Natu Natu song on Oscar stage : ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాట!
ABN , First Publish Date - 2023-03-02T00:29:31+05:30 IST
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డుల వేడుకకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ సారి భారతదేశం ముఖ్యంగా తెలుగు వారు మరింత ఆసక్తితో...

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డుల వేడుకకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ సారి భారతదేశం ముఖ్యంగా తెలుగు వారు మరింత ఆసక్తితో ఈ ఫంక్షన్ కోసం ఎదురు చూడడానికి కారణం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఒరిజినల్ సాంగ్ విభాగం కోసం నామినేట్ కావడమే. ఈ నేపథ్యంలో ప్రతి తెలుగు వాడూ గర్వంగా చెప్పుకొనే ఓ తీపి కబురుని ద అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కమిటీ మంగళవారం రాత్రి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అదేమిటంటే ‘నాటు నాటు’ పాటను ఆస్కార్ అవార్డ్ వేదికపై గాయకులు రాహుల్ సింప్లిగంజ్, కాలభైరవ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తారని. అంత పెద్ద వేదికపై తెలుగు పాట పాడి వినిపించే అవకాశం రావడం తెలుగు సినిమాకు, సినిమా సంగీతానికి నిజంగా అరుదైన గౌరవమే. ఈ నెల 12న జరిగే ఈ అపూర్వ సన్నివేశం కోసం యావత్ భారతదేశం ఇప్పటినుంచీ ఆసక్తిగా ఎదురుచూస్తుందంటే అతిశయోక్తి కాదు. ఈ వార్త తెలియగానే గాయకుడు రాహుల్ సింప్లిగంజ్ ఆనందానికి అవధులు లేవు. ‘ఆస్కార్ వేదికపై పాట పాడే రోజు నా జీవితంలోనే మరిచిపోలేని మధుర జ్ఞాపకంలా మిగిలిపోతుంది’ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు రాహుల్. ‘నాటు నాటు ’పాటను చంద్రబోస్ రాయగా, కీరవాణి స్వరపరిచిన విషయం తెలిసిందే.