ఆ గొంతు మూగబోయింది
ABN , First Publish Date - 2023-01-27T23:42:37+05:30 IST
ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎ.శ్రీనివాసమూర్తి (55) చెన్నైలో కన్నుమూశారు. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో స్థానిక కడంబాడినాయకర్‌లోని ఆయన నివాసంలో ఒక్కసారిగా గుండెపోటుకు గురై, కుప్పకూలిపోయారు.
డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి కన్నుమూత
ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎ.శ్రీనివాసమూర్తి (55) చెన్నైలో న్నుమూశారు. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో స్థానిక కడంబాడినాయకర్‌లోని ఆయన నివాసంలో ఒక్కసారిగా గుండెపోటుకు గురై, కుప్పకూలిపోయారు. ఆ వెంటనే స్థానిక విజయ హాస్పిటల్‌కు తరలించినా ఫలితం లేకుండా పోయింది. శ్రీనివాసమూర్తికి భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. తండ్రి ఏవీఎన్ మూర్తి నేపథ్యగాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు. చెన్నైలో పుట్టి పెరిగిన శ్రీనివాసమూర్తి తన డబ్బింగ్ కెరీర్‌ను 1990లో ప్రారంభించారు. ముఖ్యంగా తమిళ అగ్రహీరోలు సూర్య, అజిత్, విక్రమ్, జయరాం వంటి వారికి తెలుగు డబ్బింగ్ చెప్పడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. హీరో సూర్యకు శ్రీనివాసమూర్తి గొంతు అచ్చుగుద్దినట్టుగా సరిపోయింది. ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో మోహన్ లాల్ పాత్రకు డబ్బింగ్ చెప్పి ఆ పాత్రకు ప్రాణం పోశారు. హీరో విక్రమ్ నటించిన ‘అపరిచితుడు’లోని విభిన్న పాత్రలకు కూడా ఈయనే డబ్బింగ్ చెప్పారు. అజిత్ నటించిన ‘విశ్వాసం’, ఆర్.మాధవన్ తాజాగా నటించిన ‘రాకెట్రీ’ చిత్రాలకు గాత్రం అందించారు. ఆయన కెరీర్‌లో దాదాపు 1500లకు చిత్రాలలో వివిధ పాత్రలక డబ్బింగ్ చెప్పారు. ‘అపరిచితుడు’లో విక్రమ్ పాత్రకు గొంతు మార్చి డబ్బింగ్ చెప్పడంలో శ్రీనివాసమూర్తి నైపుణ్యం కనిపిస్తుంది. తెలుగులో కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేశారు. ముఖ్యంగా హీరోల బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా ఆయన డబ్బింగ్ చెప్పేవారు. తన వాయి్‌సతో పాత్రలకు మరింతగా గాంభీర్యాన్ని చేకూర్చేవారు. పలు వాణిజ్య ప్రకటనల్లో బాలీవుడ్ నటులు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లకు కూడా తెలుగు డబ్బింగ్ చెప్పారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. శ్రీనివాసమూర్తి భౌతికకాయానికి అంత్యక్రియలు శనివారం జరుగుతాయి.