కుటుంబ ప్రేక్షకులు మెచ్చే చిత్రం అవుతుంది
ABN , First Publish Date - 2023-01-04T04:14:45+05:30 IST
తమిళ హీరో విజయ్ కథానాయకుడిగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ద్విభాషా చిత్రం ‘వారసుడు’. రష్మిక మందన్న కథానాయిక. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. నటుడు శ్రీకాంత్ కీలకపాత్ర పోషించారు...

తమిళ హీరో విజయ్ కథానాయకుడిగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ద్విభాషా చిత్రం ‘వారసుడు’. రష్మిక మందన్న కథానాయిక. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. నటుడు శ్రీకాంత్ కీలకపాత్ర పోషించారు. ఈ నెల 12న విడుదలవుతోన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
దర్శకుడు వంశీ పైడిపల్లి నా పాత్ర గురించి వివరించారు. ఇదొక చక్కని కుటుంబ కథా చిత్రం. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలను అద్భుతంగా తెరపైన ఆవిష్కరించే చిత్రం అవుతుందనే నమ్మకం అప్పుడే కలిగింది. నటుడిగా నాకు తమిళంలో ఇదే తొలి చిత్రం. ఆ భాషపైన అంతగా పట్టులేదు. అందుకే నా పాత్రకు డబ్బింగ్ చెప్పలేదు. విజయ్‌కు సోదరుడి పాత్రలో నటించాను. చాలా కీలకమైన పాత్ర నాది.
కుటుంబ వారసత్వం అందుకునే క్రమంలో ముగ్గురు అన్నదమ్ముల మధ్య జరిగే ఘర్షణ నేపథ్యంలో కథ సాగుతుంది. సినిమా దృశ్యకావ్యంలా ఉంటుంది. మరో సోదరుడిగా కిక్ శ్యామ్ కనిపిస్తారు. మా అన్నదమ్ములకు మరదలి పాత్రలో రష్మిక నటించారు. కుటుంబ సభ్యుల మధ్య చిచ్చుపెట్టే వ్యక్తిగా ప్రకాష్‌రాజ్ కనిపిస్తారు.
అన్నదమ్ముల అనుబంధం, భావోద్వేగాల నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ మధ్య ప్రేక్షకులను ఆకట్టుకునే కుటుంబ కథా చిత్రాలు రావడం తగ్గింది. ఆ లోటును ఈ చిత్రం తీరుస్తుంది. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూశాం అని ప్రేక్షకులు అనుకుంటారు. మంచి సినిమాతో తమిళంలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది.
విజయ్ లాంటి అగ్రహీరోతో నటించడం ఆనందంగా ఉంది. నాకు గతంలోనే ఆయనతో పరిచయం ఉంది. చాలా సైలెంట్‌గా ఉంటారు. ఎక్కువ మాట్లాడరు. క్యారవాన్ వాడరు. సెల్‌ఫోన్ దగ్గర ఉంచుకోరు. ఒకసారి సెట్‌లో అడుగుపెడితే ప్యాకప్ చెప్పేదాకా అక్కడి నుంచి కదలరు. చాలా అంకితభావంతో పనిచేస్తారు. సీన్ బాగా రావడానికి సెట్స్‌లో విజయ్ కష్టపడేతీరు నాకు బాగా నచ్చింది. ఆయనకూ, నాకూ మధ్య సినిమాలో పోటాపోటీ సన్నివేశాలు ఉన్నాయి. వంశీ పైడిపల్లి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్. చాలా స్పష్టతతో పనిచేస్తారు. పనిలో రాజీపడరు. నటీనటుల నుంచి తనకు కావాల్సింది రాబట్టుకోగల నేర్పు ఉంది.
జయసుధ, శరత్‌కుమార్, సంగీత... ఇలా ఎక్కువమంది నటీనటులు అందరూ ప్రేక్షకులకు తెలిసినవాళ్లే అవడం వల్ల పక్కా తెలుగు సినిమాలా ఉంటుంది. సినిమా ప్రారంభం నుంచి ముగింపు దాకా నా పాత్ర ఉంటుంది. ‘అఖండ’ తర్వాత డిఫరెంట్‌గా ఉండాలని ఈ పాత్ర చేశాను.
ఇప్పుడు చాలా సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. మన తెలుగు సినిమాలు తమిళనాట విజయాలు అందుకుంటున్నాయి. సంక్రాంతి సినిమాల పండగ కూడా. ఒక సినిమాకు మరో సినిమా ఎప్పుడూ పోటీ కాదు. అన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారు.
దిల్‌రాజు బేన ర్‌లో నాకు ఇది రెండో చిత్రం. ప్రస్తుతం రామ్‌చరణ్-శంకర్ చిత్రంలోనూ నటిస్తున్నాను. హీరో, విలన్, సహాయనటుడు... ఇలా ప్రేక్షకుల్లో గుర్తింపు లభించే ఏ పాత్ర అయినా చేస్తాను.