Eighteen hours of practice : నాటు నాటు పాటకు పద్దెనిమిది గంటల ప్రాక్టీస్‌

ABN , First Publish Date - 2023-03-17T00:59:36+05:30 IST

‘ఆస్కార్‌ వేదికపై ‘నాటునాటు’ సాంగ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చే అవకాశం నాకు రావడం చాలా గర్వంగా ఉంది’ అన్నారు అమెరికన్‌ నటి, డాన్సర్‌ లారెన్‌ గొట్టిలెబ్‌. ఇటీవల ఆస్కార్‌ వేడుకలో బాలీవుడ్‌ నటి దీపిక ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌.’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటను...

Eighteen hours of practice : నాటు నాటు పాటకు పద్దెనిమిది గంటల ప్రాక్టీస్‌

అమెరికన్‌ నటి లారెన్‌ గొట్టిలెబ్‌

‘ఆస్కార్‌ వేదికపై ‘నాటునాటు’ సాంగ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చే అవకాశం నాకు రావడం చాలా గర్వంగా ఉంది’ అన్నారు అమెరికన్‌ నటి, డాన్సర్‌ లారెన్‌ గొట్టిలెబ్‌. ఇటీవల ఆస్కార్‌ వేడుకలో బాలీవుడ్‌ నటి దీపిక ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌.’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటను పరిచయం చేస్తూ ‘ఆ పాటను ఇప్పుడు ఈ వేదికపై చూసేయండి’ అనగానే ఓ బృందం వేదికపైకి వచ్చి, ఆ పాటను అద్భుతంగా ప్రదర్శించి, అందరి కరతాళ ధ్వనులు అందుకొంది. ఆ రోజు అలా ప్రదర్శన ఇచ్చింది లారెన్‌ బృందమే. ఈ ప్రదర్శనలో ఫిమేల్‌ లీడ్‌ ఆమే!

గురువారం తన ఇన్‌స్టా లో ఇందుకు సంబంధించిన ఫొటోను లారెన్‌ పోస్ట్‌ చేసి ఆనాటి విషయాలను పంచుకున్నారు. ‘మా ప్రదర్శన పూర్తి కాగానే అందరూ లేచి నిలబడి చప్పట్లతో అభినందించడం నేను మరిచిపోలేను. ఈ పాటలో అద్భుతంగా డాన్స్‌ చేసిన ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ సైతం నన్ను, నా బృందాన్ని మెచ్చుకోవడం మరింత ఆనందం కలిగించింది.

‘ప్రేమ్‌ రక్షిత్‌ సార్‌.. మీరు అద్భుతంగా కంపోజ్‌ చేసిన పాటను ఆస్కార్‌ వేదికపై ప్రదర్శించినందుకు గర్వంగా ఉంది. కేవలం 18 గంటల్లోనే ఆ పాటను ప్రాక్టీసు చేశాం. ప్రదర్శన అనంతరం మేం వార్డ్‌రోబ్‌లోకి వెళ్లినప్పుడు ‘నాటునాటు’ పాటకు ఆస్కార్‌ అవార్డ్‌ వచ్చిందని ప్రకటించారు. నేను, మా వాళ్లు అక్కడినుంచి చప్పట్లు కొట్టి, అరిచి గోల చేశాం. పదేళ్లుగా ఇండియాలో ఎన్నో వేదికలపై ఎన్నో పాటలను ప్రదర్శించాను కానీ ఓ తెలుగు సినిమా పాటకు నృత్యం చేయడం ఇదే ప్రథమం’ అన్నారు లారెన్‌.

మర్చిపోలేని బహుమతి ఇచ్చారు

తన బాల్యం నుంచి అమితంగా ఆరాధిస్తున్న సంగీతకారుడు రిచర్డ్‌ కార్పెంటర్‌ నుంచి వచ్చిన ప్రశంసకు కీరవాణితో కంటతడి పెట్టించింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ పాటను స్వరపరిచిన కీరవాణి ఆస్కార్‌ వేదికపై కార్పెంటర్స్‌ బ్యాండ్‌ రూపొందించిన ‘టాప్‌ ఆఫ్‌ ది వరల్డ్‌’ సాంగ్‌ను ఆలపించడంతో పాటు బాల్యం నుంచి కార్పెంటర్‌ సాంగ్స్‌ వింటూ పెరిగానని చెప్పారు. తను సంగీతం వైపుకు రావాలనే స్ఫూర్తిని ఇచ్చిన వ్యక్తులుగా వారిని కొనియాడారు. దీనిపై రిచర్డ్‌ కార్పెంటర్‌ గురువారం సోషల్‌ మీడియాలో స్పందించారు. తన కూతుళ్లతో కలసి ఆయన కీరవాణి, చంద్రబోస్‌ను అభినందిస్తూ ‘టాప్‌ ఆఫ్‌ ది వరల్డ్‌’ గీతాన్ని ఆలపిస్తున్న వీడి యోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. దీనిపై రాజమౌళి స్పందిస్తూ ‘మీ వీడియో చూసి అన్నయ్యకు సంతోషంతో కన్నీళ్లు వచ్చాయ’ని చెప్పారు. ఆస్కార్‌ అవార్డు ప్రకటించినప్పుడు కూడా అన్నయ్య ఇంత భావోద్వేగానికి లోనవ్వలేదు, మీ పోస్ట్‌ ఆయన్ను కదిలించింది, కంటతడి పెట్టుకున్నారని తెలిపారు. ఈ వీడియో రూపంలో మా కుటుంబానికి మర్చిపోలేని బహుమతి ఇచ్చారు, ఇదొక గొప్ప అనుభవం అని రిచర్డ్‌ కార్పెంటర్‌కు రాజమౌళి దన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2023-03-17T00:59:54+05:30 IST