ప్రభాస్‌తో పోల్చడం సంతోషమే!
ABN , First Publish Date - 2023-09-28T00:26:48+05:30 IST
‘‘నేను చిన్నప్పుడు పైలెట్ అవ్వాలనుకొన్నాను. క్రికెటర్ కావాలని కలలు కన్నాను. కానీ ఓ ఊహ వచ్చిన తరవాత సినిమాలపై ఇష్టం ఏర్పడింది. ఏం సాధించినా ఇక్కడే చేయాలి.. అనే పట్టుదల పెరిగింది...

‘‘నేను చిన్నప్పుడు పైలెట్ అవ్వాలనుకొన్నాను. క్రికెటర్ కావాలని కలలు కన్నాను. కానీ ఓ ఊహ వచ్చిన తరవాత సినిమాలపై ఇష్టం ఏర్పడింది. ఏం సాధించినా ఇక్కడే చేయాలి.. అనే పట్టుదల పెరిగింది. చివరికి హీరోగా మారాను’’ అన్నారు విరాట్ కర్ణ. ఆయన కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘పెదకాపు 1’. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా విరాట్ చెప్పిన ‘పెదకాపు’ ముచ్చట్లు.
‘‘జయ జానకీ నాయక చిత్రానికి ప్రొడక్షన్‌లో పని చేశా. కానీ మనసంతా నటనపై ఉండేది. ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకొన్నా. సత్యానంద్ గారి దగ్గర ఆరు నెలలు శిక్షణ తీసుకొన్నా. ఆ తరవాత స్నేహితులతో కలిసి ఓ వీడియో చేశా. అందులో నాకేం వచ్చో.. అవన్నీ ప్రదర్శించా. అది చూసి మా ఇంట్లోవాళ్లకు నాపై నమ్మకం వచ్చింది. మా బావ మిర్యాల రవీందర్ రెడ్డి నన్ను శ్రీకాంత్ అడ్డాల గారి దగ్గరకు తీసుకెళ్లారు. అలా.. ‘పెదకాపు’ మొదలైంది’’.
‘‘నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డిగారు లేకపోతే... ఈ సినిమా ఈ స్థాయిలో ఉండేది కాదు. కథపై ఆయనకు విపరీతమైన నమ్మకం. అందుకే ఇంత భారీ ఎత్తున ఖర్చు పెట్టారు. ఒకవేళ ఇందులో హీరో నేను కాకపోయినా.. ఇదే స్థాయిలో తీసేవారు. నాపై పెడుతున్న పెట్టుబడి, ఈ సినిమాలో పని చేస్తున్న టెక్నీషియన్లని చూసి నాకు భయం వేసేది. ‘నేను కష్టపడాలి.. అప్పుడే నాపై పెట్టుకొన్న నమ్మకం నిజం చేయొచ్చు’ అనే ధ్యాసతో పనిచేశా’’.
‘‘నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఆయన కూడా సత్యానంద్ శిష్యుడే. వారిద్దరూ ఫోన్లో మాట్లాడుకొంటున్నప్పుడు నేను పక్కనుంచి ప్రభాస్ గొంతు వినేవాడ్ని. ‘ఈ కుర్రాడు కూడా నీలానే ఉన్నాడు’ అంటూ ప్రభా్‌సతో సత్యానంద్ అన్నారు. ఆ పోలిక నాకు మరింత సంతోషాన్ని ఇచ్చింది. ప్రస్తుతం నా దృష్టంతా ‘పెదకాపు’ ఫలితంపై ఉంది. త్వరలోనే ‘పెదకాపు 2’ షూటింగ్ ప్రారంభిస్తాం’’.