Bhanumathi Ramakrishna: ఆమె జాతకం చెబితే.. జరిగి తీరాల్సిందే!
ABN , First Publish Date - 2022-12-24T17:50:15+05:30 IST
హీరోయిన్లుగా ఆడవారి వేషాలు కూడా మగవారే వేసే ఆ రోజుల్లో ధైర్యంగా నేనున్నానంటూ.. కేవలం 13 సంవత్సరాల ప్రాయంలోనే.. ఇంట్లో సనాతన కట్టుబాట్లను ఎదిరించి..
హీరోయిన్లుగా ఆడవారి వేషాలు కూడా మగవారే వేసే ఆ రోజుల్లో ధైర్యంగా నేనున్నానంటూ.. కేవలం 13 సంవత్సరాల ప్రాయంలోనే.. ఇంట్లో సనాతన కట్టుబాట్లను ఎదిరించి, సంప్రదాయ సంగీత కళాకారుడైన తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్యను ఒప్పించి.. సినిమాలలో వేషం కట్టారు భానుమతి రామకృష్ణ (Bhanumathi Ramakrishna). ఆమె వర్థంతి నేడు (డిసెంబర్ 24). ఈ సందర్భంగా ఆమెను ఒక్కసారి స్మరణకు తెచ్చుకుందాం. 1925వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన.. ప్రకాశం జిల్లా, ఒంగోలులోని దొడ్డవరం గ్రామంలో భానుమతి జన్మించారు. తండ్రి స్ఫూర్తితో తాను కూడా సంప్రదాయ సంగీతాన్ని, నృత్యాన్ని నేర్చుకుని అపార సంగీత జ్ఞానాన్ని సముపార్జించారు.1939 సంవత్సరంలో తొలిసారిగా ‘వర విక్రయం’ అనే చిత్రంలో నటించిన భానుమతి కెరీర్‌ను ఆ తరువాత వచ్చిన ‘కృష్ణప్రేమ’, ‘స్వర్గసీమ’ చిత్రాలు మలుపుతిప్పాయి. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూనే.. సినీ సాంకేతిక నైపుణ్యంలోనూ ప్రావీణ్యం సంపాదించి.. నటిగా, గాయనిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, రచయితగా, సంగీత దర్శకురాలిగా, స్టూడియో యజమానిగా విభిన్న కోణాలను స్పృశిస్తూ సాటిలేని మేటి తెలుగు కళాకారిణిగా ఆమె ఎదిగారు. హీరోతో సమానమైన పాత్రలనే ఒప్పుకునేవారు ఆమె. చాలా మంది ఆమెకున్న కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే నైజాన్ని.. పొగరు అనుకునేవారు. అయినా ఆమె చలించేవారు కాదు. 1943, ఆగష్టు 8వ తేదీన తమిళ, తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఎడిటర్ అయినటువంటి పి.యస్. రామకృష్ణారావును ఆమె వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆమె పేరు భానుమతి రామకృష్ణగా మారింది.
భానుమతి రామకృష్ణకు జ్యోతిష్య, సాముద్రిక శాస్త్రాలలో మంచి అనుభవం ఉందన్న సంగతి చాలా కొద్ది మందికే తెలుసు.1950 ప్రాంతాల్లోనే ఆమె నాడీ గ్రంథాల మీద పరిశోధన చేశారంటే.. చాలా మంది నమ్మలేరు కూడా. ఎమ్జీఆర్ (MGR) వంటి నటుడికి రాజపరిపాలనాయోగం ఉందని.. ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఇరవై ఏళ్ల ముందే షూటింగ్ విరామ సమయంలో చేతిరేఖలు చూచి చెప్పిన సాముద్రిక వేత్త ఆమె. ఆ సంగతి ఆమె మరచిపోయినా, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే భానుమతికి ఆ విషయం గుర్తు చేశారట.
ప్రముఖ నవలా రచయిత్రి, కాలమిస్ట్ అయిన ఉంగుటూరి శ్రీలక్ష్మి (Unguturi Srilakshmi).. భానుమతి రామకృష్ణ గురించి తెలుపుతూ.. ‘‘1997వ సంవత్సరంలో ఓసారి.. 1998వ సంవత్సరంలో మరోసారి భానుమతి రామకృష్ణకు ఫోన్ చేశాను. ఆమె టీవీ సీరియల్ ‘నాలో నేను’ తీస్తున్నాను, బిజీగా ఉన్నాను అన్నారు. 1999 డిసెంబర్ 31న చెన్నైలో మళ్లీ ఫోన్ చేశాను. నువ్వు రెండు సార్లు ఫోన్ చేశావమ్మా... నాకు కుదరలేదు. రేపు తప్పకుండా అరగంట ఇంటర్వ్యూ ఇస్తాను... రమ్మన్నారు. ఆమె అంతలా నన్ను గుర్తుపెట్టుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆమెను ఇంటర్వ్యూ చేయడం అరగంటలో సాధ్యం కాలేదు. పాటలు పాడుతూ ఆమె, వింటూ నేను ఆ ఇంటర్వ్యూ అలా రెండున్నర గంటలు గడిచిపోయినై. ఆమెకు ఎన్నో రంగాల్లో ప్రవేశముంది. జాతకంలో కూడా మంచి నిష్ణాతురాలు. శివలెంక వీరేశలింగం గారి దగ్గర నేర్చుకున్నారు. చివరిగా వచ్చేముందు భానుమతి గారు నా నక్షత్రం అడిగి.. రేడియోలో వినిపించావు, అక్షరాల్లో చదివించావు, ఇక అందరికీ కనిపిస్తావు, పుస్తకాలు వేస్తావు అన్నారు. ఆ తర్వాత దూరదర్శన్‌లోను, కొన్ని ఛానెల్స్‌లోను వివిధ ప్రోగ్రాముల్లో పాల్గొనడం, నన్ను రచయిత్రిగా ఇంటర్వ్యూ చేయడం, కాలమిస్టుగా పేరు తెచ్చుకోవడం, కొంతమంది ఎడిటర్స్ నా చేత అడిగి మరీ కథలూ వ్యాసాలు రాయించడం, నేను పుస్తకాలు ప్రచురించడం జరిగాక భానుమతిగారి జ్యోతిష్యం ప్రతిభ అర్థమైంది. కాలమిస్టుగా రాయడం, నేను చేసిన ప్రముఖుల ఇంటర్వ్యూలు, రేడియోలో లైవ్, రికార్డింగ్ ప్రోగ్రాములు నాకు మధురమైన అనుభూతులు..’’ అని చెప్పుకొచ్చారు.
ఆమెను ‘మల్టీ ఫేసేటేడ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా’గా వర్ణిస్తారంటే.. ఆమె గొప్పతనం ఏమిటో తెలుసుకోవచ్చు. భానుమతిగారి నాన్నగారు నిష్టగా కొంతకాలం సూర్యోపాసనా, అరుణ పారాయణమూ, గాయత్రీ జపమూ చేసిన తర్వాత ఆమె పుట్టిందట. అందుకే ఆమెకు సూర్యుని పేరు కలిసి వచ్చేలా భానుమతి అని పెట్టారట. ఆమె ఆదివారం పుట్టడంతో.. సూర్యవరప్రసాదినిగా ఆమెను వాళ్ల నాన్నగారు చెప్పుకునేవారట. ఆమెకు సంగీత జ్ఞానం కూడా ఎక్కువే. ఘంటసాల వంటివారు భానుమతి ఎదుట పాట పాడటానికి జంకేవారంటే.. ఆమె సంగీత జ్ఞానం ఎంత లోతైనదో అర్థం చేసుకోవచ్చు. ఆమె సినిమాలలో త్యాగరాజ కృతి, సాంప్రదాయ కీర్తనలలో ఏవో ఒకటి తప్పకుండా ఉంటాయి. ఆమె పాడిన ‘నగుమోము గనలేని’ కీర్తన ఒక్కటి చాలు.. ఆమె స్థాయి ఏమిటో చెప్పడానికి. ఇంత చక్కని సంగీత పరిజ్ఞానం ఉన్న ఆమె.. సంగీత రంగంలో మాత్రం సరైన పేరు ప్రఖ్యాతులు గడించలేకపోయింది. అయినా అనేక రంగాలలో ఆమె ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుని.. ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించుకున్నారు. 2005 డిసెంబర్ 24న చెన్నైలోని తన స్వగృహంలో భానుమతీ రామకృష్ణ పరమపదించారు.