బబుల్‌గమ్‌తో అది మొదలైంది
ABN , Publish Date - Dec 28 , 2023 | 01:15 AM
‘ప్రేమకథలు, మాస్, కామెడీ అంశాలు ఉన్న చిత్రాలు చేయడానికి నేను ఇష్టపడతాను. ఇప్పటివరకూ ఇచ్చింది ఇచ్చేశాను. ఇకపై నన్ను నేను కొత్తగా ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తాను...

‘ప్రేమకథలు, మాస్, కామెడీ అంశాలు ఉన్న చిత్రాలు చేయడానికి నేను ఇష్టపడతాను. ఇప్పటివరకూ ఇచ్చింది ఇచ్చేశాను. ఇకపై నన్ను నేను కొత్తగా ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తాను.. అని ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చెప్పాను. అది ‘బబుల్‌గమ్’తో మొదటైంది’ అన్నారు సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాలను హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన ‘బబుల్‌గమ్’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆ చిత్ర సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల మీడియాతో ముచ్చటించారు.
ఈ సినిమాలో హీరో డీజే. నేను గిటారిస్ట్‌ను. నా ఫ్రెండ్స్ అందరూ దాదాపు డీజేలే. ఎలకా్ట్రనిక్ మ్యూజిక్‌లోనే చాలా లేయర్స్ ఉంటాయి. వాటిపై చిన్నప్పటి నుంచి పరిశీలన ఉంది. ఇప్పుడీ చిత్రంతో అలాంటి సంగీతం అందించే అవకాశం వచ్చింది కనుక పాత్రకు తగ్గట్లు మ్యూజిక్ చేశాను.
రవికాంత్ పేరేపు స్కూల్ డేస్ నుంచి నాకు తెలుసు. తను తీసిన షార్ట్ ఫిల్మ్స్‌కు నేను సంగీతం సమకూర్చాను. అలాగే మా కాంబినేషన్‌లో వచ్చిన ‘కృష్ణ అండ్ లీల’ చిత్రం కూడా మంచి విజయం సాదించింది. ఇప్పుడు ‘బబుల్‌గమ్’లో కూడా అద్భుతమైన సంగీతం కుదిరింది. సినిమా నాకు బాగా నచ్చింది. ఇప్పటి వరకూ చూసిన వాళ్లు కూడా బాగుందన్నారు. మ్యూజిక్ పరంగా ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్, పాటలు విని ఎంజాయ్ చేశారు.
రోషన్ చాలా డెడికేటెడ్. తనలో చాలా ప్రతిభ ఉంది. మంచి నటుడు, డాన్సర్ కూడా, ఎమోషన్స్ చక్కగా పలికించాడు. తను డబ్బింగ్ చెప్పిన తీరు కూడా బాగుంది.