Amigos film review: ఆశించినంతగా లేదు

ABN , First Publish Date - 2023-02-10T13:12:31+05:30 IST

హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఈమధ్య కాలంలో కొంచెం వైవిధ్యమయిన సినిమాలతో వస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram). అతని ముందు సినిమా 'బింబిసార' (Bimbisara) అతని కెరీర్ లో పెద్ద హిట్ గా నిలించింది. అందులో అతను ద్విపాత్రాభినయం చేస్తే, ఇప్పుడు అతను త్రిపాత్రాభినయం చేసిన సినిమా 'అమిగోస్' (Amigos film review) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Amigos film review: ఆశించినంతగా లేదు

సినిమా : అమిగోస్

నటీనటులు : నందమూరి కళ్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్, బ్రహ్మాజీ, జయప్రకాశ్, కళ్యాణి నటరాజన్, సప్తగిరి, తదితరులు

ఛాయాగ్రహణం : ఎస్. సౌందర్ రాజన్

సంగీతం : జిబ్రాన్

నిర్మాతలు : నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి

రచన, కథనం, దర్శకత్వం : రాజేంద్ర రెడ్డి

-- సురేష్ కవిరాయని

హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఈమధ్య కాలంలో కొంచెం వైవిధ్యమయిన సినిమాలతో వస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram). అతని ముందు సినిమా 'బింబిసార' (Bimbisara) అతని కెరీర్ లో పెద్ద హిట్ గా నిలించింది. అందులో అతను ద్విపాత్రాభినయం చేస్తే, ఇప్పుడు అతను త్రిపాత్రాభినయం చేసిన సినిమా 'అమిగోస్' (Amigos film review) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర కథా నేపధ్యం డాపిల్ గేంగర్ (Doppelganger), అంటే ఒకే మనిషిని పోలిన మనుషులు ఉండటం, అని విడుదలకు ముందే చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ (Mytri Movie Makers) ఈమధ్య పెద్ద పెద్ద చిత్రాలు తీసి విడుదల చేస్తున్నారు, మొన్న సంక్రాంతి పండగ నాడు కూడా వాళ్ళవే రెండు పెద్ద సినిమాలు విడుదల అయ్యాయి. ఇప్పుడు ఈ 'అమిగోస్' (Amigos Telugu movie) సినిమా కూడా వాళ్ళే నిర్మించారు. కన్నడ నటి అషికా రంగనాథ్ (Ashika Ranganath) ఈ సినిమాతో తెలుగులో ఆరంగేట్రం చేసింది. గిబ్రాన్ (Gibran) సంగీతం సమకూర్చగా, కళ్యాణ్ రామ్ మూడు పాత్రలు ఎలా చేసాడు, సినిమా ఎలా ఉందొ చూద్దాం. 'బింబిసార' విజయంతో ఈ 'అమిగోస్' మీద కొంచెం అంచనాలు పెరిగాయి.

10amigos1.jpg

Amigos story కథ:

సిద్ధార్థ్ (నందమూరి కళ్యాణ్ రామ్) హైదరాబాద్ లో తల్లిదండ్రులతూ ఉంటూ తండ్రి వ్యాపారం చూసుకుంటూ ఉంటాడు. ఇషిక (ఆషికా రంగనాథ్) అనే అమ్మాయిని మొదటి సారి చూడగానే, నాకేసి ఆమెని పెళ్లిచేసుకుందామని అనుకుంటాడు. తల్లిదండ్రులతో పెళ్లి చూపులు ఏర్పాటు చేయించి ఇషిక ఇంటికి వెళతారు, కానీ ఆమె ఒప్పుకోదు. ఈలోపు సిద్ధార్థ్ ఒక వెబ్ సైట్ లో తన పేరు చేర్చి తనలాగే ఎవరయినా ఉన్నారేమో అని చూసుకుంటాడు. అచ్చం తన రూపురేఖలతో వున్న మరో ఇద్దరు వ్యక్తులు, మైఖేల్ (కళ్యాణ్ రామ్), మంజునాథ్ హెగ్డేలను (కళ్యాణ్ రామ్) కలుస్తారు. ముగ్గురూ గోవా లో కలుద్దాం అనుకోని అక్కడ కలుస్తారు, కానీ ఇలా ముగ్గురు ఒకే రూపురేఖలతో ఉన్నట్టు ఎక్కడా బయటకి చెప్పరు. ఇంతలో ఒక ట్విస్ట్ మైఖేల్ అనే అతని అసలు పేరు బిపిన్ అని, అతను ఒక మాఫియా డాన్ అని, అతన్ని పట్టుకోవడానికి ఎన్ .ఐ.ఎ. ఆఫీసర్స్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఈలోపు బిపిన్ ఒక ఆఫీసర్ ని కూడా చంపి, తప్పించుకోవడానికి పెద్ద ప్లాన్ వేస్తాడు. ఇంతకీ అతను వేసిన ప్లాన్ ఏంటి? అతనిలా వున్న మిగతా ఇద్దరు అతని ప్లాన్ లో ఎలా ఇరుక్కున్నారు? అతని ప్లాన్ ఫలించిందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. (#AmigosFilmReview)

10amigos2.jpg

విశ్లేషణ:

దర్శకుడు రాజేందర్ రెడ్డి (Director Rajender Reddy) సినిమా విడుదలకి ముందే కథని కొంచెం బహిర్గతం చేసాడు. ఇది మనిషిని పోలిన మనుషులు వుంటారు ఈ ప్రపంచంలో, అలాంటి నేపధ్యం వున్న కథ అని. 'బింబిసార' లో కళ్యాణ్ రామ్ ఒక నెగటివ్ పాత్రలో కనపడితే, ఇందులో ఒక పాత్రలో పూర్తి విలన్ గా కనపడతాడు. దర్శకుడు తీసుకున్న భావన మంచిదే కానీ, అది తెర మీద చూపించటం లో కొంచెం విఫలం అయ్యాడనే చెప్పాలి. ఎందుకంటే మొదటి సగం లో కథ ఏమీ ముందుకు నడవదు, అలాగే ఆ లీడ్ పెయిర్ మీద ప్రేమ సన్నివేశాలు అంతగా పండవు. అదీ కాకుండా, కథానాయకురాలు పిచ్చి పిచ్చి ప్రశ్నలు, వాటినే మళ్ళీ మళ్ళీ ఆమె చేత చేయించి కొంచెం విసిగిస్తాడు దర్శకుడు.

ఇక ముగ్గురు ఒకేలా వున్న వ్యక్తులు తారసపడినప్పుడు ఆ సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉండాలి, కానీ ఆలా చెయ్యలేకపోయాడు దర్శకుడు. అదీ కాకుండా, సన్నివేశాలు ఎలా ఉంటాయి అన్నది ప్రేక్షకుడికి ముందే అర్థం అయిపోతూ ఉంటుంది. అందువల్ల ఏమి జరుగుతుంది అన్న ఆసక్తి లేకుండా పోతుంది. పోనీ అదీ కాకుండా, ఏమి జరుగుతుంతో తెలిసినా కూడా, ఆ సన్నివేశాల్ని రక్తి కట్టించటం లో దర్శకుడు సఫలీకృతుడు కాలేకపోయాడు. ఒక్క పాత్ర కూడా భావోద్వేగాలతో కూడినది లేకపోవటం వలన, ప్రేక్షకుడు ఆ పాత్రలకు తొందరగా కనెక్ట్ అవడు. చాలా సన్నివేశాల్లో సాగదీత ఎక్కువయింది. మొత్తం మీద సినిమాలో కొంచెం బాగుంది అంటే అది రెండో సగం మాత్రమే. అలాగే కథానాయకుడి మేనమామ గా వేసిన బ్రహ్మాజీ పాత్రతో ఎక్కువ కామెడీ సన్నివేశాలు చేయించి ఉంటే బాగుండేది. ఈ సినిమాలో అది కూడా మిస్ అయింది. సినిమాని చాల తొందరగా తీయాలన్న తపనతో తీసారేమో అనిపిస్తుంది, ఎందుకంటే కథ మీద అంత ఎక్కువ దృష్టి పెట్టలేదు.

10amigos3.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే, కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో విలన్ పాత్రలో కొత్తగా కనిపించాడు, బాగా చేసాడు కూడా. మాట తీరు, హావభావాలు ఆ పాత్ర కోసం కొంచెం మార్చాడు, అవన్నీ బాగున్నాయి. మిగతా రెండు పాత్రలు మామూలుగానే చేసాడు. అషికా రంగనాథ్ స్క్రీన్ మీద అందంగా కనపడింది, కానీ ఆమె పాత్ర సరిగా రాయలేదు దర్శకుడు. ఆమె పాత్ర కేవలం కొన్ని సన్నివేశాలకి, పాటకి మాత్రమే కుదించాడు. పాటలో చక్కగా కనపడింది ఆమె. బ్రహ్మాజీ (Brahmaji) కి పెద్ద రోల్ దొరికింది కానీ, అతని ప్రతిభకి తగ్గట్టుగా అతని పాత్ర రాయలేదు. అతన్ని సరిగ్గా వాడుకోలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే బ్రహ్మజీ వున్నప్పుడు కొన్ని హాస్య సన్నివేశాలు కూడా ఉంటే బాగుండేది. సప్తగిరి (Saptagiri) కూడా ఒక సన్నివేశం లో కనపడతాడు. జయప్రకాశ్ (Jayaprakash), కళ్యాణి నటరాజన్ (Kalyani Natarajan) తల్లిదండ్రులుగా ఎప్పుడూ చేసినట్టుగానే చేశారు.

ఇక సినిమాటోగ్రఫీ పరవాలేదు, పోరాట సన్నివేశాలు కూడా అంతంత మాత్రంగానే వున్నాయి. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమాలో పాట 'ఎన్నో రాత్రులొచ్చాయి గానీ' ఇందులో రీమిక్స్ చేశారు. అది స్క్రీన్ మీద చాలా బాగుంది అని చెప్పాలి. కొంత రిలీఫ్ కూడా ఆ పాటే. (#AmigosFilmReview)

చివరగా, 'అమిగోస్' అనే సినిమా కథ, భావన బాగుంది కానీ వాటిని తెర మీద ఆసక్తికరంగా చూపించటం లో దర్శకుడు రాజేందర్ రెడ్డి అంత సఫలం కాలేకపోయాడు. ఈ సినిమా మీద చాల అంచనాలతో వచ్చి చూస్తే మాత్రం నిరాశ చెందుతారు. ఎదో వైవిధ్యంగా ఉంటుంది అనుకోని, టైం పాస్ కోసం వస్తే ఒకే. ముఖ్యంగా రెండో సగం వలెనే సినిమా కొంచెం అయినా చూడగలం. (#AmigosFilmReview)

Updated Date - 2023-02-10T13:14:12+05:30 IST