చిల్లర వ్యక్తులు చేస్తున్న డ్రామా ఇది!

ABN , First Publish Date - 2023-03-06T00:43:52+05:30 IST

హాస్య నటుడు వేణు ఎల్దండి తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం ‘బలగం’. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ నుంచి వచ్చిన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. తెలంగాణ సంప్రదాయాల్ని బాగా చూపించారన్న కితాబు దక్కింది. అయితే..

చిల్లర వ్యక్తులు చేస్తున్న డ్రామా ఇది!

‘బలగం’ కాపీ ఆరోపణలపై వేణు

హాస్య నటుడు వేణు ఎల్దండి తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం ‘బలగం’. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ నుంచి వచ్చిన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. తెలంగాణ సంప్రదాయాల్ని బాగా చూపించారన్న కితాబు దక్కింది. అయితే.. ఈ కథపై కాపీ ఆరోపణలు వస్తున్నాయి. సతీష్‌ అనే రచయిత ‘బలగం కథ నాదం’టూ మీడియా ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో వేణు స్పందించారు. కేవలం ప్రచారం కోసం చిల్లర వ్యక్తులు చేస్తున్న డ్రామాగా కొట్టి పడేశారు. ‘‘సతీష్‌ రాసిన కథ నేనూ చదివాను. పేజీన్నర కథకూ, వందల పేజీల సినిమా స్ర్కిప్టుకీ తేడా లేదా? ‘బలంగం’ అనేది కథ కాదు. తెలుగువారి జీవితం. మన జీవితంలో జరిగే ఘటనలే సినిమాగా తీశాను. ఇందుకోసం ఆరేళ్లు నా కెరీర్‌ని పక్కన పెట్టి కష్టపడ్డాను. ఎంతోమందిని కలిసి వాళ్ల అనుభవాల్ని తెలుసుకొన్నాను. మాది చాలా పెద్ద కుటుంబం. దాదాపు వందమంది ఉంటారు. మా కుటుంబంలో జరిగిన మరణాలు, ఆ తరవాత జరిగిన అంతిమ సంస్కారాలు ఇవన్నీ ఈ కథ రాయడానికి దోహదం చేశాయి. స్వాతంత్య్ర పోరాటం గురించి ఎవరు ఏ పాయింట్‌ ఆఫ్‌ వ్యూ నుంచైనా సినిమా తీయొచ్చు. ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చిందని చూపించారు కాబట్టి.. ఆ కథ నాదే అని ఆరోపించడం ఎంత వరకూ సమంజసం? ఈ కథ నాది. సినిమా నాది. ఇలాంటి మంచి కథని సినిమాగా తీయాలని, తెలంగాణ సంస్కృతి అందరికీ తెలియాలని దిల్‌రాజు గారు పెద్ద మనసుతో సినిమా తీస్తే... ఆయనపై బురద చల్లడానికి ప్రయత్నించడం సమంజసం కాదు. ఈ సినిమాపై ఎవరికైనా అనుమానాలు ఉంటే నాతో మాట్లాడండి. నేనే సమాధానం చెబుతా. ఇక కాపీ గొడవ అంటారా... దానికి రచయితల సంఘం ఉంది. వాళ్లు ఎలాంటి తీర్పు ఇచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా’’ అన్నారు.

Updated Date - 2023-03-06T00:43:53+05:30 IST