ఇక నుంచి నా పేరు మారుతుంది
ABN , First Publish Date - 2023-09-23T01:53:31+05:30 IST
‘‘రంగస్థలం చూశాక నన్నంతా ‘రంగమ్మత్త.. రంగమ్మత్త’ అని పిలవడం మొదలెట్టారు. ‘పెదకాపు’లోని నా పాత్ర చూశాక.. నా పేరు మారుతుంది....

‘‘రంగస్థలం చూశాక నన్నంతా ‘రంగమ్మత్త.. రంగమ్మత్త’ అని పిలవడం మొదలెట్టారు. ‘పెదకాపు’లోని నా పాత్ర చూశాక.. నా పేరు మారుతుంది. ఇక నుంచి అంతా ఆ పాత్ర పేరుతోనే పిలుస్తార’’న్నారు అనసూయ. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన చిత్రం ‘పెదకాపు’. విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈనెలాఖరున విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన అనసూయ ఏమన్నారంటే..
‘‘శ్రీకాంత్ అడ్డాల కుటుంబ కథా చిత్రాలు బాగా తీస్తారు. ఆయన్నుంచి ‘పెదకాపు’ లాంటి సబ్జెక్ట్ నేనస్సలు ఊహించలేదు. కథ వినగానే నాకు బాగా నచ్చేసింది. నా పాత్ర మరింత బాగా నచ్చింది. నేనెప్పుడూ కొత్త తరహా పాత్రల కోసం ఎదురు చూస్తుంటాను. నటిగా నాకు పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా ఇది’’.
‘‘నా ఆహార్యం విషయంలోనూ చిత్రబృందం చాలా జాగ్రత్తలు తీసుకొంది. మేకప్ కూడా కొత్తగా ఉంటుంది. మేక్‌పలో ఇన్ని టెక్నిక్స్ ఉంటాయా? అనేది ఈ సినిమాతో నాకు అర్థమైంది. పాత్ర పరంగా కొన్ని బోల్డ్ డైలాగులు ఉంటాయి’’.
‘‘విరాట్ కర్ణకు ఇదే తొలి సినిమా. బయట చాలా అమాయకంగా ఉంటాడు. కెమెరా ముందుకు వస్తే పాత్రలో లీనమైపోతాడు. తనని అందరూ ప్రభా్‌సతో పోలుస్తున్నారు. కానీ.. విరాట్ తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ సంపాదించుకొంటాడు’’.
‘‘మహిళా పాత్రలు చాలా బలంగా, శక్తిమంతంగా రాశారు శ్రీకాంత్ అడ్డాల. ఆయన ఓ కీలక పాత్ర కూడా పోషించారు. ఆయనలో ఈ కోణం కూడా ఉందా? అని మరోసారి ఆశ్చర్యపోయాను. ‘పెదకాపు’లో నటించిన నటీనటులందరికీ మంచి పేరు వస్తుంది. ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంది. దాని కోసం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’.