Jiah Khan Suicide Case: అన్యాయం జరిగిందంటూ తల్లి ఆవేదన!
ABN , First Publish Date - 2023-04-28T15:57:44+05:30 IST
బాలీవుడ్ కథానాయిక ‘గజినీ’ ఫేమ్ జియాఖాన్ ఆత్మహత్య కేసులో ముంబై సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది.
బాలీవుడ్ కథానాయిక ‘గజినీ’ ఫేమ్ జియాఖాన్ (jiah Khan) ఆత్మహత్య కేసులో ముంబై సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న సూరజ్ పంచోలీని (Sooraj Pancholi) నిర్దోషిగా ప్రకటిస్తూ శుక్రవారం సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. సరైన సాక్ష్యాలు లేనందున అతడిని నిర్దోషిగా ప్రకటించింది. జియాఖాన్‌కు న్యాయం జరగాలంటూ ఆమె తల్లి రబియా పదేళ్ల నుంచి న్యాయ పోరాటం చేస్తున్నారు. కోర్టు తీర్పుతో ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు. న్యూయార్క్‌లో పుట్టిన జియాఖాన్.. సినిమాల్లో రాణించాలనే కోరికతో ముంబై వచ్చారు. రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘నిశ్శబ్ద్’తో నటిగా పరిచయమయ్యారు. ‘గజినీ’లో సెకండ్ హీరోయిన్గా కనిపించి గుర్తింపు పొందారు. నటిగా రాణిస్తోన్న సమయంలోనే నటుడు సూరజ్ పంచోలీతో ప్రేమలో పడింది. 2013 జూన్ 3న ఆమె తను నివశిస్తున్న అపార్ట్మెంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొంది. మరణానికి ముందు ఆరుపేజీల సూసైడ్ నోట్‌ను రాసింది. సూరజ్‌తో సహజీవనంలో సమస్యల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. (Jiah Khan Suicide Case)
అయితే, తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేలా సూరజ్ చేశాడంటూ జియాఖాన్ తల్లి రబియా పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకుని.. దర్యాప్తు చేశారు. ఇరు వర్గాల వాదన అనంతరం సీబీఐ కోర్టు సూరజ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ నేడు తీర్పునిచ్చింది. ముంబై కోర్టు ఇచ్చిన తీర్పుతో జియాఖాన్ తల్లి ఆవేదనకు గురయ్యారు. మరోసారి తన బిడ్డకు అన్యాయం జరిగిందని వాపోయారు. జియాఖాన్ ‘నిశ్శబ్ద్’, గజినీ, హౌస్‌ఫుల్ చిత్రాలతో అలరించారు.