Taapsee Pannu : హీరో భార్యకు నచ్చలేదని నన్ను.. ఒకటి కాదు ఇలా ఎన్నో!

ABN , First Publish Date - 2023-12-17T09:34:39+05:30 IST

తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమై బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఎదిగింది... తాప్సీ పన్ను. సినిమా రంగంలోని వివాదాలు, సమస్యలపై ఎప్పటికప్పుడు కుండ బద్దలుకొట్టేలా మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుందీ పంజాబీ భామ.

Taapsee Pannu : హీరో భార్యకు నచ్చలేదని నన్ను.. ఒకటి కాదు ఇలా ఎన్నో!

తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమై బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఎదిగింది... తాప్సీ పన్ను. సినిమా రంగంలోని వివాదాలు, సమస్యలపై ఎప్పటికప్పుడు కుండ బద్దలుకొట్టేలా మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుందీ పంజాబీ భామ. ప్రస్తుతం ‘డంకీ’తో ప్రేక్షకులను పలుకరించేందుకు సిద్ధమైన ఈ సొట్టబుగ్గల సుందరి తన ఈ ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లు, అనుభవాలను ఇలా పంచుకుంది...

అభిప్రాయం మారింది...

నిజం చెప్పాలంటే అందానికి పరిమితులుగా చెప్పుకునేవాటికి నేను సరిపోను. నా కళ్లు పెద్దగా, చూడచక్కగా ఉండవు. అలాగే ముక్కు, పెదవులు కూడా అంత అందంగా ఏమీ కనిపించవు. ఆఖరికీ జుట్టు కూడా రింగు రింగులుగా ఉంటుంది. అందుకే మొదట్లో సెలూన్‌కి వెళ్లి రకరకాల కెమికల్స్‌తో హెయిర్‌ని అందంగా మార్చుకునేందుకు ప్రయత్నించా. అలా ఓ రెండుసార్లు చేయించుకున్నాక జుట్టు రాలడం మొదలైంది. దాంతో మళ్లీ వాటి జోలికి పోలేదు. మనల్ని మనం ఇష్టపడితే తప్పకుండా బాహ్య ప్రపంచానికి అందంగా కనిపిస్తామని కొంతకాలానికి అర్థమైంది. అప్పటి నుంచి అందంపై నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది.

డైటీషియన్స్‌కు ఎక్కువ ఖర్చుపెడతా

నేను డైట్‌కి, డైటీషియన్స్‌కు ఎక్కువగా ఖర్చుపెడుతుంటా. ఒక్కో సినిమాకు ఒక్కోలా శరీరాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. నా వృత్తికి అది చాలా అవసరం. ఫిట్‌గా ఉండాలంటే ప్రాంతాన్ని బట్టి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఆహార నియమాలు, అలవాట్ల గురించి సూచనలు చేసేందుకు నెలకు లక్షకు పైగా జీతం ఇచ్చి మరీ ఓ డైటీషియన్‌ను నియమించుకున్నా.

Taapsi.jpg-2.jpg

ఐరన్‌లెగ్‌ అనేవారు..

కెరీర్‌ ప్రారంభంలో నేను నటించిన తెలుగు సినిమాలు వరుసగా ఫ్లాప్‌ అయ్యాయి. దాంతో అందరూ నన్ను ఐరన్‌లెగ్‌ అంటూ విమర్శించడం మొదలెట్టారు. నిజం చెప్పాలంటే.. కమర్షియల్‌ చిత్రాల్లో హీరోయిన్ల పరిధి కేవలం కొన్ని సన్నివేశాలు, పాటలకే పరిమితం. అలాంటిది సినిమా పరాజయాల్లో హీరోయిన్లను ఎందుకు బాధ్యుల్ని చేస్తారో అర్థంకాదు. నా విషయంలో అదే జరిగింది. అలాంటి వాటికి మొదట్లో బాధపడినా, తర్వాత విమర్శలను పట్టించుకోవడం మానేశా.

తొలిప్రేమ..

తొమ్మిదో తరగతిలోనే నా ఫస్ట్‌ రిలేషన్‌ మొదలైంది. కానీ అది ఎక్కువ రోజులు కొనసాగలేదు. పదవ తరగతిలోకి రాగానే చదువుమీద దృష్టిపెట్టాలని చెప్పి అతడు నన్ను దూరం పెట్టేశాడు. ఆ సమయంలో సెల్‌ఫోన్లు ఉండేవికావు. ఓరోజు మా ఇంటి సమీపంలో ఉండే టెలీఫోన్‌ బూత్‌ నుంచి అతడికి కాల్‌ చేసి బాగా ఏడ్చేశా. అతడి జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు కొన్ని నెలలు పట్టింది. ఏది ఏమైనా తొలిప్రేమ ఎవరికైనా ఓ మధర జ్ఞాపకమే.

Taapsi-3.jpg

సినిమా నుంచి తప్పించారు

ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నా. కొంతమంది నేను అందంగా లేనన్నారు. ఓ సినిమాలో నేను భాగం కావడం ఓ హీరో భార్యకు నచ్చకపోవడంతో నన్ను హఠాత్తుగా తప్పించారు. అలాగే డబ్బింగ్‌ చెప్పే సమయంలో హీరోకి నా డైలాగ్‌లు నచ్చకపోతే మార్చాలని చెప్పేవాళ్లు. ఒకవేళ నేను నిరాకరిస్తే వెంటనే డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌తో డైలాగులు చెప్పించేవాళ్లు. అంతేకాదు.. ఓ హీరో సినిమాలోని తన పరిచయ సన్నివేశం కంటే నా పరిచయ సన్నివేశం పవర్‌ఫుల్‌గా ఉందని చెప్పి నా సీన్‌ని మార్పించేశాడు. ఇలా చెప్పుకుంటూపోతే ఇలాంటి చేదు అనుభవాలు బోలెడు.

ఆ పాత్రను ఛాలెంజ్‌గా తీసుకున్నా

‘శభాష్‌ మిథు’కు ముందు క్రికెట్‌ ఎలా ఆడాలో, అసలు బ్యాట్‌ ఎలా పట్టాలో కూడా నాకు తెలీదు. ఆ ఆటలో మాస్టర్‌ అయిన మిథాలీరాజ్‌ పాత్రని పోషించాల్సి వచ్చినప్పుడు ఓ ఛాలెంజ్‌లా తీసుకున్నా. మిథాలీ గురించి అందరికీ తెలుసు. అలా మన పక్కనే కనిపిస్తున్న ఒకరి పాత్రని పోషించడం అంత ఆషామాషీ కాదు. మా ఇద్దరికీ ఒక కామన్‌ పాయింట్‌ ఉంది. మేం చాలా భిన్నంగా కనిపిస్తాం కానీ మా ఇద్దరికీ బలమైన ఓ విజన్‌ ఉంటుంది. ఏం చేయాలీ, ఏం చేయకూడదనే విషయంలో మా ఇద్దరికి పూర్తి స్పష్టత ఉంది.

Updated Date - 2023-12-17T09:59:11+05:30 IST