ఛాలెంజింగ్ రోల్ చేశా
ABN , First Publish Date - 2023-09-26T01:22:58+05:30 IST
‘నాకు ‘పెదకాపు 1’ చిత్రం రీ ఇంట్రడక్షన్ అని చెప్పాలి. ఇంతకుముందు ‘మనుచరిత్ర’లో నటించా. తర్వాత కొవిడ్ వచ్చింది. దాంతో ముంబై వెళ్లిపోయా. ఇప్పుడు ఈ సినిమా ఆడిషన్ కోసం వచ్చి సెలెక్ట్ అయ్యా’ అన్నారు ప్రగతి శ్రీవాస్తవ....

‘నాకు ‘పెదకాపు 1’ చిత్రం రీ ఇంట్రడక్షన్ అని చెప్పాలి. ఇంతకుముందు ‘మనుచరిత్ర’లో నటించా. తర్వాత కొవిడ్ వచ్చింది. దాంతో ముంబై వెళ్లిపోయా. ఇప్పుడు ఈ సినిమా ఆడిషన్ కోసం వచ్చి సెలెక్ట్ అయ్యా’ అన్నారు ప్రగతి శ్రీవాస్తవ. ఆమె కథానాయికగా నటించిన ‘పెదకాపు 1’ ఈ నెల 29న విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. ‘కథ నాకు చాలా నచ్చింది. మొదటి నుంచి చివరి వరకూ సస్పెన్స్‌తో చాలా క్యాచీగా ఉంటుంది. ఇందులో నా పాత్ర చాలా కీలకం. నాదే కాదు సినిమాలో దాదాపు అన్ని పాత్రలకూ ప్రాధాన్యం ఉంది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సినిమాలు చూశాను. ఆయన సినిమాల్లో హీరోయిన్ ప్రాతలు చాలా బలంగా ఉంటాయి. ఈ సినిమాలో కూడా అంతే. నటిగా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న నాకు సవాల్‌తో కూడిన పాత్ర చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. పల్లెటూరి నేపథ్యం కలిగిన ఈ పాత్రను ఇంత ఈజ్‌తో చేస్తానని అనుకోలేదు. ఆ క్రెడిట్ దర్శకుడు శ్రీకాంత్ గారిదే’ అని చెప్పారామె. ‘షూటింగ్‌కు ముందే వర్క్ షాప్ జరిగింది. ముందుగానే రీసెర్చ్ చేసుకున్నాం. స్టయిలింగ్ టీమ్ కూడా అద్భుతంగా పని చేసింది. ప్రతి పాత్ర గురించి ముందే క్లారిటీగా చెప్పడంతో అందరూ బాగా చేసే అవకాశం దొరికింది. విరాట్ కర్ణ చాలా బాగా చేశాడు. ఈ సినిమాలో తన పాత్ర ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. అందరూ ఆ పాత్రతో కనెక్ట్ అవుతారు. తన పెర్ఫార్మెన్స్ బ్రిలియంట్‌గా ఉంటుంది’ అని చెప్పారు ప్రగతి. ప్రస్తుతం తను ‘గం గం గణేశా’ చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పారు.