Tollywood 'Tara' Juvvalu : టాలీవుడ్‌ ‘తారా’జువ్వలు

ABN , First Publish Date - 2023-11-14T04:47:05+05:30 IST

దీపావళికి టపాసుల హోరు... టాలీవుడ్‌లో అప్‌డేట్స్‌ జోరు కొనసాగింది. పండుగ రోజు టాలీవుడ్‌లో సినిమా ప్రచార కార్యక్రమాలతో సందడి నెలకొంది. పలువురు అగ్రహీరోలు నటించిన సినిమాల...

Tollywood 'Tara' Juvvalu : టాలీవుడ్‌ ‘తారా’జువ్వలు

దీపావళికి టపాసుల హోరు... టాలీవుడ్‌లో అప్‌డేట్స్‌ జోరు కొనసాగింది. పండుగ రోజు టాలీవుడ్‌లో సినిమా ప్రచార కార్యక్రమాలతో సందడి నెలకొంది. పలువురు అగ్రహీరోలు నటించిన సినిమాల నుంచి స్పెషల్‌ అప్‌డేట్స్‌ మోతమోగింది. తమ అభిమాన హీరోలు ‘తారా’జువ్వల్లా వెలిగిపోతున్న ప్రచార చిత్రాలతో దీపావళి వినోదాల విందు పంచింది.

వెంకటేశ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న 75వ చిత్రం ‘సైంధవ్‌’. శైలేష్‌ కొలను దర్శకత్వంలో వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తొలి గీతాన్ని ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. దీపావళి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో వెంకటేశ్‌ డాన్సర్లతో కలసి స్టెప్పులేస్తూ కనిపించారు.

ఈగల్‌ వేట

రవితేజ హీరోగా రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఈగల్‌’. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. దీపావళి సందర్భంగా చిత్రబృందం కాన్సెప్ట్‌ పోస్టర్‌ను వదిలింది. ఎక్స్‌ట్రార్డినరీ లుక్‌లో రవితేజ ఆకట్టుకున్నారు.

భీమా యాక్షన్‌ మోడ్‌

గోపిచంద్‌ హీరోగా ఎ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భీమా’. కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో పోరాట సన్నివేశంలో గోపిచంద్‌ ఆకట్టుకున్నారు.

ఫ్యామిలీ స్టార్‌

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పరశురామ్‌ పెట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ దీపావళిని సెలబ్రేట్‌ చేసుకుంటున్న లుక్‌ ఆకట్టుకుంది. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

పవర్‌ ఆఫ్‌ సుబ్రహ్మణ్యం

సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘హరోం హర’. జ్ఞాన్‌సాగర్‌ దర్శకత్వంలో సుమంత్‌ జి నాయుడు నిర్మిస్తున్నారు. నవంబర్‌ 22న ‘పవర్‌ ఆఫ్‌ సుబ్రహ్మణ్యం’ పేరుతో ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు యూనిట్‌ తెలిపింది. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన ఫోస్టర్‌లో సుధీర్‌ సీరియస్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు.

హను-మాన్‌ పాట

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘హను-మాన్‌’. సంక్రాంతికి విడుదలవుతోంది. బాలల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి పాటను విడుదల చేస్తున్నట్లు యూనిట్‌ తెలిపింది. సాంగ్‌ పోస్టర్‌లో తేజ సజ్జా స్టైలిష్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు.

సలామ్‌ భాయ్‌...

రజనీకాంత్‌ కీలకపాత్ర పోషిస్తున్న చిత్రం ‘లాల్‌ సలామ్‌’. విష్ణువిశాల్‌, విక్రాంత్‌ హీరోలు. ఐశ్వర్యా రజనీకాంత్‌ దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. దీపావళి సందర్భంగా చిత్రబృందం ‘లాల్‌ సలామ్‌’ టీజర్‌ను విడుదల చేసింది. మొయిద్దీన్‌ భాయ్‌ పాత్రలో రజనీకాంత్‌ హిందూ ముస్లిం యువకుల మధ్య జరిగే గొడవలను ఎలా ఆపారనేది టీజర్‌లో ఆసక్తికరంగా అనిపించింది.

సలార్‌ సీజ్‌ ఫైర్‌

యావద్దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సలార్‌: పార్ట్‌ 1-సీజ్‌ ఫైర్‌’. ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ఈ చిత్రం క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 22న విడుదలవుతోంది. దీపావళి సందర్భంగా చిత్రబృందం స్పెషల్‌ అప్‌డేట్‌ను వదిలింది. డిసెంబర్‌ 1న ‘సలార్‌’ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో ప్రభాస్‌ జీప్‌పై నిల్చొని తుపాకితో కాల్పులు జరుపుతున్న దృశ్యం ఆకట్టుకుంది.

పుట్టిన రోజు.. రెండు లుక్కులు

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి, కన్నడ నటి రాధిక పుట్టిన రోజు సందర్భంగా ఆమె నటిస్తున్న రెండు చిత్రాలు ‘అజాగ్రత్త’ పోస్టర్‌ను, ‘బైరా దేవి’ టీజర్‌ను విడుదల చేశారు. ‘అజాగ్రత్త’ చిత్రాన్ని శశిధర్‌ నిర్మిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రాధిక పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఏడు భాషల్లో విడుదల చేశారు.

ఇక ‘బైరాదేవి’ చిత్రంలో కష్టాల్లో ఉండే ప్రజలను కాపాడే అఘోరగా రాధిక నటిస్తున్నారు. పోలీస్‌ ఆఫీసర్‌గా రమేశ్‌ అరవింద్‌ నటిస్తున్నారు. రాధిక సొంతంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ జై దర్శకుడు.

Updated Date - 2023-11-14T04:47:09+05:30 IST