్జీని ఎందుకు టార్గెట్ చేశారు, అసలు భగవంత్ కేసరికి, రాహుల్ సంఘ్వికి ఏమైనా పాత వైరం ఉందా? అసలు ఈ భగవంత్ కేసరి ఎవరు, అతను ఎందుకు జైలుకు వెళ్ళాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Bhagavanth-Kesari.jpg

విశ్లేషణ:

అనిల్ రావిపూడి సినిమాలు గనక చూస్తే అతని రచనే అతని బలం. అతను చేసిన ఆరు సినిమాల్లో వినోదాత్మక కథలకి కొంచెం యాక్షన్ జోడించి చెప్పినవే ఎక్కువ. ఈసారి అతను నందమూరి బాలకృష్ణ తో చేతులు కలిపాడు ఈ 'భగవంత్ కేసరి' అనే సినిమాకి. అనిల్ రావిపూడి ఈ సినిమా విజయం సాధిస్తుంది అని అంత విశ్వాసంగా వున్నాడు అనడానికి కారణం, ఈ సినిమాలో బాలకృష్ణని అతని వయసుకి తగ్గ పాత్రలో చూపించటం. అలాగే బాలకృష్ణ ముందు సినిమాలలో కాకుండా ఇందులో పెద్దగా అరిచే డైలాగులు, కేకలు, తొడగొట్టడాలు పెట్టకపోవడం. #BhagavanthKesariReview అలా అని పంచ్ డైలాగ్స్ లేకపోలేదు, అభిమానులకు సరిపడా చాలానే వున్నాయి. కానీ అవి ఇంతకు ముందు బాలకృష్ణ సినిమాలో వున్నట్టుగా కాకుండా కొంచెం నెమ్మదిగా చెప్తాడు. ఇంతకు ముందు చెప్పినట్టు అనిల్ రావిపూడి ముందు సినిమాలలో వినోదం పాలు ఎక్కువ ఉంటుంది, కానీ ఈ సినిమాలో అవి తగ్గించి భావోద్వేగాల మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. ఇంతెందుకు మొదటిసారి బాలకృష్ణని ఒక విభిన్నమైన, వైవిధ్యమైన పాత్రలో చూపించి మెప్పించగలిగాడు అనిల్ రావిపూడి.

కథ విషయానికి వస్తే అదేమీ కొత్తది కాదు, పాత కథే. కానీ అనిల్ రావిపూడి చెప్పే విధానం, దానికి బాలకృష్ణ నటించే విధానం బాగుంది. కథానాయకుడు ఒక విలన్ కారణంగా జైలుకి వెళతాడు, జైలు నుంచి బయటకి వచ్చాక తాను పెంచుకున్న పాపే తన జీవితం అని బతుకుతున్న అతనికి మళ్ళీ విలన్ తారసపడతారు, అప్పుడు వాళ్ళిద్దరి మధ్య వుండే పాత పగలు బయటకి వస్తాయి. నువ్వా, నేనా అని తేల్చుకుంటారు, ఇదీ కథ. అనిల్ రావిపూడి రచన, భావోద్వేగ సన్నివేశాలు, కథనం ఇలా ఈ సినిమాని నడిపిస్తాయి. #BhagavanthKesariReview మొదటి సగం అంతా భగవంత్ కి పాప కి మధ్య వున్న అనుబంధం, పాపని ఆర్మీ కి పంపాలన్న అతని ధ్యేయం, పాప అందుకు సిద్ధం కాకపోవటం ఇలా నడుస్తోంది. అలాగే బాలకృష్ణ, కాజల్ మధ్య వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. విశ్రాంతి సమయంలో ట్విస్ట్ ఒకటి ఉంటుంది. ఇక రెండో సగం అంతా విలన్ కి, బాలకృష్ణ కి మధ్య నడిచే పిల్లి, ఎలుకల ఆటలతో ఉంటుంది. అసలు నెలకొండ భగవంత్ కేసరి ఎవరు, విలన్ కి అతనికి ఎందుకు ఈ పగలు అనేవి అన్నీ దర్శకుడు రివీల్ చేస్తాడు.

రెండో సగంలో మళ్ళీ బాలకృష్ణ, శ్రీలీల (Sreeleela) మధ్య వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలతో కూడి బాగుంటాయి. అలాగే పాత ఎన్టీఆర్ సినిమాలో పాట 'కళ్ళలో కళ్ళు పెట్టి చూడు' నేపథ్యంలో బస్సులో తీసిన పోరాట సన్నివేశం అలరిస్తుంది, నవ్విస్తుంది. సందేశం ఇచ్చే సన్నివేశం కూడా వుంది, అది బాలకృష్ణతో చెప్పించటం బాగుంది. ఇంకా చివర్లో శ్రీలీల ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఆమె ఈ సినిమాకి ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ఇక థమన్ మూడు పాటలు తెరమీద చూడటానికి బాగుంటాయి, బాగా కోరియోగ్రఫీ కూడా చేశారు. ఇక రాంప్రసాద్ ఛాయాగ్రహణం కూడా చాలా బాగుంది, కథకి తగ్గట్టుగా వెళుతూ ఉంటుంది. అందరినీ బాగా చూపించాడు. అనిల్ రావిపూడి మాటలు చెప్పనవసరం లేదు, అదే అతని బలం. మొత్తం మీద అనిల్ రావిపూడి బాలకృష్ణని వైవిధ్యంగా చూపించి సఫలం అయ్యాడు అని చెప్పాలి.

Bhagavanth.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే బాలకృష్ణ భగవంత్ కేసరి పాత్రలో లీనమై చేశారు. అతను ఇంతకు ముందు చేసినట్టుగా కాకుండా ఈ పాత్రలో కొంచెం నెమ్మదిత్వం చూపించారు. భావోద్వేగ సన్నివేశాలలో, కాజల్ తో చేసిన సరదా సన్నివేశాలలో బాగా అలరించారు. తన వయసుకు తగ్గ పాత్ర కాబట్టి మొదటిసారిగా బాలకృష్ణలో ఒక వైవిధ్యం కనిపిస్తుంది. ఇక శ్రీలీల సినిమాలో ఇంకో హైలైట్. ఆమె సినిమా కథానాయకురాలు కాదు, ఒక ప్రముఖ పాత్రలో కనిపిస్తుంది. చాలా బాగా చేసింది, చిచ్చా అంటూ అల్లరి పిల్లగా, అలాగే చివర్లో అదే చిచ్చా అంటే తనకి ఎంత ప్రేమ, అభిమానం ఉన్నాయో చెప్పే సన్నివేశాల్లో కూడా బాగా నటించి చూపించింది. చిన్న వయసులోనే మంచి భావోద్వేగాలతో కూడిన పాత్ర ఆమెకి రావటం, అది ఆమె బాగా చేసి చూపించటం ఆమెకి ఛాలెంజ్ అని చెప్పాలి.

ఇక కాజల్ అగర్వాల్ (KajalAggarwal) కథానాయకురాలిగా కొన్ని సన్నివేశాల్లో కనపడుతుంది. అర్జున్ రాంపాల్ (ArjunRampal) వలన సినిమాకి ఎటువంటి ఉపయోగం లేదు, అతను ఇంకో బాలీవుడ్ విలన్ తెలుగులో చేసాడు అంతే. ఈ పాన్ ఇండియా మోజులో పడి విలన్ లాగా బాలీవుడ్ నటులకు బదులు తెలుగు నటుడిని పెడితే సినిమా ఇంకా బాగుండేది, తెలుగులో ఇంకా ఎక్కువ ఆడుతుంది కూడా. శరత్ కుమార్, జయచిత్రలు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. మిగతా వాళ్ళు అందరూ బాగానే సపోర్ట్ చేశారు. బ్రహ్మాజీ పాత్ర తళుక్కున మెరిసి మాయం అయిపోతుంది కానీ కథ మాత్రం అతని చుట్టూ తిరుగుతూ ఉంటుంది.

Sreeleela.jpg

చివరగా, 'భగవంత్ కేసరి' బాలకృష్ణ కెరీర్ లో ఒక వైవిధ్యమైన, కొత్తగా కనపడే నటుడిని చూస్తారు. తన వయసుకు తగ్గ పాత్రలో ఇంతకు ముందులా అరుపులు కేకలు తగ్గించి, కొంచెం సాత్వికంగా కనపడే బాలకృష్ణ ని చూస్తాం. శ్రీలీల ఈ సినిమాతో ఇంకో మెట్టు పైకి ఎక్కినట్టే, ఆమె సినిమాకి హైలైట్ అని చెప్పాలి. దర్శకుడు అనిల్ రావిపూడి వినోదం కొంచెం తగ్గించి, వ్యాపారవిలువలకి సందేశం ఇచ్చే కథని జోడించి, అందులో బాలక్రిష్ణని కొత్తగా ఆవిష్కరించిన విధానం సినిమా విజయానికి మూల కారణం. బాలకృష్ణ అభిమానులకి దసరా పండగకి వచ్చిన ఈ సినిమా విజయంతో పండగ సంబరాలు ఆకాశాన్ని అంటుతాయి అని చెప్పొచ్చు.

Updated Date - 2023-10-19T13:54:13+05:30 IST