పవన్ కల్యాణ్‌ను చూసి చాలా నేర్చుకున్నాను
ABN , First Publish Date - 2023-07-19T00:47:38+05:30 IST
‘మాది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. సరైన సలహాలు ఇచ్చేవాళ్లు లేరు. అందుకే తొలి చిత్రంతో మంచి గుర్తింపు వచ్చినా కెరీర్ ఆశించిన విధంగా ముందుకెళ్లలేదు...

‘మాది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. సరైన సలహాలు ఇచ్చేవాళ్లు లేరు. అందుకే తొలి చిత్రంతో మంచి గుర్తింపు వచ్చినా కెరీర్ ఆశించిన విధంగా ముందుకెళ్లలేదు. ఇప్పుడు పాత్రలు, సినిమాల విషయంలో సరైన నిర్ణయం తీసుకోగలుగుతున్నాను’ అని హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్ అన్నారు. పవన్ కల్యాణ్, సాయితేజ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘బ్రో’ చిత్రంలో ఆమె ముఖ్యపాత్ర పోషించారు. ఈ నెల 28న ‘బ్రో’ విడుదలవుతున్న సందర్భంగా ప్రియా చెప్పిన సినిమా విశేషాలు.
సముద్రఖని గారు ఫోన్ చేసి ‘బ్రో’ సినిమా లుక్‌టెస్ట్ కోసం రమ్మన్నారు. ఆ పాత్ర కోసం చాలా మంది పేర్లు పరిశీలించి, చివరకు నన్ను ఎంపిక చేశారు. నా లాంటి కొత్త నటికి ఇంత పెద్ద ప్రాజె క్ట్‌లో అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది అగ్రనటులతో ఒకట్రెండు సన్నివేశాల్లో నటించినా చాలు, చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇదొక మంచి కుటుంబ కథా చిత్రం.
చిన్నప్పటి నుంచి నాకు గొప్పనటి కావాలనే ఆశ ఉంది. ఆ దిశగానే నా ప్రయాణం సాగుతోంది. కె రీర్ ప్రారంభంలోనే పవన్ కల్యాణ్‌తో కలసి నటించే అవకాశం రావడం ఆశీర్వాదంగా భావిస్తున్నాను. సినిమాలో ఆయన కాంబినేషన్‌లో నాకు సన్నివేశాలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ తన నటనతో మ్యాజిక్ చేస్తారు. ఆయన సెట్‌లో అడుగుపెడితే మాటల్లో చెప్పలేని గొప్ప అనుభూతి కలుగుతుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది ఆయన్ను చూసి నేర్చుకున్నాను.
సాయితేజ్ సెట్స్‌లో చాలా సరదాగా ఉంటాడు. షూటింగ్‌లో మంచి స్నేహితులమయ్యాం.
‘బ్రో’లో నా పాత్ర పేరు వీణ. నా గత చిత్రాలతో పోలిస్తే ఇందులో కొత్తగా కనిపిస్తాను. తనకు ఏం కావాలో, నటీనటుల నుంచి ఏం రాబట్టుకోవాలో సముద్రఖనికి తెలుసు. ఆయన సినిమాలో పనిచేయగలిగినందుకు ఆనందంగా ఉంది.