Year Ender 2022: టాలీవుడ్‌ను కుదిపేసిన వివాదాలు

ABN , First Publish Date - 2022-12-22T16:56:29+05:30 IST

టాలీవుడ్ నుంచి వస్తున్న మూవీస్ భారీ వసూళ్లను రాబడుతుండటంతో సహజంగానే ఈ ఇండస్ట్రీ అందరిని ఆకర్షిస్తుంది. ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమ భారీ విజయాలను అందుకోవడంతో పాటు వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. కొన్ని వివాదాలు టాలీవుడ్‌ను కుదిపేశాయి.

Year Ender 2022: టాలీవుడ్‌ను కుదిపేసిన వివాదాలు

సినిమా ఇండస్ట్రీ అంటెనే గ్లామర్ ప్రపంచం. ప్రతి ఒక్కరి చూపు దాని పైనే ఉంటుంది. ఏ ఇండస్ట్రీ అందుకు మినహాయింపు కాదు. ఇండియన్ ఇండస్ట్రీలోనే టాలీవుడ్ సినిమాలు భారీ స్థాయి వసూళ్లను రాబడుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘కార్తికేయ 2’ వంటి చిత్రాలు సంచలన విజయాన్ని సాధించాయి. టాలీవుడ్ నుంచి వస్తున్న మూవీస్ భారీ వసూళ్లను రాబడుతుండటంతో సహజంగానే ఈ ఇండస్ట్రీ అందరిని ఆకర్షిస్తుంది. ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమ భారీ విజయాలను అందుకోవడంతో పాటు వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. కొన్ని వివాదాలు టాలీవుడ్‌ను కుదిపేశాయి. కొందరు సెలబ్రిటీలు చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. అటువంటి వాటిపై ఓ లుక్కేద్దామా మరి..

Mahesh-Babu.jpg

మహేశ్ బాబు (Mahesh Babu):

బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తనను భరించలేదని మహేశ్ బాబు అన్నాడు. అక్కడికి వెళ్లి సమయాన్ని వృథా చేసుకోవాలనుకోవడం లేదని చెప్పాడు. టాలీవుడ్‌లో తనకు అమితమైన ప్రేమాభిమానాలు లభిస్తున్నాయని పేర్కొన్నాడు. అందువల్ల వేరే పరిశ్రమకు వెళ్లాలని ఎప్పుడు అనుకోలేదని వివరించాడు. మేజర్ ప్రమోషన్స్‌లో భాగంగా మహేశ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఫిల్మ్ మేకర్స్ అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేశారు.

Sai-Pallavi.jpg

సాయి పల్లవి (Sai Pallavi):

విరాట పర్వం ప్రమోషన్స్ సమయంలో ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా గురించి సాయి పల్లవి మాట్లాడింది. ‘‘పండిత్‌లను 1990ల్లో ఏ విధంగా చంపారో ది కశ్మీర్ ఫైల్స్ సినిమాలో చూపించారు. కోవిడ్ సమయంలో ఓ ప్రాంతంలో గోవును వాహనంలో తరలించారు. దాని డ్రైవర్ ఓ ముస్లిం. కొంత మంది అతడిని కొట్టి జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. అప్పుడు జరిగిన దానికి, ఇప్పుడు జరిగిన దానికి తేడా ఏముంది’’ అని సాయి పల్లవి చెప్పింది. తన వ్యాఖ్యలపై అనేక మంది అభ్యంతరం చేయడంతో తార్వాత ఓ ప్రకటనను విడుదల చేసింది.

Vijay-Deverakonda.jpg

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda):

లైగర్ పరాజయం తర్వాత ఆ సినిమా కష్టాలు విజయ్ దేవరకొండను వెంటడాయి. లైగర్ పెట్టుబడుల విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విజయ్‌ను ప్రశ్నించింది. రెమ్యూనరేషన్ విషయంలో ప్రశ్నలు అడిగింది. దాదాపుగా 9గంటల పాటు విచారణ జరిపింది. అంతకు ముందు ఇదే విషయంలోనే ‘లైగర్’ నిర్మాతలు పూరీ జగన్నాథ్‌, ఛార్మికౌర్‌లను ఈడీ ప్రశ్నించింది.

Dil-Raju.jpg

దిల్ రాజు (Dil Raju):

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన సినిమా ‘వారిసు’. ఈ చిత్రం తెలుగులో ‘వారసుడు’ టైటిల్‌తో విడుదల కానుంది. సంక్రాంతి సందర్భంగా వారసుడు చిత్రాన్ని విడుదల చేస్తామని కొన్ని నెలల ముందే దిల్ రాజు ప్రకటించాడు. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. అయితే, సంక్రాంతికి తెలుగు సినిమాలకు మాత్రమే ప్రాధాన్యమివ్వాలని డబ్బింగ్ చిత్రాలను విడుదల చేయవద్దని తెలుగు సినీ నిర్మాతల మండలి లేఖను విడుదల చేసింది. ఈ లేఖపై కోలీవుడ్‌కు చెందిన దర్శక, నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-22T20:49:55+05:30 IST