Nikhat zareen: ఆయనతో ఆ మూమెంట్ నేను ఎప్పటికీ మరిచిపోలేను

ABN , First Publish Date - 2023-04-16T12:22:27+05:30 IST

పదమూడేళ్ల వయసులోనే బాక్సింగ్‌ రింగ్‌లోకి అడుగుపెట్టి, తన పవర్‌ఫుల్‌ పంచ్‌లతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ బుల్లెట్‌లా దూసుకుపోతోంది... యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌.

Nikhat zareen: ఆయనతో ఆ మూమెంట్ నేను ఎప్పటికీ మరిచిపోలేను

పదమూడేళ్ల వయసులోనే బాక్సింగ్‌ రింగ్‌లోకి అడుగుపెట్టి, తన పవర్‌ఫుల్‌ పంచ్‌లతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ బుల్లెట్‌లా దూసుకుపోతోంది... యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌. ఇటీవల ఢిల్లీలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పసిడిని సాధించి.. వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా అవతరించిన ఈ యువ బాక్సర్‌ చెబుతున్న విషయాలివి..

పెళ్లెలా అవుతుందన్నారు

చిన్నప్పటి నుంచి అందిరి కంటే భిన్నంగా ఉండాలనుకునేదాన్ని. అందుకే బాక్సింగ్‌ను నా కెరీర్‌గా ఎంచుకున్నా. ‘ఆడపిల్లవి.. మగపిల్లలు ఆడే ఆటలు నీకెందుకు.. ముఖంపై దెబ్బలు తగిలితే నిన్నెవరైనా పెళ్లి చేసుకుంటారా?’ అని మొదట్లో చాలా మంది అన్నారు. షార్ట్స్‌ వేసుకున్నా విమర్శించేవాళ్లు. కానీ మా నాన్న వాళ్ల మాటలను పట్టించుకోకుండా ఎప్పుడూ నన్ను ప్రోత్సహించేవారు.

భాయ్‌ని కలిసిన వేళ..
బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌కు నేను పెద్ద అభిమానిని. ఆయన్ను ఒక్కసారైనా కలవాలన్నది నా చిన్ననాటి కల. ఆయన్ని కలిసిన క్షణం చాలా భావోద్వేగానికి గురయ్యాను. ‘సాథియా తూనే క్యా కియా’ పాటను రీక్రియేట్‌ చేస్తూ సల్మాన్‌తో కలసి డ్యాన్స్‌ చేయడం నేను ఎప్పటికీ మరిచిపోలేను. అది నాకొక ఫ్యాన్‌ మూమెంట్‌ అనే చెప్పాలి. ఆయన నా గురించి ప్రస్తావిస్తూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది చూసి.. ఓ అభిమానిగా అదో పెద్ద అచీవ్‌మెంట్‌లా ఫీల్‌ అయ్యాను.

ఛలో.. మనాలీ
నాకు ప్రయాణాలంటే చాలా ఇష్టం. బాలీ, కశ్మీర్‌ నా ఫేవరెట్‌ డెస్టినేషన్స్‌. ఎప్పుడైనా బోర్‌ కొడితే సోలోగా వెళ్లి అక్కడి అందమైన ప్రదేశాలను చుట్టొస్తుంటాను. ఫ్యామిలీ వెకేషన్‌ అయితే మనాలీకే నా ఓటు. సినిమాల విషయానికి వస్తే బయోపిక్స్‌, స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలు ఎక్కువగా చూస్తుంటాను. ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ నాకు ఇష్టమైన సినిమా. ‘క్రీడ్‌’, ‘రాకీ’, ‘సౌత్‌పా’ వంటి బాక్సింగ్‌ సినిమాలు నాకు స్ఫూర్తినిచ్చాయి.  

బిర్యానీ ఇష్టం
అమ్మ, నాన్న సౌదీలో ఉద్యోగం చేసేవారు. నేను మా అమ్మమ్మ దగ్గర పెరిగాను. వాళ్లు తిరిగొచ్చే సమయానికి నా స్పోర్ట్స్‌ కెరీర్‌ మొదలైంది. అందుకే ఇప్పుడు.. ఏ కాస్త సమయం దొరికినా కుటుంబంతో గడపడానికి ఇష్టపడతాను. నేను ఏదైనా టూర్‌లో ఉంటే రోజుకి ఒకసారైనా వీడియో కాల్‌లో మాట్లాడుతాను. ఆటకోసం ప్రపంచమంతా తిరిగినా ఎప్పుడెప్పుడు అమ్మ చేతి బిర్యానీ తింటానా అని ఎదురుచూస్తుంటాను.

 స్కిప్పింగ్‌ చేయాల్సిందే..

ప్రతీరోజూ ఉదయాన్నే 30 నిమిషాల పాటు స్కిప్పింగ్‌ చేస్తా. స్కిప్పింగ్‌ నా దినచర్యలో భాగమైపోయింది. దాని తర్వాత కాసేపు వ్యాయామం చేస్తా. వర్కవుట్స్‌ ప్రారంభించడానికి ముందు కచ్చితంగా సంగీతం వింటాను. దానివల్ల రోజంతా చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఎలాంటి ఒత్తిడులు జయించడానికైనా వర్కవుట్స్‌ బెస్ట్‌ మెడిషన్‌ అని నమ్ముతాను. దానితోపాటు సరైన డైట్‌ పాటిస్తాను. ఏదైనా టోర్నమెంట్‌ ఉందంటే కొన్ని నెలల పాటు నాకిష్టమైన బిర్యానీ, బర్గర్‌, పిజ్జా, ఐస్‌క్రీమ్‌ను దూరంగా పెట్టేస్తాను.

బాక్సింగ్‌ అకాడమీ
జబ్‌, రైట్‌హుక్‌ పంచ్‌లంటే నాకు ఇష్టం. రింగ్‌లో ఉన్నప్పుడు ఆలోచించకుండా పంచ్‌లు విసరలేము. ప్రత్యర్థి ఆటను అంచనా వేస్తూ స్ట్రాటజీతో ముందుకు సాగాలి. అప్పుడే విజయం వరిస్తుంది. మన దగ్గర చాలామంది ప్రతిభ కలిగిన యువ ఆటగాళ్లు ఉన్నారు. వారికి సరైన శిక్షణ ఇస్తే  మన దేశానికి ఎన్నో స్వర్ణ పతకాలు సాధించగలరు. అలాంటి వారిని ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌లో బాక్సింగ్‌ అకాడమీని ప్రారంభించాలనుకుంటున్నా.

బయోపిక్‌.. అప్పుడేనా?
నా బయోపిక్‌ కోసం చాలామంది దర్శకులు నన్ను సంప్రదించారు. నా కెరీర్‌ తొలి దశలోనే బయోపిక్‌ వద్దనుకున్నాను. దానికి ఇంకా చాలా సమయం ఉందని నా అభిప్రాయం. ఒకవేళ నా జీవితకథే సినిమాగా వస్తే.. నా పాత్రలో అలియాభట్‌ నటిస్తే బాగుంటుంది. నాకు, తనకి కొంత దగ్గర పోలికలు ఉంటాయి. అంతేకాకుండా ఆమె అద్భుతమైన నటి కూడా.

Updated Date - 2023-04-16T12:33:19+05:30 IST