Costume Krishna RIP : కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూత
ABN , First Publish Date - 2023-04-03T01:33:26+05:30 IST
తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకొంది. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్, నటుడు, నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ (86) ఆదివారం వేకువజామున 1.40 గంటల సమయంలో చెన్నైలో కన్నుమూశారు..

తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకొంది. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్, నటుడు, నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ (86) ఆదివారం వేకువజామున 1.40 గంటల సమయంలో చెన్నైలో కన్నుమూశారు. ఆయన అసలు పేరు మాదాసు కృష్ణ. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యల కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. ఇటీవల కాలికి తగిలిన గాయానికి చిన్నపాటి ఆపరేషన్ చేయించారు. ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నారు కూడా. అయితే ఉన్నట్టుండి శ్వాస పీల్చడంలో సమస్యలు రావడంతో ఆయన కన్నుమూశారని కాస్ట్యూమ్ కృష్ణ కుమారుడు రవిప్రసాద్ తెలిపారు. కాస్ట్యూమ్ కృష్ణకు భార్య ఎం.భారతి, కుమారులు చంద్రశేఖర్, రవి ప్రసాద్‌తో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరి స్వస్థలం వైజాగ్‌లోని లక్కవరపుకోట గ్రామం. ఆయన అంత్యక్రియలు సోమవారం ఉదయం చెన్నై గిండీలోని శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.
టైలరింగ్‌తో మొదలు...
రాజమండ్రిలో తన అన్నగారితో కలిసి టైలరింగ్ వృత్తి చేసుకుంటూ వచ్చిన మాదాసు కృష్ణ ఉపాధి కోసం చెన్నైకి వచ్చిన తొలి నాళ్ళలో టైలర్‌గానే కొనసాగారు. ఆ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్ సంస్థలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేరారు. దీంతో ఆయనకు ‘సురేష్ కృష్ణ’ అనే పేరొచ్చింది. సినీరంగంలో హీరో కృష్ణ ఉండటంతో ఆయనపై అభిమానం కలిగిన ఎం.కృష్ణ తన పేరును కాస్ట్యూమ్ కృష్ణగా మార్చుకుని, ఆ పేరుతోనే స్థిరపడిపోయారు. దివంగత నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణతోపాటు వాణిశ్రీ, శ్రీదేవి, జయసుధ, జయప్రద, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సహా ఎంతోమంది నటీనటులకు ఆయన కాస్ట్యూమ్స్ సమకూర్చారు. ఆనాటి ట్రెండ్‌కు అనుగుణంగా బెల్ బాటం నుంచి బ్యాగీ ప్యాంట్ వరకు రకరకాల మోడల్స్ దుస్తులను అందించారు. దీనితో కాస్ట్యూమ్ డిజైనర్‌గా కృష్ణకు మంచి పేరుతో పాటు గుర్తింపు, కష్టానికి తగిన ప్రతిఫలం కూడా దక్కాయి.
నట ప్రస్థానం
సుధీర్ఘకాలం పాటు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన ఎం.కృష్ణ.. 1991లో వచ్చిన ‘భారత్ బంద్’ చిత్రంలో విలన్‌గా నటించి తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించి అనేక చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన చిత్రాల్లో ‘పెళ్ళాం చెబితే వినాలి’, ‘పోలీస్ లాకప్’, ‘అల్లరి మొగుడు’, ‘దేవుళ్ళు’, ‘మా ఆయన బంగారం’, ‘విలన్’, ‘శాంభవి ఐపీఎస్’, ‘పుట్టింటికి రా చెల్లి’ వంటి సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన చిత్రాల్లో మంచి పాత్రలు దక్కాయి.
నిర్మాతగా...
కాస్ట్యూమ్ డిజైనర్‌గా, నటుడుగా మంచి పేరు, గుర్తింపు సొంతం చేసుకున్న కృష్ణ.. అనంతరం నిర్మాతగా అవతారమెత్తారు. జగపతిబాబు, పృథ్వి, రాశి నటించిన ‘పెళ్ళిపందిరి’ చిత్రాన్ని నిర్మించారు. అనుష్క నటించిన ‘అరుంధతి’ చిత్రాన్ని తెలుగు నుంచి కన్నడంలోకి రీమేక్ చేశారు. ఇలా ఏడెనిమిది చిత్రాలను ఆయన సొంతంగా నిర్మించారు.
ఆంధ్రజ్యోతి, చెన్నై