ఇక కామెడీ సినిమాలే తీస్తా
ABN , First Publish Date - 2023-06-06T02:08:54+05:30 IST
రచయితగా మంచి పేరు తెచ్చుకొన్న ‘డైమండ్’ రత్నబాబు... ‘బుర్రకథ’తో దర్శకుడిగా మారారు. ఆ తరవాత ‘సన్నాఫ్ ఇండియా’ తెరకెక్కించారు...

రచయితగా మంచి పేరు తెచ్చుకొన్న ‘డైమండ్’ రత్నబాబు... ‘బుర్రకథ’తో దర్శకుడిగా మారారు. ఆ తరవాత ‘సన్నాఫ్ ఇండియా’ తెరకెక్కించారు. ఇప్పుడు ‘అన్‌స్టాపబుల్’ అంటూ నవ్వులు పంచడానికి రెడీ అయ్యారు. విజె.సన్ని, సప్తగిరి కథానాయకులుగా నటించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా రత్నబాబు చెప్పిన ‘అన్‌స్టాపబుల్’ కబుర్లు.
‘‘నా బలం కామెడీ. ‘సీమశాస్త్రి’, ‘పిల్లా నువ్వులేని జీవితం’లాంటి సినిమాలు నాకు మంచి పేరు తీసుకొచ్చాయి. దర్శకుడిగా నేను సీరియస్ కథల్ని ఎంచుకొన్నాను. అందుకే సరైన ఫలితాలు రాలేదు. ఆ తప్పు ఈసారి చేయలేదు. రెండుగంటల పాటు ప్రేక్షకుల్ని నవ్వించాలన్న ఉద్దేశంతోనే ‘అన్‌స్టాపబుల్’ సినిమా తీశా. ఇకపై కామెడీ సినిమాలే చేస్తా’’
‘‘కామెడీ సినిమాలకు కథ అవసరం లేదనుకొంటారు. కానీ ఈ సినిమా అలా ఉండదు. ప్రతి పది నిమిషాలకూ ఓ కొత్త పాత్ర వస్తూనే ఉంటుంది. చివరికి ఆ పాత్రలన్నీ కనెక్ట్ అవుతాయి. ఏ పాత్రా వృధా కాదు. సినిమా మొత్తం చూశాక కామెడీతో పాటుగా స్క్రీన్‌ప్లే గురించి కూడా మాట్లాడుకొంటారు. చిత్రసీమలోని హాస్యనటులంతా ఈ సినిమాలో ఉన్నారు. ఒక్క బ్రహ్మానందంగారిని మిస్ అయ్యాం. మా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి ఆయన వచ్చి ఆశీర్వదించారు. దాంతో ఆ లోటు తీరిపోయింది’’.
‘‘ప్రతి రచయితలోనూ దర్శకుడు ఉంటాడు. ప్రతీ దర్శకుడిలోనూ రచయిత ఉంటాడు. తమిళనాట కథలు రాసేవాళ్లకే దర్శకులుగా అవకాశాలు ఇస్తున్నారు. ఇక్కడా ఆ ట్రెండ్ మొదలైంది. రచయితలంతా దర్శకులైతే మంచి కథలు వస్తాయని నా నమ్మకం. యువ రచయితలకు నేను ఇచ్చే సలహా కూడా ఇదే’’.