2018 Film Review: కేరళ వరదల కథ !
ABN , First Publish Date - 2023-05-26T18:56:39+05:30 IST
కేరళ చలన చిత్ర పరిశ్రమలో ఈమధ్యనే విడుదలై సంచలనం సృష్టించిన సినిమా '2018'. ఈ సినిమా ఇప్పటికీ అక్కడ కలెక్షన్ల వరద సృష్టిస్తూనే వుంది. 2018 సంవత్సరంలో కేరళ రాష్ట్రాన్ని వరదలు చుట్టిముట్టినప్పటి పరిస్థితిని యథాతధంగా ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో సాంకేతిక నిపుణులు, నటీనటులు అందరూ బాగా సహకరించారు. చరిత్ర సృష్టించిన ఈ సినిమాని తెలుగు నిర్మాత బన్నీ వాసు తెలుగు ప్రేక్షకులకి చూపించాలని తెలుగులో విడుదల చేశారు.
సినిమా: 2018 Everyone Is A Hero (ప్రతి ఒక్కరూ హీరో)
నటీనటులు: టోవినో థామస్, అసిఫ్ అలీ, లాల్ (Lal), వినీత్ శ్రీనివాసన్, తన్వి రామ్, అపర్ణ బాలమురళి (AparnaBalaMurali), కున్‌చకో బోబన్, అజువర్గీస్త తదితరులు
సంగీతం: నోబిన్ పాల్
ఛాయాగ్రహణం: అఖిల్ జార్జ్
రచన, దర్శకత్వం: జూడ్ ఆంథనీ జోసెఫ్ (Jude Anthany Joseph)
నిర్మాతలు: వేణు కున్నప్పిళ్లై, సీకే పద్మ కుమార్, ఆంటో జోసెఫ్
-- సురేష్ కవిరాయని
ఈ ఓటిటి పుణ్యమా అని అన్ని భాషల చిత్రాలు ఇప్పుడు అందరూ చూస్తున్నారు. అలాగే మలయాళం సినిమాలు బుల్లితెర మీద చాల పెద్ద విజయం సాధించాయని చెప్పాలి. ఇలా సినిమాలు చూసి మలయాళం నటులను తెలుగు ప్రేక్షకులు ఫాలో అవుతున్నారు. ఆలా ఫాలో అవుతున్న నటుల్లో ఒకరు టోవినో థామస్(TovinoThomas). అతను నటించిన '2018' #2018FilmReview అనే సినిమా మలయాళంలో వందకోట్లకు పైగా వసూలు చేసి చరిత్ర సృష్టిస్తోంది. మలయాళంలో ఈ నెల 5న విడుదల అయిన ఈ సినిమా ఇంకా బాక్సాఫీస్ దగ్గర సంచలనమే సృష్టిస్తోంది. అక్కడ అంత సెన్సేషనల్ క్రియేట్ చేసిన ఈ సినిమాని నిర్మాత బన్నీ వాసు (BunnyVasu) తెలుగులోకి డబ్ చేయించి విడుదల చేశారు. ఇందులో అందరూ మలయాళం, తమిళ భాషలకి చెందిన నటులు వున్నారు.
2018 story కథ:
ఈ కథ 2018 లో కేరళ వరదలు వచ్చినప్పుడు జరిగింది. వరద భీభత్సం కేరళ రాష్ట్రాన్ని చుట్టిముట్టినప్పుడు చాలా ఊర్లు బయట వారితో సంబంధాలు కూడా తెగిపోవడంతో అప్పుడు అక్కడున్న ప్రజల్లో కొంతమంది ముందుకు వచ్చి చాలామంది ప్రజల ప్రాణాల్ని కాపాడుతారు. అందుకనే ఈ సినిమాకి ప్రతి ఒక్కరు హీరోనే అనే టేగ్ లైన్ పెట్టారు. అనూప్ (టోవినో థామస్)ది కేరళలోని చిన్న ఊరు, ఆర్మీలో ఆ రూల్స్ కి బయపడి మధ్యలో వుద్యోగం మానేసి దుబాయ్ వెళ్లిపోవడానికి వీసా కోసం ప్రయాతం చేస్తూ ఉంటాడు. అదే వూరికి టీచర్ గా వచ్చిన మంజు (తన్వి రామ్) అనే ఆమెతో పెళ్లి కుదురుతుంది. ఇంకో అతను నిక్సన్ (అసిఫ్ అలీ) ఆర్టిస్టు అవుదామని అనుకుంటాడు, అతని తండ్రి (లాల్), అన్నయ్య (నరైన్) సముద్ర తీరంలో చేపలు పడుతూ జీవనోపాధి చేసుకుంటూ వుంటారు. సేతుపతి (కలైయారసన్) అనే అతను ఒక లారీ డ్రైవర్, అతను కూడా కేరళలోని ఇంకో ప్రాంతానికి చెందినవాడు, అతని ఊరులో మంచినీరు దొరకక ప్రజలు ఇబ్బంది పడుతూ వుంటారు. ఒక ఫ్యాక్టరీ ని ధ్వసం చెయ్యడానికి బాంబులను అతను లారీలో దొంగతనంగా వేరే ప్రాంతానికి తరలించడానికి ఒప్పుకుంటాడు. కోషీ (అజు వర్గీస్) అనే అతను ఇంకో ప్రాంతానికి చెందిన టాక్సీ డ్రైవర్, ఫారెన్ జంటను కేరళ అందాలను చూపించడానికి టాక్సీలో ఎక్కించుకుంటాడు. వీళ్ళందరూ ఇలా కేరళలోని ఒక్కో ప్రాంతంలో పని చేసుకుంటూ ఉంటే, అకస్మాతుగా వచ్చిన వరదలు వలన రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది. అప్పుడు ఏమి జరిగింది, సహాయక చర్యలు ఎలా అందాయి, ఈ పైన చెప్పిన అందరూ ఆ వరద సహాయంలో ఎలా పాల్గొన్నారు? ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అన్నది ఈ సినిమా కథ.
విశ్లేషణ:
దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్ 2018లో కేరళ రాష్ట్రానికి వచ్చిన వరద భీభత్సాన్ని, దానివల్ల అతలాకుతలం అయిన ప్రజలు, కొన్ని గ్రామాలకు గ్రామాలు మునిగిపోవటం లాంటివి మళ్ళీ ఈ '2018' అనే సినిమా ద్వారా మళ్ళీ అలాగే చూపించాలని (రిక్రియెట్) అనుకున్నాడు. అందుకోసం ఒక మూడు సంవత్సరాలు కష్టపడ్డాడు. ఎందుకంటే ఈ సినిమాకి చాలా గ్రాఫిక్ వర్క్ కావాలి. ఈ సినిమాకి ఇద్దరు మెయిన్ పిల్లర్స్ ఒకరు సినిమాటోగ్రాఫర్, ఇంకొకరు గ్రాఫిక్ వర్క్ చేసేవాళ్ళు. ఎందుకంటే అప్పటి వరద భీభత్సాన్ని అలాగే చూపించాలంటే అది అంత సులువు కాదు. అలాగే ఈ వరదలు కేరళ రాష్ట్రాన్ని చుట్టిముట్టినప్పుడు ఎన్నో వీడియోస్, వార్తలు, ఫోటోలు ప్రజలు చూసారు. ప్రజలు చలించిపోయారు కూడా. అయితే ఈ సినిమాని కేరళలో ఎందుకు ఎక్కువ ఆదరించారు అంటే, అక్కడి ప్రజలు ప్రత్యక్షంగా ఈ వరదలను చూసారు, కష్టాలు అనుభవించారు, ఏమి జరిగిందో దగ్గరుండీ చూసారు. అందుకని అక్కడి ప్రేక్షకులకి ఇది బాగా నచ్చింది, సంచలనం సృష్టించింది.
అయితే ఇది తెలుగు ప్రేక్షకులకు నచ్చాలని ఏమీ లేదు, ఎందుకంటే ఈ సినిమాలో సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులకి అంత కనెక్టు కావు. ఎందుకంటే ఇవన్నీ మనం వీడియోల రూపంలో అప్పుడే చూసేసాం. దర్శకుడు ఎక్కడ తన పనితనం చూపించాడు అంటే, ఆ వరద సన్నివేశాలను అలాగే చూపించడం, ప్రజలలో మానవత్వం కింది అని చెప్పటం ద్వారా. చాలా గ్రామాలు నీటిలో మునిగిపోయి, బయటవాళ్ళతో కమ్యూనికేషన్ కూడా లేనప్పుడు, అక్కడ లోకల్ ప్రజలు హీరోలుగా మారారు. ఒకరికి ఒకరి ఎలా సాయపడ్డారు, మానవత్వం ఇంకా చచ్చిపోలేదు, బతికేవుంది అని చాలా బాగా చెప్పగలిగాడు ఈ సినిమా ద్వారా. ప్రభుత్వం సహాయం కోసం ప్రజలను కోరినప్పుడు సముద్రం మీద చేపలు పట్టే వారు తమ బోట్స్ ని తీసుకొని వరద ప్రాంతాలకు వెళ్లి ప్రజలను సురక్షితంగా చేర్చడం లాంటివి బాగుంటాయి. మొదటి సగం సినిమా అంతా ఆయా పాత్రలని పరిచయం చెయ్యడానికి సరిపోతుంది, రెండో సంగంలో ఈ పాత్రలన్నీ కలుపుతాడు. అయితే దర్శకుడు కొన్ని భావోద్వేగ సన్నివేశాలు రాస్తే, వాటిని సినిమాటోగ్రాఫర్ చాలా చక్కగా చిత్రీకరించాడు. ఇందులో నటీనటులు అందరూ బాగా చేశారు, ఆయా పాత్రల్లో సహజంగా చేసినట్టు కనిపిస్తుంది. అలాగే ఈ సినిమాకి సంగీతం ఒక ప్రత్యేక ఆకర్షణ.
'2018' అనే సినిమా ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వచ్చే ప్రకృతి భీభత్సం 2018 లో కేరళకి వచ్చినప్పుడు, అదే భీభత్సాన్ని దర్శకుడు, కెమరామెన్, గ్రాఫిక్ టీము, సంగీత దర్శకుడు అందరూ కలిసి దాన్ని అలాగే మళ్ళీ ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేసినందుకు అభినందించాల్సిందే. అలాగే ఇందులో హ్యూమన్ ఎమోషన్స్ చాలా ఉంటాయి. ఆ సమయంలో ఒకరికిఒకరు ఎలా సాయం చేసుకున్నారు అన్నది ఇంకో ముఖ్యమైన అంశం. అయితే తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు కనెక్టు అవుతారు అన్నదానిమీద ఈ తెలుగు సినిమా ఆధారపడి ఉంటుంది.