Anati Ayena Hara: ఆనతి ఆయెనా హరా!
ABN , First Publish Date - 2023-02-05T06:53:38+05:30 IST
ఆమెను చేరిన స్వరం... సువర్ణంలా మెరిసింది. భాషా బేధం లేని గాత్రం... త్రివర్ణ పతాకంలా దేశమంతా ఎగిరింది. ‘ఊ..’ అన్నా ‘కుహూ... కుహూ’ రాగమైంది. ‘ఉహూ..’ అన్నా పాట ఆమె వశమైంది...

ఆమెను చేరిన స్వరం... సువర్ణంలా మెరిసింది.
భాషా బేధం లేని గాత్రం... త్రివర్ణ పతాకంలా దేశమంతా ఎగిరింది.
‘ఊ..’ అన్నా ‘కుహూ... కుహూ’ రాగమైంది.
‘ఉహూ..’ అన్నా పాట ఆమె వశమైంది.
‘తెలిమంచు కరిగింది తలుపు తీయవా ప్రభూ..’ అని పిలిచిన సుమధుర గళం... ఇప్పుడు స్వర్గానికి చేరింది.
ఆ దారి పొడవున కువకువలు స్వాగతం పలుకుతాయ్..
తన కాలి అలికిడికి మెరుపులు వందనం చేస్తాయ్.
ఆ పూల రాగాలు.. వాణీ సంగతులకు పులకించి పోతాయి.
ఆ చరణ కిరణాలు పలకరించి.. పవళించే భువనాలు పల్లవిస్తాయి.
ఇన్ని అద్భుతాల్ని పరిచయం చేసిన గాత్ర మహత్యానికి... స్వర్గపు ద్వారాలు తెరచుకోకుండా ఎందుకుంటాయ్..?
ఇప్పటి నుంచి వాణీ జయరామ్ కచ్చేరీలన్నీ అక్కడే కావొచ్చు. కానీ తన స్మృతులు, శ్రుతులు.. అన్నీ ఇక్కడే.. మన మధ్యే కీరవాణి రాగంలో కబుర్లు చెబుతుంటాయి. హంస ధ్వనిలో విహరిస్తుంటాయి. శంకరాభరణంలా మిరిమిట్లు గొలుపుతుంటాయు. ఆనంద భైరవిలో ఆనందాన్ని పంచుతాయ్. ఎందుకంటే... అమృతం తాగిన వాళ్లే కాదు..
గానామృతం కురిపించిన వాణీ జయరామ్ కూడా చిరంజీవే. ఆమె పాటలకు అమృతానికి మించిన మహత్తుంది.
తమిళనాడులోని వేలూరులో 1945 నవంబరు 30న పద్మావతి, దొరైస్వామి అయ్యంగార్ దంపతులకు జన్మించిన వాణి జయరామ్ అసలు పేరు కలైవాణి. పదకొండు మంది పిల్లల్లో ఆమె ఎనిమిదో సంతానం. ఆమె పుట్టగానే జాతకం చూపిద్దామని ఓ సిద్ధాంతి దగ్గరకి వెళ్లారు వాళ్ల నాన్న దొరై స్వామి. ‘మీ పాప భవిష్యత్‌లో పెద్ద గాయని అవుతుంది. అందుకే కలైవాణి అని పేరు పెట్టండి’ అని ఆయన సూచించడంతో ఆ పేరే నిర్ణయించారు. ఒక రకంగా చెప్పాలంటే వాణీ జయరామ్‌ది సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. వాళ్ల అమ్మ పద్మావతి చక్కగా పాడేవారు. వీణ కూడా వాయించేవారు. వాణీ జయరామ్ అక్కలు కూడా సంగీత ప్రియులే. అలాంటి సంగీత కుటుంబంలో పుట్టడంతో చిన్నతనం నుంచే గీతాలాపన అంటే ఆసక్తి ఏర్పడింది. వాళ్ల ఇంట్లో సంగీతం అంటే శాస్త్రీయ సంగీతమే. సినిమా పాటలు వినడం వారి ఇంట్లో నిషిద్దం. సినిమా పాటలు విన్నా, పాడినా శాస్త్రీయ సంగీతానికి అవమానం జరిగినట్లు భావించేవారు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో వాణీ జయరామ్‌కు సినిమా పాటలంటే ఆసక్తి ఏర్పడింది. ఇంట్లో ఓ రేడియో ఉండేది. రేడియో సిలోన్ లో వచ్చే హిందీ పాటలు అంటే ఆమె చెవి కోసుకొనేవారు. రేడియోలో పాటలు వస్తుంటే చాలా తక్కువ సౌండ్ పెట్టుకుని ఎవరికీ వినిపించకుండా, కనిపించకుండా ఓ మూల కూర్చుని వినేవారు వాణీ జయరామ్. ఎప్పటికైనా సినిమా పాటలు పాడాలని అప్పుడే అనుకున్నారామె. ఎనిమిదేళ్ల ప్రాయంలోనే ఆమె మద్రా్‌సలోని ఆలిండియా రేడియోలో తొలిసారిగా పాట పాడడం విశేషం.
బ్యాంకు ఉద్యోగిగా
చెన్నైలోని క్వీన్‌మేరీ్‌స కళాశాలలో డిగ్రీ పొందిన ఆమె.. స్టేట్ బ్యాంక్‌లో ఉద్యోగం సంపాదించారు. 1967లో ఆమె హైదరాబాద్ బ్రాంచ్‌కి బదిలీ అయ్యారు. 1969లో వాణికి జయరామ్‌తో వివాహమైంది. అత్తగారిది కూడా సంగీత కుటుంబమే కావడంతో ఆమె సంగీత సాధనకు ఎలాంటి అవాంతరం లేకుండాపోయింది. ఆమె అత్త కర్ణాటక సంగీత గాయని పద్మాస్వామినాధన్. భర్త ముంబైలో ఉండడంతో వాణీ జయరామ్ అభ్యర్థన మేరకు బ్యాంకు వారు ఆమెను ముంబైకి బదిలీ చేశారు. వాణి గాన నైపుణ్యాన్ని గ్రహించిన జయరామ్. ఆమె హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం నేర్చుకునేందుకు సంగీత విద్వాంసుడు ఉస్తాద్ అబ్దుల్ రెహ్మాన్‌ఖాన్ వద్ద చేర్పించారు. ఆయన వద్ద పొందిన కఠోరమైన శిక్షణ వల్ల వాణి బ్యాంకు ఉద్యోగానికి స్వస్తి చెప్పి, సంగీతాన్ని తన వృత్తిగా స్వీకరించేలా చేసింది. రెహ్మాన్‌ఖాన్ శిక్షణలో తుమ్రీ, గజల్, భజన్ వంటి వివిధ స్వరరూపాల సూక్ష్మ నైపుణ్యాలను కూడా నేర్చుకున్నారు. అదే ఒరవడిలో 1969లో ముంబైలో తన తొలి కచేరీ ఇచ్చారు. అదే ఏడాది గాయకుడు కుమార్ గంధర్వతో కలిసి మరాఠీ ఆల్బమ్ రికార్డ్ చేస్తున్న స్వరకర్త వసంత్ దేశాయ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆమె స్వరాన్ని విన్న దేశాయ్.. అదే ఆల్బమ్‌లో ‘రుణానుబంధ చా’ అనే పాట పాడించారు. ఈ ఆల్బమ్ మరాఠీ సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. అదే ఆమెను సినీసంగీతం వైపు మళ్లించింది. 1970లో ‘గుడ్డీ’ అనే చిత్రంలో తొలిసారి పాట పాడారు. అందులో ఆమె పాడిన ‘బోలో రే’ పాట అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత ఆమె పండిట్ రవిశంకర్ సంగీతం అందించిన ‘మీఠా’ చిత్రంలో పాడారు. ఆ తరువాత ఇక ఆమె వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేకుండాపోయింది. 1973లో విడుదలైన ‘అభిమానవంతుడు’ చిత్రం ద్వారా వాణి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో ‘ఎప్పటి వలే కాదురా’ అంటూ వాణి జయరామ్ పాడిన పాటను నర్తకి శోభానాయుడుపై చిత్రీకరించారు. ఎస్.ఎం. సుబ్బయ్య నాయుడు చొరవతో తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎ్‌స. విశ్వనాథన్ సంగీత దర్శకత్వంలో పాడిన ‘మల్లిగై ఎన్ మన్నన్ మయంగుమ్’ వంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలు పాడి మంచి పేరు సొంతం చేసుకున్నారు. కె.బాలచందర్ తీసిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్రంలోని పాటలు దక్షిణభారతదేశంలో వాణికి మంచి గుర్తింపుతో పాటు జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టాయి. అనంతరం శంకరాభరణం, స్వాతికిరణం చిత్రాల్లో పాటలకూ ఆమెకు జాతీయ అవార్డులు వచ్చాయి. ‘ఆనతినియరా హరా...’, ‘తెలిమంచు కరిగింది..’, ‘ఎన్నెన్నో జన్మల బంధం..’ వంటి పాటలతో ఆమె ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు.
కొత్త హీరోయిన్లకు ఆమే తొలి గాయని
తమిళంలో దర్శకుడు కె. బాలచందర్ రూపొందించిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్రం వాణీ జయరామ్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. అందులో పాడిన పాటలకు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు. తెలుగులో ‘శంకరాభరణం’ చిత్రంతో రెండోసారి జాతీయ అవార్డ్ అందుకొన్నారు. అదే ఏడాది హిందీలో ‘మీరా’ చిత్రం విడుదలైంది. అందులోని 14 పాటలు వాణీ జయరామ్ పాడడం విశేషం. పండిట్ రవిశంకర్ ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు.
ఏదైనా కొత్తగా పాడించాలన్నా, కష్టమైన స్వరకల్పన ఉన్నా వాణీ జయరామ్‌తో పాడించాలి.. అనుకొనే వారు ఆ రోజుల్లో. ‘నాతో ఓ పాట పాడించండీ’ అని ఆమె ఏ రోజూ ఎవరినీ అడిగిన సందర్భాలు లేవు. సంగీత దర్శకులందరూ ఎంతో అభిమానంతో ఆమెని పిలిపించేవారు. పాట పాడించేవారు. మరో విషయమేమిటంటే చాలా మంది హీరోయిన్ల తొలి చిత్రాలకు వాణీ జయరామ్ పాటలు పాడడం! శ్రీదేవి తొలి తమిళ, హిందీ చిత్రాలకు ఆమే పాటలు పాడారు. అలాగే షబనా ఆజ్మీ, జుహీ చావ్లా, పర్వీన్ బాబీ, జయబాధురీ తొలి చిత్రాలకు ఆమె పాటలు పాడారు. కొత్త నటీనటులతో సినిమా తీస్తుంటే అందులో పాటలు కూడా సరికొత్త గొంతుతో పాడిస్తే బాగుంటుందని వాణీ జయరామ్‌కు కబురు చేసేవారు.
దక్షిణభారత మీరా
వాణి జయరామ్‌కు దేశవిదేశాలకు చెందిన పలు అవార్డులు వచ్చాయి. ‘గుడ్డీ’ సినిమాలో పాడినందుకు మియా తాన్‌సేన్ అవార్డు వచ్చింది. అనంతరం తమిళనాడు ప్రభుత్వం నుంచి ‘కలైమామణి’, త్యాగరాజ భాగవతార్ జీవిత సాఫల్య పురస్కారం, సంగీత పీఠ్ సమ్మాన్ అవార్డు, కాముకర అవార్డు, ముద్రా అకాడమీ అవార్డు, సుబ్రమణ్య భారతి అవార్డు, రేడియో మిర్చీ జీవిత సాఫల్య పురస్కారం, కణ్ణదాసన్ అవార్డు, ఘంటసాల జాతీయ పురస్కారం, సుబ్బులక్ష్మి అవార్డుతో పాటు వివిధ దేశాలకు చెందిన పలు సంస్థల నుంచి సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు. ఆమెను చాలామంది ‘దక్షిణభారత మీరా’గా అభివర్ణిస్తారు. దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు గుజరాత్, ఒడిశా, మహారాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఆమెను అవార్డులతో సత్కరించడం విశేషం.
19 భాషల్లో
ఆమె తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడ, హిందీ, గుజరాతీ, మరాఠీ, మర్వారీ, హర్యాన్వి, బెంగాలీ, ఒరియా, ఇంగ్లీష్, భోజ్‌పురీ, రాజస్థానీ, బడగ, ఉర్దూ, సంస్కృతం, పంజాబీ, తుళు వంటి 19 భాషల్లో సుమారు 11 వేల పాటల్ని ఆలపించారు. ఎన్నో ఆల్బమ్‌లు రూపొందించారు. ఆమె భర్త జయరామ్ 2018లో కన్ను మూయడంతో ఆమె ఒంటరిగానే జీవిస్తున్నారు. సంతానం లేకపోవడంతో బంధుమిత్రులతోనే ఆమె కాలక్షేపం చేస్తున్నారు.
ఆ పురస్కారం స్వీకరించకుండానే..
సుమధుర గాయనిగా పేరొందిన వాణి జయరామ్‌కు 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గత నెల 25వ తేదీన కేంద్రప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారం ప్రకటించింది. ఈ అవార్డును స్వీకరించేందుకు కేంద్రం నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్న ఆమె ఇంతలోనే కన్ను మూయడంతో ఆమె అభిమానులు, సంగీతప్రియులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వాణి జయరామ్ మృతి పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై, సంగీత దర్శకులు దేవా, దీనా తదితరులు తీవ్ర సంతాపం ప్రకటించారు.