ఆపదొస్తే ఆంజనేయ.. ఆకలేస్తే ఆవకాయ్!
ABN , First Publish Date - 2023-11-29T01:11:24+05:30 IST
తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘హను - మాన్’. ప్రశాంత్ వర్మ దర్శకుడు. అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. కె.నిరంజన్ రెడ్డి నిర్మాత...

తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘హను - మాన్’. ప్రశాంత్ వర్మ దర్శకుడు. అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. కె.నిరంజన్ రెడ్డి నిర్మాత. ఈ చిత్రం నుంచి ‘ఆవకాయ ఆంజనేయ’ అనే గీతాన్ని మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. అనుదీప్ దేవ్ స్వర పరచిన పాట ఇది. సింహాచలం మన్నెల రాశారు. సాహితీ ఆలపించారు. ఈ సందర్భంగా తేజా సజ్జా మాట్లాడుతూ ‘‘మనకి ఆపదొస్తే ఆంజనేయ, ఆకలేస్తే ఆవకాయ్ గుర్తొస్తాయి. ఇది మన కల్చర్. దానికి వాణిజ్య అంశాలు మేళవించి ప్రశాంత్ వర్మ ఓ అద్భుతమైన కథగా మలిచారు. ఈ సంక్రాంతికి ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయబోతోంద’’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇప్పటి వరకూ నేను చేసిన చిత్రాల్లో అత్యంత వినోదాత్మక చిత్రమిదే. ‘ఆంజనేయ ఆవకాయ’ పాట కూడా నాకు ప్రత్యేకం. ఎందుకంటే ఈ పాటతోనే ‘హను - మాన్’ చిత్రీకరణ మొదలెట్టాం. ఈ సినిమా గురించి ప్రేక్షకుల్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. వాటన్నింటికీ త్వరలోనే ఒకొక్కటిగా సమాధానం ఇస్తాం. క్లీన్ ఇమేజ్‌తో రాబోతున్న సినిమా ఇది. ధూమపానం, మద్యపానం ఎక్కడా చూపించలేదు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంద’’న్నారు. జనవరి 12న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.