నా కెరీర్‌లో ఉత్తమ గీతం ఇదే!

ABN , First Publish Date - 2023-03-09T01:21:25+05:30 IST

ఇరవై ఏళ్ల కెరీర్‌లో కల్యాణీ మాలిక్‌ చేసినవి 19 చిత్రాలే! అయితేనేం.. ‘ఐతే’, ‘అష్టా చమ్మా’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘జో అచ్యుతానంద’ ఇలా ప్రతీ ఆల్బమ్‌లోనూ మర్చిపోలేని పాటలు అందించారు...

నా కెరీర్‌లో ఉత్తమ గీతం ఇదే!

ఇరవై ఏళ్ల కెరీర్‌లో కల్యాణీ మాలిక్‌ చేసినవి 19 చిత్రాలే! అయితేనేం.. ‘ఐతే’, ‘అష్టా చమ్మా’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘జో అచ్యుతానంద’ ఇలా ప్రతీ ఆల్బమ్‌లోనూ మర్చిపోలేని పాటలు అందించారు. ఇప్పుడు ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’లోనూ మధురమైన మెలోడీలకు స్వరాలు ఇచ్చారు. ‘కనుల చాటు మేఘమా’ పాటకు మంచి స్పందన వస్తోంది. అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 17న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా కల్యాణీ మాలిక్‌ చెప్పుకొచ్చిన కబుర్లు..

  • ‘‘నా కెరీర్‌లో చాలా మంచి పాటలు చేసే అవకాశం వచ్చింది. సినిమా బాగున్నా, బాగోకపోయినా.. ‘పాటలు, సంగీతం బాగున్నాయి’ అనే పేరైతే సంపాదించుకోగలిగాను. ఇప్పటి వరకూ చేసిన పాటల్లో అత్యుత్తమ సంతృప్తి అందించింది.. ‘కనుల చాటు మేఘమా’. ఈ పాటకు వచ్చిన పేరు, గుర్తింపు ఇంతా అంతా కాదు. కేవలం ట్యూన్‌ ప్రకారమే కాదు. చక్కటి సందర్భం కుదిరింది. ప్రేమ చాలా రకాలుగా ఉంటుంది. ఇది మోహం లేని మధురమైన ప్రేమ. ఇలాంటి సందర్భానికి ఇప్పటి వరకూ పాట చేయలేదు. లక్ష్మీ భూపాల గారి సాహిత్యం, అబాస్‌ జోషి గానం చక్కటి మేళవింపుగా సాగింది. నా పాటలన్నీ సినిమాతో పాటు పేరు తెచ్చుకొన్నాయి. అయితే ‘కనుల చాటు మేఘమా’ మాత్రం ఇనిస్టెంట్‌గా నచ్చేసింది’’

  • ‘‘నిజానికి ఈ సినిమా కోసం మరో సంగీత దర్శకుడ్ని ఎంచుకొన్నారు. ఆయన ఒక పాట కూడా చేశారు. కానీ ఏమైందో... సడన్‌గా నాకు ఓ రోజు నిర్మాత నుంచి ఫోన్‌ వచ్చింది. ‘ఈ సినిమాకి పని చేస్తారా?’ అని అడిగారు. అవసరాల శ్రీనివా్‌సగారితో మంచి కంఫర్ట్‌ ఉంటుంది. ఇది వరకు ‘ఊహలు గుసగుసలాడే’, ‘జో అత్యుతానంద’లో మా కాంబినేషన్‌ బాగా సెట్టయ్యింది. ఈసారీ.. చక్కటి బాణీలు అందించే అవకాశం వచ్చింది’’

  • ‘‘నా నుంచి హిట్‌ పాటలొచ్చినా సరే, ఆ స్థాయిలో అవకాశాలు రాలేదు. అదెందుకో నాకు అర్థం కాలేదు. ‘బాస్‌’, ‘అధినాయకుడు’ లాంటి పెద్ద చిత్రాలకు పని చేశాను. అవి బాగా ఆడితే నా కెరీర్‌ మరోలా ఉండేదేమో..? అయినా ఎలాంటి నిరాశ లేదు. నా వరకూ ప్రతీ సినిమానీ ప్రేమించే పని చేస్తా. నా కెరీర్‌లో ఇప్పుడు మంచి ఫేజ్‌లో ఉన్నాననిపిస్తోంది. ‘ఇంటింటి రామాయణం’ అనే ఓ వెబ్‌ మూవీ చేశా. మరో రెండు చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. వెబ్‌ సిరీ్‌సకూ పని చేస్తున్నా. నా కెరీర్‌లో ఇంత వరకూ అవార్డులు రాలేదు. ఓ మంచి పాట వచ్చినప్పుడు ఓ నిర్మాతో, దర్శకుడో ఫోన్‌ చేసి.. ‘మీ పాట బాగుంది.. మనం కలిసి పని చేద్దాం’ అని అవకాశం ఇస్తే అదే నాకు పెద్ద అవార్డుగా భావిస్తా’’

Updated Date - 2023-03-09T01:21:27+05:30 IST