Ameesha Patel: తప్పుగా అర్థం చేసుకున్నారు.. జాగ్రత్త చెప్పానంతే!

ABN , First Publish Date - 2023-08-19T19:23:04+05:30 IST

తెలుగులో అగ్ర హీరోల సరసన నటించిన అమీషా పటేల్‌ కొంతకాలంగా టాలీవుడ్‌కి దూరంగా ఉన్నారు. 2018 నుంచి బీటౌన్‌ సినిమాలోనూ ఆమె కనిపించింది లేదు. ఈ ఏడాది రెండు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించారు. తాజాగా సన్నీ దేఓల్‌ నటించిన ‘గదర్‌2’లో కనిపించారు.ఓటీటీ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌ కావడంతో క్లారిటీ ఇచ్చారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు.

Ameesha Patel: తప్పుగా అర్థం చేసుకున్నారు.. జాగ్రత్త చెప్పానంతే!

తెలుగులో అగ్ర హీరోల సరసన నటించిన అమీషా పటేల్‌ కొంతకాలంగా టాలీవుడ్‌కి దూరంగా ఉన్నారు. 2018 నుంచి బీటౌన్‌ సినిమాలోనూ ఆమె కనిపించింది లేదు. ఈ ఏడాది రెండు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించారు. తాజాగా సన్నీ దేఓల్‌ నటించిన ‘గదర్‌2’లో కనిపించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా ఆడుతోంది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఓటీటీ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌ కావడంతో క్లారిటీ ఇచ్చారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు.

‘ఓటీటీలకు సెన్సార్‌ లేకపోవడం వల్ల బోల్డ్‌ కంటెంట్‌ ఎక్కువగా వస్తుంది. పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి వాటిలో వచ్చే వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు చూడలేకపోతున్నాం. ఇలాంటి వాటికి పిల్లలను దూరంగా ఉంచాలి. వాటి వల్ల పిల్లలు చాలా ప్రభావితం అవుతున్నారు. పిల్లలు చూడటానికి వీలు లేకుండా చైల్డ్ లాక్ చేసుకోండి’’ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె వ్యాఖ్యానించారు. అయితే ఆమె మాటల్ని కొందరు తప్పుబట్టారు. దాంతో ఆమె మరోసారి స్పందించారు. కొందరు తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమె వెల్లడించారు.

‘‘ఓటీటీ విషయంలో నా మాటల్ని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారు. ఓటీటీలకు నేను వ్యతిరేకమని రాశారు. కానీ నేను అలా అనలేదు. ఓటీటీలో వచ్చే కథల్ని ఎక్కువ శాతం కుటుంబమంతా చూడలేకపోతున్నామని చెప్పాను. అసభ్యపదజాలం, హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇంట్లో అన్ని తరాల వారు కలిసి చూసేలా ఆరోగ్యకరమైన చిత్రాలు రావాలని కోరుకున్నా. అదే విషయాన్ని చెప్పాను. అంతేకానీ, నేను ఓటీటీ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. సినిమాలను ఎంత ఇష్టపడతానో.. వెబ్‌ సిరీస్‌లనూ అంతే ప్రేమిస్తాను. అలాంటి వాటిల్లో భాగం కావాలనుకుంటాను. రాబోవు తరానికి కూడా కుటుంబ వ్యవస్థపై గౌరవం పెరిగేలా కంటెంట్‌ ఉండాలన్నది నా అభిప్రాయం’’ అని అన్నారు.

Updated Date - 2023-08-19T19:23:04+05:30 IST